అలంపూర్/అలంపూర్ రూరల్: కృష్ణానదిలో కొన్ని నీళ్లు ఉన్నా పుష్కర స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని గొందిమల్ల వీఐపీ ఘాట్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జేసీ రాంకిషన్‌లతో కలిసి సందర్శించారు. ఘాట్ నిర్మాణ పనులు, పార్కింగ్, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులపై మంత్రులు సమీక్షించారు.
నదిలో నీటి ప్రవాహం దూరంగా ఉన్నప్పటికీ పుష్కరస్నానాలు చేయడానికి వీలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. పుష్కరఘాట్ వద్ద నదిలో మరో ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని, ఘాట్ నుంచి నదిలో ఉన్న నీటి ప్రవాహం వరకు ఇసుక, మట్టితో తాత్కాలిక రోడ్డు వేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పుష్కరాలకు రెండు, మూడు రోజుల ముందు అప్పటి నీటి ప్రవాహాన్ని బట్టి రోడ్డు వేసుకోవాలన్నారు. పుష్కరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వీరి వెంట మాజీ ఎంపీ మందా జగన్నాథం, ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, డీఎస్పీ బాలకోటి, సీఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మంజుల, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.