త్రిమూర్తుల | Yadagirigutta development of program Completed | Sakshi
Sakshi News home page

త్రిమూర్తుల

Published Sun, May 31 2015 1:20 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

Yadagirigutta  development of program Completed

 పూజ చేసి ప్రారంభించిన గవర్నర్,
 సీఎం, చినజీయర్ స్వామి
 రాజగోపురం, మహాప్రాకారాలకు
  గుట్టపైన.. ఆలయ అభివృద్ధి పనులకు పెద్దగుట్ట వద్ద
 నమూనా ప్లాన్‌ను ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా వీక్షణం
 ఆలయ అభివృద్ధి కోసం పలు సూచనలు చేసిన సీఎం కేసీఆర్
 మిథునలగ్న ముహూర్తాన పూజలు చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఆధ్యాత్మిక కేంద్రమైన యాదగిరిగుట్ట (యాదాద్రి) అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. లక్ష్మీనారసింహ క్షేత్ర అభివృద్ధి కోసం తయారుచేసిన ప్రతిపాదనల మేరకు అభివృద్ధి పనులతో పాటు రాజగోపురం ఎత్తు పెంపు, మహాప్రాకార నిర్మాణానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్. నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీత్రిదండి శ్రీ మన్నారాయణ చినజీయర్‌స్వామిల చేతుల మీదుగా శనివా రం శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి.
 
 ఈ త్రిమూర్తులు ముగ్గురూ దాదాపు 3:40 నిమిషాల పాటు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో పర్యటించి భూమిపూజ చేశారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత రం ఆలయ ద్వారం సమీపంలో రాజగోపురం, మహాప్రాకా రం పనులను, పెద్దగుట్ట వద్ద ఆలయ అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వచ్చిన గవర్నర్ శంకుస్థాపనల తర్వాత హైదరాబాద్ వెళ్లిపోగా, సీఎంతో పాటు చినజీయర్‌స్వామిలు ఆలయ అభివృద్ధిపై జిల్లా ఉన్నతాధికారులు, వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
 
 రెండు హెలికాప్టర్లలో..
 తొలుత అనుకున్న విధంగా కాకుండా సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో వస్తారని అనుకున్నా ఆయన హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో గుట్టకు చేరుకున్నారు. ఒక హెలికాప్టర్‌లో చినజీయర్‌స్వామి, మరో హెలికాప్టర్‌లో గవర్నర్ కుటుంబ సభ్యులు ఉదయం 11:20 నిమిషాల కల్లా గుట్టకు చేరుకున్నారు. అక్కడి నుంచి సీఎం, చినజీయర్‌స్వామిలు సీఎం కాన్వాయ్‌లో గుట్టపైకి రాగా, 10 నిమిషాల తర్వాత గవర్నర్ నరసింహన్, సతీమణి విమలా నరసింహన్‌తో కలిసి గుట్టపైకి వచ్చారు. వారి కోసం ఆలయద్వారం వద్దే చినజీయర్‌స్వామితో పాటు మంత్రులు, అధికారులు వేచి ఉన్నారు. గవర్నర్ దంపతులు వచ్చిన తర్వాత అందరూ కలిసి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
 ఆ తర్వాత ఆలయ ద్వారానికి సమీపంలో ఏర్పాటు చేసిన రాజగోపురం, మహాప్రాకారం నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అక్కడి నుంచి పెద్దగట్టుకు వెళ్లి అభివృద్ధి పనులు ప్రారంభించారు. అక్కడి నుంచి గవర్నర్ దంపతులు వెళ్లిపోగా, సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామిలు మళ్లీ గుట్టపైకి వచ్చారు. అక్కడి ఆండాళ్ నిలయంలో భోజనం చేసిన అనంతరం ఆలయ అభివృద్ధిపై ప్రముఖ ఆర్కిటెక్ట్, క్రియేటివ్ డెరైక్టర్ ఆనంద్‌సాయి రూపొందించిన నమూనా ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు. అక్కడే వైటీడీఏ అధికారులు, కలెక్టర్ సత్యనారాయణరెడ్డిలతో మాట్లాడిన సీఎం.. ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 2:40 గంటలకు ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. హెలిప్యాడ్ వద్ద చినజీయర్ స్వామికి స్వాగతం పలికిన సందర్భంగా గవర్నర్ దంపతులతో పాటు సీఎం కేసీఆర్ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయడం గమనార్హం. అయితే, అంతకు ముందు నిర్ణయించిన విధంగా మిధునలగ్న ముహూర్తాన ఆలయ అర్చకులు రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేత పూజలు చేయించి అభివృద్ధిపనుల ప్రారంభానికి అంకురార్పణ చేశారు.
 
 ముగ్గురూ ముగ్గురే
 యాదాద్రి అభివృద్ధి పనులను ప్రారంభించిన ముగ్గురూ ముగ్గురేనని ఆధ్యాత్మిక వాదులు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర గవర్నర్‌కు దైవ భక్తి మెండు అని, ఆయనకు ఆగమ శాస్త్రంపై కూడా అవగాహన ఉందని, ఇక, యాగాలు నిర్వహించే స్థాయిలో భక్తి ఉన్న సీఎం కేసీఆర్, ఏకంగా దేశంలోనే గుర్తింపు పొందిన మఠాధిపతి అయిన చినజీయర్ స్వామిలు యాదాద్రి అభివృద్ధి పనులను ప్రారంభించడం గొప్ప విశేషమనే చర్చ ఆ వర్గాల్లో జరుగుతోంది.  ఈ పర్యటనలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘యాదాద్రి’ అనే భక్తి చానల్‌తో పాటు మాసపత్రికను కూడా సీఎం ప్రారంభించి, ఆవిష్కరించారు.
 
 మళ్లీ వస్తా...
 తన పర్యటనలో భాగంగా యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో మాట్లాడుతూ త్వరలోనే మళ్లీ గుట్టకు వస్తానని ఇక్కడే బస చేసి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. గుట్ట అభివృద్ధికి ఉన్న సమస్యలను సీఎంకు వివరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ మళ్లీ వారం పదిరోజుల్లో వస్తా.. అవసరమైతే ఇక్కడే బసచేసి ఆయా వర్గాలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించి వెళతా’ అని చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన నమూనా చిత్రాలు, మాస్టర్‌ప్లాన్‌లపై మరింత చర్చ జరపాలని, మరో రెండు, మూడు భేటీల తర్వాత తుది నమూనాను రూపొందిద్దామని కూడా సీఎం చెప్పినట్టు సమాచారం. సీఎం పర్యటన సందర్భంగా డీ ఐజీ గంగాధర్, ఏఎస్పీ గంగారాంల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
 
 పర్యటనలో పాల్గొంది వీరే...
 యాదాద్రి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఎంపీ బూరనర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిశోర్, జ్యోతిష్యనిపుణుడు దైవజ్ఞశర్మ, టీఆర్‌ఎస్ నేతలు బండా నరేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సిం హయ్య, జెల్లా మార్కండేయులుతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దైవజ్ఞశర్మ, వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, కమిటీ కన్వీనర్ ఎంజీగోపాల్, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్,ఈఓ గీతారెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి తదితరులున్నారు.
 
 ఎప్పుడు.. ఏమయింది?
 ఉదయం ..
 11:05 -రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం కేసీఆర్
 11:18 -  హెలికాప్టర్‌లో గుట్టకు చినజీయర్‌స్వామి రాక
 11:26 - మరో హెలికాప్టర్‌లో గవర్నర్ కుటుంబం రాక
 11:34 - సీఎం కేసీఆర్ .. చినజీయర్‌స్వామితో కలిసి గుట్టపైకి
 11:45 - గవర్నర్ రాక.. అందరూ కలిసి ఆలయంలోనికి
 12:18 - ప్రత్యేక పూజల అనంతరం ఆలయం బయటకు వచ్చిన
 గవర్నర్, సీఎం, చినజీయర్‌స్వామి
 12:25 - రాజగోపురం, మహాప్రాకారం పనులకు శంకుస్థాపన
 12:37 - పెద్దగుట్టకు పయనం
 12:50 -పెద్దగుట్టకు చేరుకున్న గవర్నర్, సీఎం, చినజీయర్‌స్వామి
 మధ్యాహ్నం    ..
 1:00 - ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
 1:10 - పెద్దగుట్ట నుంచి గుట్టపైకి పయనం
 1:25 - గుట్టపైన ఉన్న ఆండాళ్ నిలయానికి రాక
 1:30 - భోజనం
 1:50 - భోజనం ముగింపు
 1:55 - సంగీత భవన్‌కు కేసీఆర్, చినజీయర్ స్వామి
 2:40 - ఛాయాచిత్ర పదర్శన.. చిన్నపాటి సమీక్ష అనంతరం
 హైదరాబాద్‌కు పయనం.         
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement