సాక్షి, హైదరాబాద్: ప్రకృతి రమణీయత, జలపాతాలు, ఎటుచూసినా ఆకుపచ్చని అటవీ అందాలతో అలరారుతున్న కవాల్ పులుల రక్షిత అటవీ ప్రాంతంపై అటవీ శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. పర్యాటకులు, సందర్శకులకు ఉపయోగకరమైన పూర్తి సమాచారంతో తయారుచేసిన సైట్‌ను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అరణ్యభవన్‌లో మంగళవారం ప్రారంభించారు.
చదవండి: అక్కడ ‘కారు’ గెలుపు డౌటే!.. కారణం అదేనా?
కవాల్ అటవీ ప్రాంతం ప్రత్యేకత, విస్తరించిన ప్రాంతాలు, జంతువులు, పక్షులు, చెట్ల జాతుల వివరాలు, సందర్శనీయ స్థలాలు, ఎకో టూరిజం ప్రాంతాలు, సఫారీ, అన్‌లైన్ బుకింగ్ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కవాల్‌టైగర్.కామ్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాగా... కవాల్ అటవీ ప్రాంతంలో అభివృద్ది చేసిన గడ్డి మైదానాలపై (గ్రాస్ లాండ్స్) ప్రత్యేక బుక్‌లెట్‌ను, రాష్ట్రంలో మరొక పులుల సంరక్షణ కేంద్రం అమ్రాబాద్ టైగర్ రిజర్వు వార్షిక నివేదికను సైతం మంత్రి విడుదల చేశారు.
కవాల్ అభయారణ్యం సిబ్బంది బాగా పనిచేస్తున్నారన‍్న మంత్రి... ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్‌ను అభినందించారు. ఇక్కడ ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన గడ్డి మైదానాలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోందని, జాతీయ పులుల సంక్షణ సంస్థ (ఎన్టీసీఏ) నిపుణులు ప్రశంసించారని పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, వివిధ అటవీ సర్కిళ్ల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment