Minister indrakaran Reddy
-
కవాల్ టైగర్ రిజర్వ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి రమణీయత, జలపాతాలు, ఎటుచూసినా ఆకుపచ్చని అటవీ అందాలతో అలరారుతున్న కవాల్ పులుల రక్షిత అటవీ ప్రాంతంపై అటవీ శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. పర్యాటకులు, సందర్శకులకు ఉపయోగకరమైన పూర్తి సమాచారంతో తయారుచేసిన సైట్‌ను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అరణ్యభవన్‌లో మంగళవారం ప్రారంభించారు. చదవండి: అక్కడ ‘కారు’ గెలుపు డౌటే!.. కారణం అదేనా? కవాల్ అటవీ ప్రాంతం ప్రత్యేకత, విస్తరించిన ప్రాంతాలు, జంతువులు, పక్షులు, చెట్ల జాతుల వివరాలు, సందర్శనీయ స్థలాలు, ఎకో టూరిజం ప్రాంతాలు, సఫారీ, అన్లైన్ బుకింగ్ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కవాల్టైగర్.కామ్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాగా... కవాల్ అటవీ ప్రాంతంలో అభివృద్ది చేసిన గడ్డి మైదానాలపై (గ్రాస్ లాండ్స్) ప్రత్యేక బుక్‌లెట్‌ను, రాష్ట్రంలో మరొక పులుల సంరక్షణ కేంద్రం అమ్రాబాద్ టైగర్ రిజర్వు వార్షిక నివేదికను సైతం మంత్రి విడుదల చేశారు. కవాల్ అభయారణ్యం సిబ్బంది బాగా పనిచేస్తున్నారన్న మంత్రి... ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్‌ను అభినందించారు. ఇక్కడ ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన గడ్డి మైదానాలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోందని, జాతీయ పులుల సంక్షణ సంస్థ (ఎన్టీసీఏ) నిపుణులు ప్రశంసించారని పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, వివిధ అటవీ సర్కిళ్ల అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు
-
యాదాద్రి పనులు 90 శాతం పూర్తి
యాదగిరిగుట్ట: ‘యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పనులు 90 శాతం పూర్తయ్యాయి. కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయి. క్యూలైన్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి’అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పనులను పరిశీలించారు. అనంతరం హరిత హోటల్లో దేవాలయ అధికారులతో కలసి పెండింగ్ పనులపై సమీక్షించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి పనుల పురోగతిని వివరించారు. ధ్వజస్తంభం పనులు ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయన్నారు. క్యూ కాంప్లెక్స్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కొండ కింద పుష్కరిణి పనులు పూర్తయ్యాయని, గండి చెరువు, కల్యాణ కట్ట 90 శాతం పూర్తయ్యాయని, అలాగే ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం పూర్తయిందని మంత్రి వెల్లడించారు. మార్చి 20 వరకు కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందన్నారు. ఆలయ ప్రారంభ సమయానికి అన్నప్రసాద మండపం పూర్తి కాకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయ ప్రారంభంనాటికి ఏమైనా పనులు పెండింగ్‌లో ఉంటే అవి తరువాత నిరంతరం కొనసాగుతాయని మంత్రి చెప్పారు. యాగం నిర్వహణకు సంబంధించిన సామగ్రి, ఆరువేల మంది రుత్వికుల జాబితా సిద్ధమైందని వివరించారు. సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణ తిరుపతిగా అవతరించ బోతోందని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. మార్చి 21వ తేదీ నుంచి 1,008 హోమ కుండాలతో మహా సుదర్శన యాగం, 28వ తేదీన శాస్త్రోక్తంగా మహా కుంభ సంప్రోక్షణతో భక్తులకు స్వయంభూ దర్శనాలు కలుగుతాయని చెప్పారు. -
కేసీఆర్ దృష్టికి తీసుకెళతా!
‘‘ప్రపంచ ప్రఖ్యాత నిర్మల్ బొమ్మల నేపథ్యంలో, అంతరించిపోతున్న హస్తకళలు, కళాకారుల గురించి కృష్ణకుమార్ తీసిన ‘రాధాకృష్ణ’ను అంతా ఆదరించాలి’’ అని తెలంగాణ పర్యావరణ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. ‘ఢమరుకం’ శ్రీనివాసరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందింది. టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వంలో పుప్పాల సాగరికా కృష్ణకుమార్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి మాట్లాడుతూ–‘‘పూర్తిగా తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోనే చిత్రీకరించిన సినిమా ఇది. అందులోనూ నిర్మల్ కళాకారుల కష్టాల నేపథ్యంలో మంచి ఆశయంతో తీసినందున ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీనుకెళ్తాను’’ అన్నారు. ‘‘శ్రీనివాస్‌రెడ్డి పట్టుబట్టి ఈ సినిమాలో నాతో ఒక పాత్ర చేయించారు’’ అన్నారు ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. ‘‘కేవలం ప్రేమకథా చిత్రంగానే కాక అంతరించి పోతున్న హస్తకళలను బ్రతికించాలని ఒక మంచి సందేశాన్ని ‘రాధాకృష్ణ’లో ఇస్తున్నాం’’ అన్నారు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు పుప్పాల సాగరిక కృష్ణకుమార్. ప్రసాద్ వర్మ, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, నటుడు అలీ, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తదితరులు మాట్లాడారు. -
ఆలయాలకు భక్తులు రావొద్దు..
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ చైనా నుంచి 180 దేశాలకు వ్యాపించిందని చెప్పారు. తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్ట చర్యలకు ఆదేశించారని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను క్వారంటైన్ కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. దేవాలయాల్లో రద్దీ తక్కువ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించామని చెప్పారు. నిన్నటి నుంచి అన్ని ఆలయాల్లో భక్తులకు అనుమతులు నిలిపివేశామన్నారు. (కరోనా అలర్ట్: 271కి చేరిన బాధితుల సంఖ్య) దేవాదాయ శాఖ కార్యాలయంలో పంచాంగ శ్రవణం ప్రతి ఏటా ఉగాది పంచాంగ శ్రవణం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో జరిగేందని.. కానీ ఈ ఏడాది దేవాదాయ శాఖ కార్యాలయంలో జరుగుతుందన్నారు. లైవ్ ద్వారా మాత్రమే భక్తులు పంచాంగ శ్రవణం వినాలని సూచించారు. కరోనా కట్టడికి చర్యల్లో భాగంగా శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఆడంబరాలు లేకుండా జరిపేవిధంగా ఆదేశాలిచ్చామని తెలిపారు. తక్కువ మంది మాత్రమే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతారని పేర్కొన్నారు. (‘దగ్గు, గొంతు నొప్పి.. ఆ తర్వాత కరోనా’) -
వేద విద్య ప్రోత్సాహానికి పాఠశాలలు: ఇంద్రకరణ్
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, పూజారులు, వేద పండితులు, సిద్ధాంతుల సంక్షేమానికి పాడుతోందని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ, భాషా సాంస్కృతిక శాఖలు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సహకారంతో రెండు రోజుల తెలంగాణ జ్యోతిష మహాసభలు–2018 సోమవారం రవీంద్రభారతిలో ప్రారంభమయ్యాయి. వేదవిద్యను ప్రోత్సహించేందు కు రాష్ట్రంలో అవసరమైనన్ని వేద పాఠశాలలు ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, జ్యోతిష మహాసభలు సమాజ శ్రేయస్సుకు, రాష్ట్ర సంక్షేమానికి తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యాశంకర భారతీస్వామి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సనాతన జ్యోతిశ్శాస్త్ర విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు యాయ వరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి మాట్లాడుతూ, ఈ మహాసభలు రాబోయే పండుగల తేదీలపై ఏకాభిప్రాయం సాధించేందుకు దోహదపడతాయన్నారు. జ్యోతిశ్శాస్త్ర వైభవమ్ విశిష్ట సంచికను ఆవిష్కరించి తొలి ప్రతిని గాయత్రీ పీఠం తత్త్వానంద రుషికి అంద జేశారు. కార్యక్రమంలో ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకుడు మరుమాముల వేంకటరమణ శర్మ, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి సముద్రా ల వేణుగోపాలాచారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు బోర్పట్ల హనుమంతాచార్య, కవేలి అనంతాచార్యులు, కృష్ణమాచార్య సిద్ధాంతి, అంతర్వేది కృష్ణమాచార్యులు, తెలంగాణ విద్వత్సభ ఉపాధ్యక్షుడు ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 2 నుంచి లాయర్లకు హెల్త్‌కార్డులు
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల సంక్షేమనిధి కోసం గతంలో కేసీఆర్ సర్కార్ కేటాయించిన రూ.వంద కోట్లపై వచ్చిన రూ.23 కోట్ల వడ్డీని న్యాయవాదుల సంక్షేమానికి వెచ్చి ంచాలని తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ నిర్ణయించింది. శనివారం సచివాలయం లో న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న లాంఛనంగా న్యాయవాదులకు హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్నారు. అదేరోజు మూడు కీలక పథకాలను ప్రారంభిస్తామని చెప్పారు. న్యాయవాదికి రూ.2 లక్షల మేరకు ఆరోగ్య బీమా కల్పించాలని, ప్రమాదంలో మరణిస్తే ప్రమాద బీమా పథకం కింద కుటుంబసభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సా యం చేయాలని సమావేశం నిర్ణయించిందని చెప్పారు. -
పులకించిన భద్రగిరి
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కల్యాణం సోమవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. రామాలయ సమీపంలోని మిథిలా ప్రాంగణంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకను కనులారా చూసిన భక్తులు పులకించిపోయారు. వేడుకలో భాగంగా మొదట గర్భగుడిలో అభిషేకం జరిపించారు. అక్కడ ధ్రువమూర్తులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తర్వాత వేద పండితుల మంత్రోచ్ఛరణలు, ఆలయ ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. భక్త రామదాసు చేయించిన బంగారు నగలను ధరించిన శ్రీసీతారాముల వారు చూడముచ్చటగా కనిపించారు. ఉదయం 10 గంటల నుంచి ఆలయ వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణ తంతు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తంలో జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ విగ్రహాల శిరస్సులపై ఉంచారు. భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో మాంగల్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తలంబ్రాలు పోసే వేడుకను జరిపించారు. భద్రాద్రి క్షేత్ర మహత్మ్యం, శ్రీసీతారాముల కల్యాణ విశిష్టతను వేద పండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు. మార్మోగిన రామనామస్మరణం శ్రీసీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు. సుమారు 1.50 లక్షల మంది కల్యాణాన్ని తిలకించారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి కల్యాణ వేడుక తంతు జరుగుతున్నంత సేపూ మిథిలా ప్రాంగణం రామనామస్మరణంతో మార్మోగింది. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీసీతారాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువస్త్రాలు తీసుకొస్తారని ప్రకటించినప్పటికీ.. చివరి క్షణాల్లో ఆయన పర్యటన రద్దయింది. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున జేఈవో శ్రీనివాసరాజు శ్రీసీతారాముల వారికి పట్టువస్త్రాలను అందజేశారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కల్యాణోత్సవాన్ని వీక్షించారు. స్వామివారికి కల్యాణం జరిగిన వేదికపైనే మంగళవారం పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ఆర్మూర్ : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించ నుందని, ప్రతి మున్సిపాలిటీకి రూ.50 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు కేటాయింపులుంటా యని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణాభివృద్ధికి మంజూరైన రూ.25 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, భవిష్యత్‌లో మంజూరు కానున్న మరో రూ.25 కోట్ల తో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పట్టణం లోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఆదివారం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి సింగ్ అధ్యక్షతన క్షత్రియ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ఇంద్రకణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజల అభిప్రాయాలను సేకరించి నిధు ల కేటాయించడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో సిద్దుల గుట్టతో పాటు మరో 50 ఆలయాలకు నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పేదలు ఆత్మగౌరవం తో జీవించాలనే లక్ష్యంతో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు త్వరలో పూర్తవుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు చేపట్టిన పనులను సీడబ్ల్యూసీ కమిటీ ప్రతినిధులు చూసి కితాబునిచ్చారన్నారు. 2019–20 సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు పెరగనుందన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి పనుల తరువాత సంక్షేమానికి పెద్ద పీట వేయనున్నారన్నారు. ఆర్మూర్ కోర్టులో కేసుల పెండెన్సీ ఉంటే సబ్ కోర్టును మంజూరు చేస్తామన్నారు. అభివృద్ధిలో అన్ని వర్గాల భాగస్వామ్యం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆర్మూర్ మున్సిపాలిటీని ఆదర్శం గా నిలిపేవిధంగా అభివృద్ధి చేస్తామన్నారు. గత పాలకులు పట్టణాభివృద్ధిని విస్మరించారన్నారు. కానీ ప్రస్తుతం పట్టణంలో రూ.31 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. త్వరలో మరిన్ని నిధులు మంజూరవుతాయని, పట్టణ రూపు రేఖలు మారిపోనున్నాయన్నారు. అన్ని వర్గాల వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, కౌన్సిలర్లు, న్యాయవాదులు, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు, ఐఎంఏ ప్రతినిధులు, మర్కజి కమిటీ ప్రతినిధులు, కుల, యువజన సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి పెద్దపీట మాక్లూర్(ఆర్మూర్) : ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న శ్రీఅపురూప వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వంటశాల గదిని ప్రారంభించారు. ఆలయ ఆవరణలో కల్యాణ మండపం నిర్మాణానికి రూ.50 లక్షలు మాంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు మాంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గం గోని సంతోష్, ఎంపీటీసీ సభ్యులు ఎనుగం టి లక్ష్మీ, ఎంపీపీ గురిజాల శిరీష, ఆలయ చైర్మన్ అమృతలత, మాజీ జెడ్పీటీసీ సభ్యు లు ఆకుల విజయ, భక్తులు పాల్గొన్నారు. -
డబుల్ వేగం..!
నియోజకవర్గాలకు ఇళ్ల కేటాయింపు ఇలా నిర్మల్ : 1400 ముథోల్ : 1400 ఖానాపూర్ : 560 మొత్తం : 3,360 పరిపాలన ఆమోదం : 2,626 టెండర్లు పిలిచినవి : 1,740 టెండర్లు పూర్తయినవి : 533 నిర్మాణం పూర్తయినవి : 45 నిర్మాణంలో ఉన్నవి : 24 శంకుస్థాపన చేసినవి : 160 నిర్మల్ : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తోంది. ఇప్పటివరకు కాంట్రాక్టర్ల సమస్యతో జిల్లాలో ఈ పథకం నత్తకే నడక నేర్పేలా సాగుతోంది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న తన ఇలాఖాలోనే ఇళ్ల నిర్మాణంలో వెనుకంజలో ఉండడంపై అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సీరియస్‌గా దృష్టిపెట్టారు. ఇక జిల్లాలో ఎలాగైన ఈ పథకం విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ‘డబుల్’ స్పీడ్ పెంచేలా అధికారులతో ఇటీవలే సమీక్షించారు. ఈమేరకు ఆదివారం నిర్మల్‌లో 160ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. త్వరలో మరిన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించనున్నట్లు పేర్కొ న్నారు. ఏడాదిలోపే నిర్మాణా లను పూర్తిచేసి అర్హులందరికీ అందిస్తా మని చెప్పారు. ఈక్రమంలో పేదల ఆశలూ ‘డబుల్’ అయ్యాయి. స్పీడ్ పెంచాల్సిందే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మే రకు అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో జిల్లా చాలా వెనుకబడి ఉంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 3,360 ఇళ్లు కేటాయించారు. ఇందులో 2,626 గృహాలకు మాత్రమే పరిపాలన అనుమతులు లభించాయి. ఇందులో 1,763 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలవగా 533 మాత్రమే టెండర్ ఆమోదం పొందాయి. ఇక ఇందులో ఇప్పటివరకు కేవలం 45ఇళ్లు మాత్రమే పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. మరో 24 ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన 45ఇళ్లు, నిర్మాణంలో ఉన్న 24ఇళ్లు కూడా నిర్మల్ రూరల్మండలంలోని మంత్రి స్వగ్రామం ఎల్లపెల్లిలోనివే. జిల్లాలో మరెక్కడా ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టలేదు. కాంట్రాక్టర్లే అసలు సమస్య.. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలవగానే మొదట్లో కాంట్రాక్టర్లు క్యూకట్టారు. తీరా.. ప్రభుత్వం ఇస్తున్న నిధులతో క్షేత్రస్థాయిలో నిర్మించాలంటే ఎదురవుతున్న ఇబ్బందులతో ఒక్కొక్కరూ ముఖం చాటేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటిని రూరల్ ఏరియాలో రూ.5.04లక్షలతో, అర్బన్‌లో రూ.5.30లక్షలతో నిర్మించాలంటోంది. ఈ పరిధిలో ప్రస్తుత మార్కెట్లో కష్టమంటున్నారు కాంట్రాక్టర్లు. ఒక్కో ఇల్లుకు కనీసం రూ.6.50లక్షల వరకు ఖర్చవుతుంది. ఇక పన్నులు వ్యాట్ నుంచి జీఎస్టీకి మారినా ప్రభుత్వం పర్సంటేజీ పెంచకపోవడమూ కాంట్రాక్టర్ల వెనుకంజకు కారణమవుతోంది. వ్యాట్ అమలులో ఉన్నప్పుడే తాము నష్టపోతామని వెనుకంజ వేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం వ్యయం పెంపుపై స్పందించకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకపోవడంతో విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపడతామని టెండర్ తీసుకున్న ఏఎన్ కన్స్ట్రక్షన్ కంపెనీ పత్తాలేకుండా పోయింది. దీంతో అధికారులు మళ్లీ కొత్త కాంట్రాక్టర్లను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రికి ప్రతిష్టాత్మకం.. రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన ఇలాఖాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈనేపథ్యంలోనే టెండర్ తీసుకున్న కాంట్రాక్టర్ వెనుకంజ వేసినా.. జిల్లాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్రెడ్డిని ఒప్పించి, తన స్వగ్రామం, దత్తత గ్రామమైన ఎల్లపెల్లిలో 45ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా చేశారు. సదరు కాంట్రాక్టర్ సైతం ఈ ఇళ్లను శరవేగంగా సకల హంగులతో పూర్తి చేసి ఇచ్చారు. అదే గ్రామంలో మరో కాంట్రాక్టర్‌తో 24ఇళ్లను మంత్రి నిర్మింపజేయిస్తున్నారు. ఇక తమ స్వగ్రామానికే పథకాన్ని పరిమితం చేశారన్న విమర్శలు రావడంతో జిల్లావ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నిర్మల్‌లో 160ఇళ్లకు.. అర్బన్ ప్రాంతమైన నిర్మల్‌లో ఈనెల 28న 160 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పట్టణ శివారులోని బంగల్పేట్ మహాలక్ష్మి మందిరం సమీపంలో వీటి నిర్మాణం కోసం స్థలం కేటాయించారు. నిర్మల్ నియోజకవర్గానికి 1400 ఇళ్లు కేటాయించారు. ఇందులో 1,226 నిర్మాణాలకు పరిపాలన అనుమతులు లభించాయి. ఎల్లపెల్లిలో 45 నిర్మాణాలు పూర్తికాగా, 24ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. తాజాగా ఆదివారం నిర్మల్‌లోని బంగల్పేట్ శివారులో మరో 160ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే వీటి నిర్మాణాలు ప్రారంభించేలా చూస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎల్లపెల్లిలో ఎదురుచూపులు.. ఎల్లపెల్లిలో 45ఇళ్లను విశాలంగా నిర్మించారు. ఒక్కో ఇంటిలో హాల్, కిచెన్‌తోపాటు రెండు పడక గదులు నిర్మించారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టం, అన్ని ఇళ్లకూ కామన్‌గా సెప్టిక్‌ట్యాంకును ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ.. ఇళ్ల నిర్మాణం పూర్తయి నెలలు గడిచిపోయాయి. లబ్ధిదారుల ఎంపికను మొదటి గ్రామసభలో పూర్తిచేశారు. మొత్తం 45మంది లబ్ధిదారులతో కూడిన జాబితానూ రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. గత కలెక్టర్ ఈ జాబితాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడంతో అలా ఆగిపోయింది. కొత్త కలెక్టర్ ప్రశాంతి వచ్చాక పూర్తయిన ఇళ్లు, లబ్ధిదారుల జాబితానూ పరిశీలించినట్లు తెలిసింది. కానీ ఇప్పటికీ ఇళ్ల పంపిణీ మాత్రం చేపట్టడం లేదు. త్వరలో రెండో గ్రామసభ పెట్టి ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టేందుకే ఆపారని అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. -
నిర్మల్ బస్టాండ్‌లో మంత్రి తనిఖీ
నిర్మల్‌టౌన్ : ∙నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆదివారం రాష్ట మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తనిఖీ చేశారు. సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. బస్సు సర్వీసుల సేవలపై ఆరా తీశారు. బస్సుల వేళల్లో సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా? అని ప్రయాణికులను అడిగారు. ప్రయాణికులు తమ సమస్యలు మంత్రి ఐకేరెడ్డి దృష్టికి తీసుకురాగా, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాయకులు అప్పాల గణేశ్, ముత్యంరెడ్డి, పాకాల రాంచందర్, కౌన్సిలర్ నేల్ల అరుణ్, తోట నర్సయ్య తదితరులున్నారు. -
అర్చకుల వేతన సవరణలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణ వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రభుత్వం ముందు ప్రకటించినట్టుగా కాకుండా అమలు వేరే రకంగా ఉందంటూ అర్చక, ఉద్యోగులు శుక్రవారం రాత్రి వరకు దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మధ్యాహ్నం అదే కార్యాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలను సన్మానించిన ఆ ప్రతినిధులు.. తర్వాత వాస్తవం తెలిసి అదే కార్యాలయం ముందు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మేలు చేసేలా వ్యవహరిస్తే, అధికారులు మాత్రం ఆయన హామీకి విరుద్ధంగా తమకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన ప్రారంభించారు. అధికారులకే అస్పష్టత...! దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతన సవరణకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీర్ఘకాలంగా దేవాలయ అర్చక, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడంతో ముఖ్యమంత్రి స్పందించారు. ఈ మేరకు చట్టసవరణ జరిగి డిసెంబర్ 1 నుంచే కొత్త వేతనాలను చెల్లించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఇంతకాలం ఏ ఆలయంలో ఉద్యోగులు, అర్చకులకు ఆ ఆలయ ఆదాయం నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు. అలా కాకుండా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి నేరుగా ప్రభుత్వమే ఉద్యోగులు, అర్చకుల బ్యాంకు ఖాతాలకు ఒకటో తేదీనే జమ చేసేలా, పీఆర్సీ అమలు చేసేలా నిర్ణయం ఉందని అంతా భావించారు. శుక్రవారం మధ్యాహ్నం చెక్కు అందజేసే కార్యక్రమానికి రావాల్సిందిగా పేర్కొనటంతో 88 మంది ప్రతినిధులు కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలు ఆంధ్రాబ్యాంకు ప్రతినిధులకు చెక్కు అందజేశారు. వెంటనే ఉద్యోగులు, అర్చక ýప్రతినిధులు ఆ ఇద్దరిని సన్మానించి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. వారు వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసి ఆగ్రహానికి గురయ్యారు. చాలా వివరాలకు అధికారుల వద్దనే స్పష్టత లేదని, అంతా గందరగోళం చేసి తమను వంచించారని వారు ఆరోపించారు చారిత్రక దినం.. దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ మేరకు ఆలయ ఉద్యోగులు, అర్చకులకు వేతన సవరణ అమలు చేస్తున్నందున డిసెంబరు ఒకటి చారిత్రక దినంగా నిలిచిపోతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అంతకుముందు వ్యాఖ్యానించారు. సీఎం తీసుకున్న సానుకూల నిర్ణయం అర్చక, ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగు నింపుతుందని రమణాచారి పేర్కొన్నారు. ఈ సవరణ మహోన్నత నిర్ణయమని తెలంగాణ అర్చక సమాఖ్య నేతలు ఉపేంద్రశర్మ, రామశర్మలు పేర్కొన్నారు. రెండు వేల మందికే వర్తింపు ఇప్పటి వరకు ఆలయాల నుంచి తీసుకుంటున్న వేతనాలను ఆలయాల నుంచే తీసుకోవాలని, సవరణతో పెరిగే మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేస్తుందని అధికారులు పేర్కొనడంతో కంగుతినడం అర్చకుల వంతయింది. ఇక వేతన సవరణ అమలు కావాల్సిన 5,200 మందిలో కేవలం 2 వేల మందికే ప్రస్తుతం వర్తింపజేస్తున్నారని, మిగతావారి విషయంలో సాంకేతిక కారణాలతో తర్వాత పరిశీలిస్తామని అధికారులు చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. ఇక 2015 పీఆర్సీ పరిధిలో ఉన్నవారి సవరణ అంశాన్నీ పక్కన పెట్టారు. మళ్లీ దేవాలయాల నుంచి వేతనాలు పొందే విషయంలో స్థానిక కార్యనిర్వహణాధికారులు, పాలక మండళ్లతో వేధింపులు ఎదురవుతున్నాయని మొత్తుకుంటే ఇప్పుడు మళ్లీ వారి నుంచే వేతనాలు పొందాలని మెలిక పెట్టడం వెనక అధికారుల కుట్ర ఉందని అర్చక, ఉద్యోగ ప్రతినిధులు ఆరోపిస్తూ వెంటనే కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా ప్రారంభించారు. సీఎం సానుకూలంగా స్పందిస్తే అధికారులు కుట్ర చేసి ఆయన ఆలోచనను నీరుగార్చారని పేర్కొంటూ జేఏసీ నేత గంగు భానుమూర్తి ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. చివరకు అదనపు కమిషనర్లు శ్రీనివాసరావు, కృష్ణవేణి సోమవారం కమిషనర్‌తో చర్చించవచ్చని పేర్కొనటంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. -
ఆలయాల్లో అద్దెలు స్వాహా!
సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్ నగరంలో శంకరమఠం పేరుతో నిర్వహిస్తున్న ఆధ్మాత్మిక కేంద్రం. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ మఠం కింద 55 దుకాణాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఒక్కో దుకాణానికి రూ.10 వేల వరకు నెలవారీ అద్దె ఉంది. వెరసి మఠానికి ఏటా రూ.60 లక్షలకుపైగా అద్దె వసూలుకావాలి. కానీ దేవాదాయశాఖ ఖజానాకు చిల్లిగవ్వ కూడా జమకావడం లేదు. ఆ సొమ్మంతా ప్రైవేటు వ్యక్తులు, కొందరు అధికారులు కలసి స్వాహా చేసేస్తున్నారు. ఓ మంత్రి పేరు చెప్పి కొందరు స్థానిక నేతలు, అధికారులు ఈ అద్దె సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయశాఖ ఇప్పటివరకు నామమాత్రంగా 20 వరకు నోటీసులు జారీ చేసింది. కానీ నయాపైసా కూడా జమ చేయించలేకపోయింది. నగరంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న చాలా దేవాలయాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. ఈ అద్దెల సొమ్ము ఎటుపోతోందో శాఖ కమిషనర్‌కు కూడా తెలియని పరిస్థితి నెలకొనడం గమనార్హం. లెక్కలే లేవు.. అసలు దేవాదాయశాఖకు ఎన్ని దుకాణాలున్నాయి, వాటిలో ఎన్నింటిని లీజుకిచ్చారు, ఎన్నింటిని నేరుగా అద్దెకిచ్చారు, వాటి రూపంలో దేవాదాయశాఖ ఖజానాకు రావాల్సిన మొత్తం ఎంత.. అనే లెక్కలేవీ దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో నమోదై లేవు. వెరసి ఏటా దేవుడి ఖజానాకు రావాల్సిన రూ.కోట్ల మొత్తం అధికారులు, కొందరు నేతల జేబుల్లోకి చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ తంతును గుర్తించి నోరెళ్లబెట్టారు. వెంటనే దుకాణాల అద్దె, లీజులకు సంబంధించి పూర్తి లెక్కలు సమర్పించాలని ఆదేశించారు. కానీ నెలన్నర గడిచినా ఇప్పటివరకు అధికారులు లెక్కలు సిద్ధం చేయలేదు. కోట్ల కొద్దీ స్వాహా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అధీనంలో పెద్ద ఎత్తున భూములు, భవనాలు ఉన్నాయి. గ్రామాల్లో ఎకరాల కొద్దీ భూములు ఉండగా... పట్టణాలు, నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆలయాల పరిధిలో ఖాళీ భూములతోపాటు దుకాణాలు ఉన్నాయి. పలుచోట్ల ఈ భూములు, దుకాణాలను లీజులకు ఇవ్వగా.. మరికొన్ని చోట్ల నెలవారీగా అద్దెకిచ్చి ప్రతినెలా అద్దె సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇలా వందల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి. వాటి అద్దె రూపంలో ఏటా రూ.కోట్లు వసూలవుతాయి. ఆ సొమ్మును కాజేసేందుకు అలవాటు పడ్డ అధికారులు.. అసలు వాటికి లెక్కలే లేకుండా చేశారు. కొన్నేళ్లుగా దేవాదాయ శాఖకు పూర్తిస్థాయి కమిషనర్ లేక ఇన్చార్జి అధికారి పర్యవేక్షణలో కొనసాగుతోంది. దాంతో లెక్కలు అడిగే వారు లేకపోవటం, ప్రభుత్వం దేవాదాయ శాఖను నిర్లక్ష్యం చేయటంతో.. అధికారులు అద్దెల సొమ్మును స్వాహా చేయడం ప్రారంభించారు. దేవాలయాలు, దేవాదాయశాఖ అధీనంలో ఉన్న మఠాలకు నగరంలో వందల సంఖ్యలో దుకాణాలున్నా.. వాటి అద్దెలు, లీజుల రూపంలో ఎంతమొత్తం వసూలవుతోందో తెలియని గందరగోళం ఉంది. కొన్ని దేవాలయాల్లో అవకతవకల తీరిదీ.. - సికింద్రాబాద్‌లో బోనాల సందర్భంగా భారీ జాతర సాగే అమ్మవారి దేవాలయం దుకా ణాల్లో భారీ గోల్మాల్ జరుగుతోంది. వాణి జ్యపరంగా మంచి కేంద్రం కావడంతో దుకా ణాల అద్దె భారీగా ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా ఆ అద్దెల వివరాలను రికార్డుల్లో నమోదు చేయటం లేదు. వాటి కాగితాలూ మాయమయ్యాయి. - జూబ్లీహిల్స్‌లోని మరో అమ్మవారి దేవాలయా నికి చెందిన దుకాణాల వివరాలెక్కడా పొందుపరచలేదు. అక్కడ ఎంతమొత్తం వసూలవుతుందో తెలియని పరిస్థితి. - అమీర్‌పేటలో మంచి సెంటర్లో ఉన్న అమ్మవారి ఆలయానికి సంబంధించి రికార్డుల్లో ‘ప్రైవేట్ నెగోషియేషన్’అని మాత్రమే రాశారు. ఎవరి అధీనంలో దుకాణాలున్నాయో వివరాల్లేవు. - రెజిమెంటల్ బజార్‌లోని ఓ శివాలయం దుకాణాల అద్దెలకు సంబంధించి కొన్నేళ్లుగా లెక్కలు రాయడం లేదు. - సికింద్రాబాద్‌లో ఉన్న ఓ ధర్మశాల, షేక్‌పేట ద్వారకానగర్‌లోని మరో దేవాలయం, అమీర్‌పేట, భోలక్‌పూర్, పాన్‌బజార్, ముషీరాబాద్, ఎల్లారెడ్డిగూడల్లోని ఐదు దేవాలయాల పరిధిలోని దుకాణాలను అనధికారికంగా అద్దెకిచ్చి ఆ మొత్తాన్ని ఖజానాకు జమకట్టడం లేదు. - లాలాగూడలోని ఓ దేవాలయం దుకాణాలను 25 ఏళ్లపాటు లీజుకిచ్చినట్టు రికార్డుల్లో రాసి ఉంది. కానీ లీజు ఎప్పటితో పూర్తవుతుందనే వివరాలను మాత్రం గల్లంతు చేశారు. లీజు మొత్తం ఎంతో కూడా లేకపోవడం గమనార్హం. - కవాడిగూడలోని ఓ ఆలయం దుకాణాల లీజు 2012లో పూర్తయినట్టు రికార్డుల్లో చూపారు. తర్వాత ఆ దుకాణాలు ఎవరి అధీనంలో ఉన్నాయి. వాటి అద్దె ఎంత, లీజుకిచ్చారా లేదా అన్న వివరాలు పొందుపరచలేదు. ఆ మేరకు సొమ్మును పక్కదారి పట్టించేస్తున్నారు. -
సచివాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని సి-బ్లాక్ ఎదుట ఓ రైతు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దేవన్న (37)కు ప్రభుత్వం చెరువు పక్కన గతంలో మూడెకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం కింద మామిడి, జామ చెట్లు పెంచుకుంటున్నాడు. చెరువు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దేవన్న కొంత భూమిని కోల్పోయాడు. భూమికి బదులు భూమి ఇప్పించాలంటూ కొన్నాళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం భార్య లలిత, ఇద్దరు పిల్లలతో కలసి సచివాలయం వద్దకు వచ్చాడు. మంత్రి హరీశ్‌రావును కలవాలని భావించాడు. మూడేళ్ళుగా అధికారుల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదంటూ సూసైడ్ నోట్ రాశారు.‘నా చావుకు కారణం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జాయింట్ కలెక్టర్ శివ లింగయ్య’అని అందులో పేర్కొన్నారు. తనకు తిండి, నీరు, ఉపాధి లేకుండా చేసి వేధిస్తున్నారంటూ ఆరోపించాడు. దళితులకు న్యాయం చేయాలని సీఎంను వేడుకున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు కూడా లేఖ రాశాడు. ప్రజారాజ్యం పార్టీ కోసం నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నానని పార్టీ కోసం పని చేసిన పుణ్యానికి నా తండ్రిని, కొడుకుని పోగొట్టుకున్నానని పేర్కొన్నాడు. నేను చనిపోయిన తర్వాత నా భార్య బిడ్డలను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్‌ను కోరారు. టాయిలెట్ క్లీనర్ తాగిన దేవయ్యను పోలీసులు మాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు. దేవయ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
లబ్ధిదారుల ఎంపిక వేగిరం
డబుల్ బెడ్రూం ఇళ్లపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ఖరారైన ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపికను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో జాప్యం ఉండొ ద్దన్నారు. ఈ పథకంలో 50,959 ఇళ్ల నిర్మా ణానికి మొదట విడతలో ప్రధాని ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.190.66 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్లు, రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు పనితీరుపై బుధవారం ఆయన సమీక్ష జరిపారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోందని, కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతున్నారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు 94,250 ఇళ్ల నిర్మాణానికి పాలనపరమైన అనుమతులు వచ్చా యని, 83,087 ఇళ్లకు టెండర్లు పిలవగా 41,925 ఇళ్లకు ఖరారైనట్లు చెప్పారు. ప్రస్తుతం 20,986 ఇళ్ల పనులు కొనసాగు తున్నాయని, 1,629 ఇళ్లు సిద్ధమయ్యాయని వివరించారు. ఇప్పటివరకు రూ.202.85 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గృహ నిర్మాణ మండలి రూ.1,066.94 కోట్లతో చేపట్టే 13 ప్రాజెక్టులకు త్వరగా డిమాండ్ సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. కూకట్‌పల్లిలోని 200 ఎంఐజీ ప్లాట్ల నోటిఫికే షన్‌కు స్పందన రానందున మరోసారి డిమాండ్ సర్వే నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. హౌసింగ్ బోర్డు ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన రూ.207.98 కోట్ల బకాయిలను వసూలు చేయాలని ఆదేశిం చారు. జేఎన్టీయూకు లీజుకిచ్చిన భూమి లో కొంతభాగం ఓ ప్రైవేటు సొసైటీ ఆక్ర మణలో ఉందని, దాన్ని స్వాధీనం చేసుకోవా లని ఆదేశించారు. లీజు గడువు ముగిసిన వాటి వివరాలను అందజేయాలన్నారు. జేఎన్టీయూ చెల్లించాల్సిన రూ.10.53 కోట్ల లీజు రెంట్‌కు సంబంధించి ఆ వర్సిటీ వీసీ, ఉన్నత విద్యా శాఖ మంత్రి, స్పెషల్ సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. -
‘కూతురమ్మ’కు అండగా నిలుస్తాం..
‘సాక్షి’ కథనానికి విశేష స్పందన.. నిర్మల్ రూరల్: తనను కన్నవాళ్లకే అమ్మగా మారి.. తల్లిదండ్రులను పిల్లలుగా భావించి సేవలం దిస్తున్న పేదింటి ‘కూతురమ్మ’కు తాము అండగా నిలుస్తామంటూ మనసున్నోళ్లు ముందుకు వస్తున్నారు. ‘సాక్షి’ ఫ్యామిలీ పేజీలో మంగళవారం ‘కూతురమ్మ’ శీర్షికన ప్రచురించిన కథనానికి విశేష స్పందన వస్తోంది. నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తికి చెందిన అర్చన తల్లిదండ్రులు పద్మ, దుర్గారెడ్డిల దీనగాథతో ‘సాక్షి’ప్రచురించిన కథనం విశ్వవ్యాప్తమైంది. ఈ కథనాన్ని చదివి మానవత్వానికి ఎల్లలు లేవు.. మనసుంటే మార్గముంటుంది.. అన్న మంచి మనసుతో అర్చనకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అర్చన కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. హృదయాన్ని కదిలించే కథనాన్ని రాసిన ‘సాక్షి’ని ఆయన అభినందించారు. అర్చన పరిస్థితిపై స్పందించిన వారిలో మాణిక్‌రెడ్డి(షాద్‌నగర్), సతీశ్‌రాజు (భీమవరం), భాస్కర్‌రెడ్డి(హైదరాబాద్), వెంగళ్రావు(నెల్లూరు), మాధురి (హైదరాబాద్), బాలాజీ వరప్రసాద్ (విజయవాడ)లతో పాటు నిర్మల్‌కు చెందిన టీఆర్ఎస్ నేత కూచాడి శ్రీహరిరావు, డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్రెడ్డి, జాన్‌డీర్ షోరూం యజమాని రవీందర్, కనకదుర్గా చిట్స్ బ్రాంచ్‌మేనేజర్ నర్సారెడ్డి, మనోహర్‌రెడ్డి(డీఎస్పీ) జీవన్‌రెడ్డి(పట్టణ సీఐ) ఇలా చాలా మంది మనసున్నోళ్లు ముందుకు వచ్చారు. -
బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకో
రేవంత్‌రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హితవు సాక్షి, హైదరాబాద్: బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం హితవు పలికారు. పేదల ఇళ్ల నిర్మాణంలో కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందనడం అవాస్తవమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సరైన ఆధారాలుంటే మీడియా ముందు బహిర్గ తం చేయాలని, అనవసరంగా మాట్లాడితే పుట్టగతులుండవని హెచ్చరించారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రం వెనక్కు తగ్గదని, ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసిన ఘనత బాబుదేనని ఆరోపించారు. -
నిర్మల్‌లో ఈఎస్ఐ ఏర్పాటు చేయండి
దత్తాత్రేయను కోరిన ఇంద్రకరణ్ సాక్షి, న్యూఢిల్లీ: నిర్మల్‌లో భారీగా ఉన్న బీడీ కార్మికుల్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. బుధవారం ఉదయం కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలసిన ఇంద్రకరణ్‌రెడ్డి ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు కు వినతిపత్రాన్ని సమర్పించారు. నిర్మల్ లో ఏరియా ఆస్పత్రి భవనం ఖాళీగా ఉందని లేబర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆ భవనాన్ని తమ అధీనంలోకి తీసుకొని అక్కడ ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పా టుకు చర్యలు తీసుకోవాలని దత్తా త్రేయను కోరారు. అలాగే నిర్మల్‌లో పీఎఫ్ రీజినల్ ఆఫీసు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ సానుకూలంగా స్పందించి నిర్మల్‌లో ఆస్పత్రి, పీఎఫ్ రీజినల్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రామగుండంలో 100 పడకల ఆస్పత్రిని, రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో కూడా ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్టు దత్తాత్రేయ తెలిపారు. -
మంత్రి కాన్వాయ్‌లోని వాహనం ఢీ : విద్యార్థి మృతి
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ సమీపంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనం ఢీకొని సాత్విక్ (17) అనే విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయమే ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన సాత్విక్.. తిరిగి శాంతినగర్ వైపునకు వస్తున్నాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న మంత్రి కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనం ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ద్విచక్రవాహనం ఎగిరిపడి, సాత్విక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. కాగా, సాత్విక్ కుటుంబసభ్యులను ఆదివారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరామర్శించి, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సాత్విక్ సోదరుడికి డిగ్రీ పూర్తయిన తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఏడేళ్ల క్రితం లక్ష్మణచాంద మండలం చింతలచాందా గ్రామానికి చెందిన జోగు మోహన్, లక్ష్మి దంపతులు నిర్మల్ పట్టణానికి వలస వచ్చి ఫొటో స్టుడియో నడుపుకొంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. సాత్విక్, సాయి. తమ పిల్లలకు మంచి విద్యనందించాలని సొంత ఊళ్లోని వ్యవసాయ భూములను అమ్మేసి నిర్మల్‌లో స్థిరపడ్డారు. -
అర్చకులకు ఒకటినే కచ్చితంగా వేతనాలు
-
అర్చకులకు ఒకటినే వేతనాలు
ప్రభుత్వోద్యోగుల తరహాలో వేతన చెల్లింపు విధానం: కేసీఆర్ - అవసరమైతే చట్ట సవరణ.. ఈ సమావేశాల్లోనే బిల్లు - న్యాయ నిపుణులతో చర్చించి ముసాయిదా రూపకల్పన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాల యాల్లో అర్చకులకు ఒకటో తేదీనే కచ్చితంగా వేతనాలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతన చెల్లింపు విధానాన్ని అమలు చేస్తామని, ఇందుకోసం దేవాదాయ చట్ట సవరణ చేస్తామని తెలిపారు. అవసరమైతే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతామని తెలిపారు. సమాజంలో గౌరవంగా బతికే రీతిలో వేతనాల చెల్లింపు ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించాలని అర్చకులు, దేవాలయాల ఉద్యోగులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్ల సాధన కోసం దేవాలయ అర్చకులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి ఆందోళన చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సలహాదారు రమణాచారి, కమిషనర్ శివశంకర్‌లతో సుదీర్ఘంగా సమీక్షించారు. అర్చక సంఘాల ప్రతినిధులు గంగు భానుమూర్తి, గంగు ఉపేంద్రశర్మ, దేవాలయ ఉద్యోగుల ప్రతినిధులు రంగారెడ్డి, మోహన్ తదితరులు కూడా భేటీలో పాల్గొన్నారు. ప్రత్యేక నిధి నుంచి... దేవాదాయ శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న 642 ఆలయాలకు సంబంధించి దాదాపు 5,800 మంది అర్చకులు, ఉద్యోగులకు వర్తించేలా కొత్త వేతన చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలు చెల్లించాలని అర్చకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కోరారు. కానీ అది సాధ్యమయ్యే అవకాశం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘అర్చకత్వం గౌరవమైన వృత్తి. కానీ వారి వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పోటీ సమాజంలో ఇది పెద్ద సమస్యగా మారింది. అర్చకత్వం చేసే యువకులకు పిల్లనివ్వడానికి ముందుకు రాని దుస్థితి రావడం బాధాకరం. ఈ పరిస్థితి మారాలి. వారికీ గౌరవప్రదమైన వేతనాలు అందాలి. అది కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఒకటో తారీఖునే చేతిలో పడాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. ప్రతి నెలా ఆలయాల నుంచి దేవాదాయశాఖ వసూలు చేసే 12 శాతం మొత్తాన్ని ఒకచోట నిధిగా చేసి.. దాని నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఠంచన్‌గా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని అధికారులకు సూచించారు. ఆ నిధి చాలని పక్షంలో ప్రభుత్వం కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వారి వేతనాలను కూడా క్రమబద్ధీకరించాలని.. అందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సంక్రాంతి నాటికే అర్చకులు, ఆలయ ఉద్యోగులకు కొత్త వేతన విధానం అమల్లోకి రావాలన్నారు. భూముల లెక్కలు తేల్చండి గత ప్రభుత్వాల మితిమీరిన రాజకీయ జోక్యం వద్ద ఆలయాల్లో ఆధ్యాత్మిక భావన భగ్నమైందని, కౌలు పేరుతో దేవాలయ భూములు కబ్జాకు గురయ్యాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆలయ భూముల వివరాలను పక్కాగా సేకరించి అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పాలక వర్గాల్లో ధార్మిక, భక్తి భావాలున్నవారే సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈమేరకు నియమావళి రూపొందించాలని సూచించారు. కాగా రాష్ట్రంలో 11 వేల వరకు ఆలయాలుంటే కేవలం 642 మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలో ఉండాల్సిన గందరగోళం ఏమిటని సీఎం ప్రశ్నించారు. వేతన క్రమబద్ధీకరణ ఈ 642 ఆలయాలకే వర్తిస్తే మిగతా వారు నష్టపోతారని, అందరికీ లబ్ధి కలిగేలా చూడాలని పేర్కొన్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ.. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కూడా సమావేశమై మూడు నాలుగు రోజుల్లో పూర్తి నివేదికను తనకు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ అంశంపై శాసనసభలో బిల్లు పెడతామన్నారు. బిల్లు ముసాయిదా రూపకల్పన కోసం దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్ ఎస్పీ సింగ్, దేవాదాయ కమిషనర్ శివశంకర్, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, లాసెక్రటరీ సంతోష్‌రెడ్డి, అర్చక–ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భానుమూర్తి, ఉపేంద్రశర్మ, రంగారెడ్డి, మోహన్‌లు అందులో సభ్యులుగా ఉన్నారు. దేవాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, రోస్టర్ సమస్యలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కమిటీని సీఎం ఆదేశించారు. -
వ్యవసాయాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి
- మంత్రి పోచారం వెల్లడి - వ్యవసాయ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ - రైతులకు నిరంతర విద్యుత్: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హైదరాబాద్: వ్యవసాయరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ బొగ్గులకుంటలోని రెడ్డిహాస్టల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరించారు. గౌరవ అతిథులుగా హాజరై న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నూతన సంవత్సర క్యాలెండర్‌ను, వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి టెలిఫోన్ డైరీని, ఎమ్మెల్యే వి. శ్రీనివాస్‌గౌడ్ టేబుల్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ... గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయరంగ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాట య్యాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అన్ని అవాంత రాలను అధిగమించి పురోగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులు రుణాలు పొందగా, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టింది మాత్రం 6 లక్షల మంది రైతులేనని అన్నారు. రుణాలు పొందిన రైతులు కచ్చితంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేలా వ్యవసాయ అధికారుల సంఘం నాయకులు కృషి చేయాల న్నారు. కేసీఆర్ అధికారం చేపట్టిన తరువాత నిరంతరాయంగా విద్యుత్ అందించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అధిక శాతం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే సీఎంలు కావడంతో తెలంగాణ ప్రాంతం, ప్రజలు నిర్లక్ష్యానికి గురైన విషయం వాస్తవమేనని జి. చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అని గొప్పలు చెప్పుకుంటున్నా దానిని నాలుగు దఫాలుగా విభజించడంతో రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగడానికే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరు వాత కేసీఆర్ తొలి ప్రాధాన్యత ఇచ్చింది వ్యవసాయ రంగానికేనని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ కార్య క్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్ మోహన్, రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ కృపాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారా యణ, అధ్యక్షురాలు అనురాధ, తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్’ సమస్యలు తొలగిపోయాయి
మండలిలో మంత్రులు ఇంద్రకరణ్, తుమ్మల ప్రకటన - నిధులు, ఇసుక, సిమెంట్ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని వ్యాఖ్య - త్వరలోనే శరవేగంగా ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడి - కేసీఆర్ హామీలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారు: షబ్బీర్ అలీ - ఖమ్మంలో ఓ వైద్య కళాశాలకు అక్రమ భూకేటాయింపు: సుధాకర్‌రెడ్డి - గృహ నిర్మాణంపై రెండో రోజు వాడివేడి చర్చ సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి సమస్యలన్నీ తొలగిపోయా యని.. త్వరలో ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేపట్ట బోతున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.17 వేల కోట్లు సమీకరించిం దని.. ఉచితంగా ఇసుక సరఫరాతో పాటు సిమెంట్ కోసం 32 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. పేదలకు గృహ నిర్మాణం అంశంపై శాసనమండలిలో బుధ వారం కూడా అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ‘డబుల్’ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష కాంగ్రెస్ ఆరోపించగా.. ఇందిరమ్మ, రాజీవ్ స్వగృహ పథకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని అధికార పార్టీ నేతలు దీటుగా ఎదురుదాడి చేశారు. మీరు దోచి పెట్టారు.. కాదు మీరే.. రాజీవ్ స్వగృహ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం భూత్ బంగ్లాలుగా మార్చిందని.. అసలు ఇళ్లు నిర్మించకుండానే కాంట్రాక్టర్లకు రూ.1,000 కోట్లు దోచిపెట్టిందని టీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి దీటుగా స్పందించారు. ఓ ప్రజాప్రతినిధికి చెందిన వైద్య కళాశాలకు ఖమ్మంలో 11 వేల గజాల స్థలాన్ని ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టిందని ఆరోపించారు. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద పొందిన పత్రాలను సభలో ప్రదర్శించారు. ఆ స్థలాన్ని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి, దాన్ని చూస్తూ భోజనం చేసినట్లుగా డబుల్ బెడ్ రూం పథకం తయారు కావొద్దని ఎద్దేవా చేశారు. ఇక డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రభుత్వం ప్రజల్లో ఆశలు రేకెత్తించిందని, కానీ ఏమీ చేయకపోవడంతో నిరాశ నెలకొందని బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు పేర్కొన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో నిర్మించే డబుల్ ఇళ్లలో వారికి కోటాను పెంచాలని ఎంఐఎం సభ్యుడు సయ్యద్ అల్తాఫ్ రిజ్వీ కోరారు. ఏడాదికి రెండు లక్షల ఇళ్లు ఏవీ? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 31 నెలలు గడిచినా నిర్మించింది 900 ఇళ్లు మాత్రమేనని మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఏడాదికి రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామని గత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి, విస్మరించారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన ఇళ్లను చూపించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లను దండుకున్నారని ఆరోపించారు. ఇక ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి, అబద్ధాలాడి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. అమాయక ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. రూ.10 లక్షలు ఖర్చయ్యే డబుల్ బెడ్ రూం ఇళ్లను రూ.5 లక్షలతోనే నిర్మించాలన్నందునే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వం బిల్లులు నిలిపివేయడంతో రాష్ట్రంలో రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయని.. ఊళ్లకు వెళ్తే కూలిపోయిన ఇళ్లు కనిపిస్తున్నా యని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానిం చారు. దీనిపై టీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ‘ఊళ్లలో అంతకుముందు కట్టిన ఇళ్లు కూలుతున్నయి అన్నారు.. అంతే..’ అని మండలి చైర్మన్ స్వామిగౌడ్ సర్దిచెప్పారు. -
నేడే కొమురవెల్లి మల్లన్న కల్యాణం
తోటబావి కల్యాణ మండపం వద్ద ఏర్పాట్లు పూర్తి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: భక్త జనుల కొంగు బంగారం... బండల నడుమ వెలసిన సుందర రూపుడు.. కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి శుభ ఘడియలు వచ్చాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఇంద్రకీలాద్రిపై వెలిసిన కోరమీసం స్వామికి దుర్ముఖినామ సంవత్స రం, మార్గశిర భాద్రపద ద్వాదశి ఆదివారం ఉదయం 10.45 గంటల శుభ ముహుర్తాన మేడలాదేవి, కేతమ్మదేవితో కల్యాణం జరగ నుంది. ఈ క్రతువుతోనే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆలయ అధికారు లు తోటబావి కల్యాణ మండపం వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. మల్లన్న ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. మహారాష్ట్రలోని తమ్ముళ్ళూరులోని రంభాపూరి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ షట్ స్థల బ్రహ్మ 1008వ గురువు శ్రీ శివానంద స్వామిజీ మల్లన్న కల్యాణ వేడుక లను పర్యవేక్షించనున్నారు. స్వామి వారికి భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభు త్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు తలసాని శ్రీని వాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, చందూలాల్ తదితరులు కల్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు. మల్లన్న బ్రహ్మోత్సవాలు ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారంతో మొదలై ఫాల్గుణ మాసం చివరి ఆదివారం (ఉగాది ముందు వచ్చే ఆదివారం) అగ్నిగుండాలతో ముగు స్తాయి. మూడు నెలలపాటు ఉత్సవాలు కొన సాగుతాయి. తెలంగాణతోపాటు మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 80 లక్షల మంది భక్తులు ఈ జాతరకు వస్తారని అంచనా. సంక్రాంతి తరువాత వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నంవారంగా, రెండవ ఆదివారాన్ని లష్కర్‌వారంగా, మహాశివరాత్రి లింగోద్భవవారంగా పిలుస్తారు. మహాశివరాత్రికి పెద్దపట్నం... మల్లన్న ఆలయంలో మహాశివరాత్రిని పురస్క రించుకుని ఆలయ తోటబావి వద్ద ఫిబ్రవరి 24న శుక్రవారం మహాశివరాత్రికి లింగోద్భవ కాలంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అదే సమయంలో ఆలయ తోట బావి వద్ద ఒగ్గు పూజారులు 48 వరుసలతో పెద్దపట్నాన్ని వేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివసత్తులు ఆ పెద్దపట్నాన్ని తొక్కుకుంటూ ఆ ముగ్గు పిండిని పొలాలలో చల్లుకుంటే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భక్తుల విశ్వాసం. అగ్నిగుండాలతో జాతర ముగింపు.. మల్లన్న ఆలయంలో ఉగాది ముం దు మార్చి 26న ఆదివారం అగ్నిగుం డాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగు స్తాయి. ఆలయ తోటబావి వద్ద ఆలయ అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో క్విం టాళ్ల కొద్దీ సమిధలను కాల్చి భగభగ మండే నిప్పుల కొలిమిని రాజేస్తారు. ఆల య అర్చకులు ఉత్సవ విగ్రహాలతో అగ్ని గుండాలు దాటుతూ మల్లన్న ఆలయ గర్భ గుడిలోకి చేరి మల్లన్నకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మల్లన్న భక్తులు ఒక్కొక్కరుగా అగ్నిగుండాలు దాటుతూ మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ అగ్నిగుండాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
‘డబుల్’ ఇళ్లకు రూ.230కే బస్తా సిమెంటు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూ.230కే బస్తా సిమెంటును సరఫరా చేయ డానికి 32 సిమెంటు కంపెనీలు అంగీకరిం చాయి. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో ముఖ్యకార్యదర్శి అశోక్‌కుమార్‌తో సిమెంటు కంపెనీల ప్రతిని ధులు గురువారం అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంటు, స్టీలు, ఇసుక వంటివి తక్కువ ధరకు అందించాలని సిమెంటు కంపెనీలను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సిమెంటు బస్తాను తక్కువ ధరకే అందించడానికి 32 సిమెంటు కంపెనీలు ముందుకొచ్చారుు. నిర్మాణం ఇక వేగవంతం... రాష్ట్ర ప్రభుత్వానికి, సిమెంటు కంపెనీలతో ఒప్పందం జరిగిన సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సిమెంటును సరఫరా చేసిన వారంరోజుల్లో కంపెనీలకు బిల్లులను చెల్లిస్తామని చెప్పారు. సిమెంటు సరఫరా, చెల్లింపుల్లో ఏమైనా సమస్యలు తలెత్తినా పరస్పర అవగాహనతో, చర్చలతో పరిష్కరించుకుంటామన్నారు. సిమెంటు కంపెనీలతో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం అవుతుందని ఇంద్రకరణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మా ణానికి నిధుల సమస్య లేదని, రుణం ఇవ్వ డానికి హడ్కో ఇప్పటికే ముందుకు వచ్చిం దన్నారు. సబ్సిడీ ధరకు వస్తున్న సిమెంటు పక్కదారి పట్టకుండా కఠినమైన, పటిష్టమైన చర్యలను తీసుకుంటా మని ఇంద్రకరణ్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం సరఫరా చేస్తున్న సిమెంటుపై ప్రత్యేకమైన చిహ్నాలను ముద్రిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 32 సిమెంటు కంపెనీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.