మంత్రి కాన్వాయ్‌లోని వాహనం ఢీ : విద్యార్థి మృతి
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ సమీపంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనం ఢీకొని సాత్విక్ (17) అనే విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయమే ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన సాత్విక్.. తిరిగి శాంతినగర్ వైపునకు వస్తున్నాడు.
అదే సమయంలో వేగంగా వస్తున్న మంత్రి కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనం ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ద్విచక్రవాహనం ఎగిరిపడి, సాత్విక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. కాగా, సాత్విక్ కుటుంబసభ్యులను ఆదివారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరామర్శించి, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సాత్విక్ సోదరుడికి డిగ్రీ పూర్తయిన తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఏడేళ్ల క్రితం లక్ష్మణచాంద మండలం చింతలచాందా గ్రామానికి చెందిన జోగు మోహన్, లక్ష్మి దంపతులు నిర్మల్ పట్టణానికి వలస వచ్చి ఫొటో స్టుడియో నడుపుకొంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. సాత్విక్, సాయి. తమ పిల్లలకు మంచి విద్యనందించాలని సొంత ఊళ్లోని వ్యవసాయ భూములను అమ్మేసి నిర్మల్‌లో స్థిరపడ్డారు.