
మొక్కలు నాటుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్
- వేములవాడ రాజన్నకు మరో రూ.400కోట్లు
- ‘మల్లన్నసాగర్’పై కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం
- 2013 చట్టంతో నిర్వాసితులకు న్యాయం జరగదు
- మెరుగైన పనితీరుతో దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో కేసీఆర్
- రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- గజ్వేల్‌లో మహంకాళి బోనాలకు హాజరైన మంత్రి, డిప్యూటీ స్పీకర్
గజ్వేల్: యాదాద్రి ఆలయ అభివృద్ధికి రూ.900 కోట్లు కేటాయిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని పిడిచెడ్ రోడ్డు మార్గంలో ఉన్న ఆలయంలో అమ్మవారికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల సత్వర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. యాదాద్రితోపాటు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సైతం రూ.400 కోట్లతో కార్యాచరణ సిద్ధమవుతుందన్నారు.
తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో పనిచేయడం వల్లే దేశంలోనే నెంబర్‌వన్ సీఎంగా కేసీఆర్ గుర్తింపు పొందారని చెప్పారు. కేసీఆర్ బాటలో నడవాలని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ఇతర ముఖ్యమంత్రులకు సూచించడం గొప్పవిషయమన్నారు.
మల్లన్న సాగర్‌పై రాద్ధాంతమెందుకు?
మల్లన్నసాగర్ విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతానికి తెరతీసిందని విమర్శించారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ జరగాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 2013 చట్టం ప్రకారం భూసేకరణ జరిగి ఎకరాకు కేవలం రూ.1500 మాత్రమే చెల్లించారని గుర్తు చేశారు.
నష్టపరిహారం పెంచాలని బాధితులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతుండగా ఇప్పటికీ... ఆ వ్యవహారం కొలిక్కి రాలేదన్నారు. జీఓ 123 భూనిర్వాసితులకు సరైన మార్గమని చెప్పారు. ఈ జీఓ ద్వారా వెంటనే పరిహారం అందే అవకాశముందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసే సంకల్పంతో చేపట్టనున్న ఈ రిజర్వాయర్ నిర్మాణ ంపై కుట్రలు చేయవద్దన్నారు. హరితహారంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
రాష్ట్రంలోనే మొదటగా గజ్వేల్ వాసులకు ఇంటింటికి నీరు..
రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఇక్కడి ప్రజలు మిషన్ భగీరథ ఫలాలను అందుకోబోతున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గోదావరి జలాలతో తెలంగాణలో కరువును శాశ్వతంగా తరిమేయడానికి మల్లన్నసాగర్ ఉపకరిస్తుందన్నారు. అందుకోసం ఈ రిజర్వాయర్ నిర్మాణం వెంటనే కావాలని అమ్మవారికి మొక్కుకుంటున్నట్లు తెలిపారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని చెప్పారు.