సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని సి-బ్లాక్ ఎదుట ఓ రైతు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దేవన్న (37)కు ప్రభుత్వం చెరువు పక్కన గతంలో మూడెకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం కింద మామిడి, జామ చెట్లు పెంచుకుంటున్నాడు. చెరువు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దేవన్న కొంత భూమిని కోల్పోయాడు.
భూమికి బదులు భూమి ఇప్పించాలంటూ కొన్నాళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం భార్య లలిత, ఇద్దరు పిల్లలతో కలసి సచివాలయం వద్దకు వచ్చాడు. మంత్రి హరీశ్‌రావును కలవాలని భావించాడు. మూడేళ్ళుగా అధికారుల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదంటూ సూసైడ్ నోట్ రాశారు.‘నా చావుకు కారణం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జాయింట్ కలెక్టర్ శివ లింగయ్య’అని అందులో పేర్కొన్నారు.
తనకు తిండి, నీరు, ఉపాధి లేకుండా చేసి వేధిస్తున్నారంటూ ఆరోపించాడు. దళితులకు న్యాయం చేయాలని సీఎంను వేడుకున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు కూడా లేఖ రాశాడు. ప్రజారాజ్యం పార్టీ కోసం నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నానని పార్టీ కోసం పని చేసిన పుణ్యానికి నా తండ్రిని, కొడుకుని పోగొట్టుకున్నానని పేర్కొన్నాడు. నేను చనిపోయిన తర్వాత నా భార్య బిడ్డలను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్‌ను కోరారు. టాయిలెట్ క్లీనర్ తాగిన దేవయ్యను పోలీసులు మాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు. దేవయ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
సచివాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
Published Fri, Jun 9 2017 11:10 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
Advertisement