ఎస్కలేషన్ భారం 3 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 25 ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేం దుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోం దని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో ఉన్న అడ్డంకులను అధిగమించడంతోపాటు ధరల సర్దుబాటు(ఎస్కలేషన్)కు తుదిరూపు ఇస్తున్నామన్నారు. ధరల సర్దుబాటుతో ప్రభుత్వంపై రూ.2,700కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు. కొత్తగా టెండర్లు పిలిస్తే న్యాయపరమైన చిక్కులు, సమయం వృథాతోపాటు భారం రూ.15 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నందునే ధరల సర్దుబాటుకు నిర్ణయించామని వివరించారు.
సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గాదరి కిశోర్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం 13 మేజర్, 12 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు చూపిన ఉత్సాహం.. వాటిని పూర్తి చేయడంలో చూపలేదని విమర్శించారు. భూసేకరణ కోసం జీవో 123 తెచ్చామని, దీనిద్వారా మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలో భూమి కొనుగోలు వేగం గా జరుగుతోందని తెలిపారు. ఈ 25 ప్రాజెక్టుల కింద 41 వేల ఎకరాల భూమి అవసరం ఉందని, ఇవి పూర్తి చేసి 29 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు మొబిలైజేషన్ అడ్వాన్సుల ద్వారా రూ.2,950 కోట్లు ఇవ్వగా, అందులో రూ.2,674 కోట్లు రికవరీ చేసినట్లు వివరించారు.
రూ.1,024 కోట్లతో గోదాములు
ప్రతి మండలంలో అందుబాటులో ఉండేలా 17.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణం కోసం రూ.1,024 కోట్లు ఖర్చు చేయనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి వీటి నిర్మాణం పూర్తి చేస్తామని సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, హన్మంత్ షిండే అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
6.25లక్షల దీపం కనెక్షన్లు: జగదీశ్‌రెడ్డి
రాష్ట్రంలో 6.25 లక్షల దీపం కనెక్షన్లు మం జూరు చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులు, వితంతు మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. వచ్చే ఏడాది 3.50 లక్షల మందికి కనెక్షన్లు ఇస్తామని సభ్యులు కొండా సురేఖ, బొడిగె శోభ, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
227 చైన్ స్నాచింగ్‌లు: నాయిని
ప్రస్తుత ఏడాదిలో ఇప్పటిరవకు 227 చైన్ స్నాచింగ్‌లు జరిగాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు జె.గీత, డీకేఅరుణ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. గతేడాది 582 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ నేరాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
కృష్ణాపుష్కరాలపై 8న సమావేశం
వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో16, నల్లగొండలో 19స్నాన ఘట్టాలున్నాయని, కొత్త వాటిపై ప్రతిపాదనలు కోరామని వివరించారు. పుష్కరాలపై ఈనెల 8న సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సమక్క-సారక్క జాతరకు రూ.107 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు అందాయని సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పుట్టా మధు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ రాశారని వివరించారు.