కుంభమేళా తరహాలో పుష్కరాలు | godavari puraskaralu maintain in kumbamela manner, says minister indrakaran | Sakshi
Sakshi News home page

కుంభమేళా తరహాలో పుష్కరాలు

Published Thu, Mar 19 2015 1:18 AM | Last Updated on Sat, Aug 11 2018 6:44 PM

కుంభమేళా తరహాలో పుష్కరాలు - Sakshi

కుంభమేళా తరహాలో పుష్కరాలు

సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం శాసనసభలో టీఆర్‌ఎస్ సభ్యులు కొప్పుల ఈశ్వర్, దివాకర్‌రావు, పుట్టామధు, కాంగ్రెస్ సభ్యులు కిష్టారెడ్డి, డీకే అరుణ, బీజేపీ సభ్యుడు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. పుష్కరాల సందర్భంగా రోడ్ల నిర్మాణం కోసం ఆర్‌అండ్‌బీ నుంచి రూ.182కోట్లు, పంచాయతీరాజ్ నుంచి రూ.57కోట్లు, ఘాట్‌ల నిర్మాణానికి ఇరిగేషన్ నుంచి రూ.82 కోట్లు కేటాయించామని, మరో రూ.750 కోట్ల కేంద్ర సాయాన్ని కోరామని తెలిపారు. ఆర్టీసీ 900 నుంచి 1500 ప్రత్యేక బస్సులు నడపనుందని, అలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రధాని, రాష్ట్రపతిని పుష్కరాలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.  
 
గోదాముల నిర్మాణానికి రూ.1,024కోట్లు : హరీశ్‌రావు
రాష్ట్రంలో సుమారు 21 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంగల గోదాముల కొరత ఉందని  మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. కొరత తీర్చడానికి మొదట 15లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాములను నిర్మిస్తామని దీనికోసం రూ.1,024 కోట్లు వ్యయం చేయనున్నామని  తెలిపారు. బుధవారం సభలో సభ్యులు హన్మంతు షిండే, సోమారపు సత్యనారాయణ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ ఈ విషయం తెలిపారు.
 
ప్రభుత్వ భవనాలను విక్రయించం: మంత్రి మహమూద్ అలీ
ప్రభుత్వ భూములను, భవనాలను విక్రయించడం ద్వారా ఆర్థిక వనరులను సమీకరించాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు డీకే అరుణ, పువ్వాడ అజయ్, జీవన్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
గోల్కొండ పరిరక్షణకు చర్యలు: మంత్రి చందూలాల్
గోల్కొండ కోట పరిరక్షణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. కోట లోపల ఉన్న చారిత్రక నిర్మాణాల పరిరక్షణ కోసం రూ.65.90 లక్షల వ్యయంతో పురావస్తు శాఖ పలు చర్యలు చేపట్టగా, రూ.1.20 కోట్లతో కోటలో సౌండ్ అండ్ లైట్ షోను మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు.  
 
పెరిగిన సైబర్ నేరాలు : హోంమంత్రి నాయిని
హైదరాబాద్‌లో సైబర్ నేరాలు పెరిగాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు మల్లు భట్టి విక్రమార్క, కిష్టారెడ్డి, డీకే అరుణ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 2014లో 632 కేసులు నమోదైనట్లు వివరించారు. 2013లో 276, 2012లో 110, 2011లో 105 కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement