మాది స్లోగన్‌ సర్కార్‌ కాదు.. సొల్యూషన్‌ సర్కార్‌ | Hyderabad: Harish Rao inaugurates Ayush Center at NIMS | Sakshi
Sakshi News home page

మాది స్లోగన్‌ సర్కార్‌ కాదు.. సొల్యూషన్‌ సర్కార్‌

Published Fri, Sep 1 2023 3:01 AM | Last Updated on Fri, Sep 1 2023 3:01 AM

Hyderabad: Harish Rao inaugurates Ayush Center at NIMS - Sakshi

లక్డీకాపూల్‌: మాది స్లోగన్‌ సర్కార్‌ కాదు.. సొల్యూషన్‌ సర్కార్‌ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్లు .. బీఆర్‌ఎస్‌ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం –నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఆయుష్‌ ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.

అమిత్‌ షా, ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివి వెళ్లిపోయారన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్‌ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్‌ తీరేమిటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని..బీఆర్‌ఎస్‌కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు.
నిమ్స్‌లో ఆయుష్‌ ఏర్పాటు

రాష్ట్రంలోనే తొలిసారి
నిమ్స్‌లో ఆయుష్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్‌ శాంతి కుమారికి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఈ తరహా వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతి వైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటల్లో 50 పడకల కొత్త ఆయుష్‌ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు.

వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో కొత్తగా 900 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. త్వరలో మరో 8 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించి.. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్‌ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్‌ సృష్టించబోతుందని హరీశ్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిమ్స్‌ సంచాలకులు నగరి బీరప్ప, ఆయుష్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగలక్ష్మి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement