ప్రసాదం తయారీ యంత్రాలను పరిశీలిస్తున్న మంత్రి
యాదగిరిగుట్ట: ‘యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పనులు 90 శాతం పూర్తయ్యాయి. కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయి. క్యూలైన్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి’అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పనులను పరిశీలించారు. అనంతరం హరిత హోటల్‌లో దేవాలయ అధికారులతో కలసి పెండింగ్ పనులపై సమీక్షించారు.
ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి పనుల పురోగతిని వివరించారు. ధ్వజస్తంభం పనులు ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయన్నారు. క్యూ కాంప్లెక్స్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కొండ కింద పుష్కరిణి పనులు పూర్తయ్యాయని, గండి చెరువు, కల్యాణ కట్ట 90 శాతం పూర్తయ్యాయని, అలాగే ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం పూర్తయిందని మంత్రి వెల్లడించారు.
మార్చి 20 వరకు కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందన్నారు. ఆలయ ప్రారంభ సమయానికి అన్నప్రసాద మండపం పూర్తి కాకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయ ప్రారంభంనాటికి ఏమైనా పనులు పెండింగ్‌లో ఉంటే అవి తరువాత నిరంతరం కొనసాగుతాయని మంత్రి చెప్పారు. యాగం నిర్వహణకు సంబంధించిన సామగ్రి, ఆరువేల మంది రుత్వికుల జాబితా సిద్ధమైందని వివరించారు.
సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణ తిరుపతిగా అవతరించ బోతోందని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. మార్చి 21వ తేదీ నుంచి 1,008 హోమ కుండాలతో మహా సుదర్శన యాగం, 28వ తేదీన శాస్త్రోక్తంగా మహా కుంభ సంప్రోక్షణతో భక్తులకు స్వయంభూ దర్శనాలు కలుగుతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment