
80 శాతం ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్ : గోదావరి పుష్కరాలను ఘ నంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న పుష్కరాలు ఈనెల 14 నుంచి 25 వరకు జరుగుతాయని, పుష్కరస్నానాలకు కోట్లాది మంది భక్తులు వస్తారని భావిస్తున్నట్లు బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో చెప్పారు. ఐదు జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతంలో 106 ఘాట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 12 ఏళ్ల క్రితం జరిగిన పుష్కరాల్లో తెలంగాణలో కేవలం 27 ఘాట్లనే ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
నిజామాబాద్ జిల్లా కుందకుర్తి నుంచి మొదలుకొని భద్రాచలం వరకు ఘాట్ల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. ఘాట్లకు అనుసంధానంగా రోడ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయన్నారు. పుష్కరాల నిర్వహణకు రూ.650 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని రూ.700 కోట్ల సాయం కోరితే కేవలం రూ. 50 కోట్లు మాత్రమే కేటాయించారని, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రూ.100 కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. పుష్కరాల గురించి విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు సాయం పెంచే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు.
106 ఘాట్ల కోసం రూ. 105.39 కోట్లు కేటాయించామని, రోడ్లు, ఇతర పనులకు ఆర్ అండ్‌బీ ద్వారా రూ. 250 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. పంచాయతీ రాజ్‌శాఖకు రూ.75 కోట్లు, మంచినీటి కోసం రూ.35 కోట్లు, దేవాదాయశాఖకు రూ. 20కోట్లు, బందోబస్తుకు రూ.25 కోట్లు, ట్రాన్స్‌కోకు రూ.12 కోట్లు, ఆరోగ్యశాఖకు రూ.2.5 కోట్లు కేటాయించి ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. భక్తుల కోసం 2,300 బస్సు సర్వీసులను, 84 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్నారు. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలంలో ప్రత్యేకంగా హెలిప్యాడ్లు ఏర్పాటుచేసి, రెండు హెలికాప్టర్లను హైదరాబాద్ నుంచి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
బందోబస్తు కోసం 18 వేల మంది పోలీసు సిబ్బంది అవసరమని, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పోలీసులను రప్పిస్తున ్నట్లు చెప్పారు. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బుర్రకథ, ఒగ్గుకథ, చిందు యక్షగానాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. రాష్ట్రపతి, ప్రధానిని కూడా ఆహ్వానించామని, భద్రాచలంకు హిమాలయాల నుంచి నాగసాధువులను ఆహ్వానించామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ పాల్గొన్నారు.