యాదాద్రి కొండ కింద జరుగుతున్న పనులు
సాక్షి, యాదాద్రి: యాదాద్రీశుడి స్వయంభూల దర్శన భాగ్యం భక్తులకు త్వరలో కలగనుంది. ప్రధానాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేస్తున్న సంగతి విదితమే. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా మహాకుంభ సంప్రోక్షణ మార్చి 28న ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.
శ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి నిర్ణయించిన దివ్యముహూర్తం మేరకు ముందస్తు పనులు ప్రారంభించారు. ప్రధానాలయంలో గర్భాలయ తలుపుల బంగారు తాపడం పనులు పూర్తికాగా ధ్వజ స్తంభం బంగారు తాపడం పనులు కొనసాగుతున్నాయి. దివ్యవిమానానికి భక్తుల నుంచి బంగారం సేకరణ ముమ్మరంగా సాగుతోంది.
గోపురాలపై కలశాల ఏర్పాటు
ఉద్ఘాటన సందర్భంగా 1,000 యజ్ఞ కుండాలతో శ్రీమహాసుదర్శన యాగం చేపట్టనున్నారు. కృష్ణ శిలలతో నిర్మితమైన ప్రధానాలయ సప్తగోపురాలపై కలశాల ఏర్పాటుకు ముందస్తు పనులు ప్రారంభం అయ్యా యి. ప్రతిష్ట కార్యక్రమాలతో పాటు మార్చి 21 నుంచి 28 వరకు మహాసుదర్శన యాగం నిర్వ హించనున్నారు. అలాగే దివ్యవిమానానికి బంగారు తాపడంతో పాటు బంగారు కలశాలను ఏర్పాటు చే యనున్నారు. మిగతా 6 గోపురాలకు ఇత్తడి కవచా లు, పంచలోహ కలశాలు ఏర్పాటు చేయనున్నారు.
యాదాద్రి నుంచి ముచ్చింతల్‌కు తాటి కమ్మలు..
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్మించిన జీయర్ కుటీరంలో 208 అడుగుల శ్రీశ్రీ రామా నుజ జీయర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఫిబ్రవరి 2న ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా జీయర్ స్వామి ఆధ్వర్యంలో 1,000 కుండాలతో సుదర్శన మహా యాగం చేపట్టనున్నారు.
ఇందుకోసం తాటి కమ్మలతో యాగశాలను నిర్మించనున్నారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఈ తాటి కమ్మలు తరలిస్తున్నారు. అక్కడ యాగం పూర్తి కాగానే, ఆ తరహాలోనే యాదాద్రిలో శ్రీ సుదర్శన యాగం ప్రారంభం కానుంది. యాగశాలకు అప్పుడు కూడా తాటి కమ్మలనే వాడనున్నారు.
తిరుమల తరహా భద్రత
యాదాద్రి పుణ్య క్షేత్రం భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకోసం పోలీస్ శాఖ ఇటీవల తిరుమలను సందర్శించి, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీనిప్రకారం కమాండ్ కంట్రోల్ ద్వారా భద్రతను పరిశీలించనున్నారు. మొత్తం 300 మంది పోలీస్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు.
కొండపై చక చకా పనులు
ఉద్ఘాటన గడువు దగ్గర పడుతుండడంతో కొండపై పనులు చక చకా సాగుతున్నాయి. ప్రధానంగా 16 ప్లాట్‌ఫాంలతో బస్‌బే, ఆర్చి నిర్మాణం, ఫ్లైఓవర్‌ల పనుల్లో వేగం పెరిగింది. ప్రధానాలయం ముందు బంగారు వన్నెతో కూడిన క్యూకాంప్లెక్స్ పనులు పూర్తి చేస్తున్నారు. కొండపైన గల మరో ప్రధానాలయమైన శివాలయం పనులు దాదాపు పూర్తి చేశారు.
మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ప్రెసిడెన్షియల్ సూట్‌లు పూర్తి కాగా వీటిలో ఫర్నిచర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కొండకింద లక్ష్మీ పుష్కరిణి, గండి చెరువు, దీక్షాపరుల మండపం, కల్యాణకట్ట, సత్యనారాయణ వ్రతశాల, అన్నప్రసాద మండపం పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని ఉద్ఘాటన సమయానికి పూర్తి చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment