సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14వ తేదీ వరకు 10 రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకు విష్వక్సేనా ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై 14వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
28న సీఎం రాక
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి స్వయంభు దర్శనభాగ్యం కలిగించే ఉద్ఘాటన కార్యక్రమం నిమిత్తం ఈ నెల 28న సీఎం కేసీఆర్ రానున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్యర్వంలో ప్రధానాలయం ప్రారంభోత్సవం జరగనుంది. అయితే, 28వ తేదీకి ముందు కూడా ఒకరోజు సీఎం యాదాద్రిని సందర్శించి పనులు పరిశీలిస్తారని తెలిసింది. ఆ తేదీ ఇంకా ఖరారు కాలేదు. మహాసుదర్శన యాగం వాయిదా పడిన నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మరో యాగం నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు ఆలయ అర్చకులతో అధికారులు చర్చిస్తున్నారు.
ఉద్ఘాటన పనులపై సమీక్ష
యాదాద్రి దేవాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, దేవస్థానం ఈవో గీతారెడ్డి, ఇతర శాఖల అధికారులతో సమీక్షాసమావేశం జరిగింది. ప్రధానాలయం ప్రారంభించే తేదీ కంటే ముందుగానే కొండకింద ఆలయ నగరిలో చేపట్టిన పనులను పూర్తిచేయాలని నిర్ణయించారు.
తుదిదశలో ఉన్న పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. ప్రధానం గా యాగస్థలి కోసం ప్రతిపాదించిన స్థలాన్ని చదును చేయడం, అంతర్గత రోడ్లు, అన్నప్రసాద సత్రం, సత్యనారాయణవ్రత మండపం, ఆర్టీసీ బస్టాండ్, గండిచెరువు, కొండపైకి నిర్మిస్తున్న రెండు ఫ్‌లైఓవర్‌లు, కొండపైన బస్‌బే, ప్రధాన ఆర్చీ పనులను వేగంగా పూర్తిచేయాలని, పార్కింగ్, సుందరీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే పూర్తి అయిన పుష్కరిణి, దీక్షాపరుల మండపం తుదిమెరుగులు దిద్దాలని యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment