‘డబుల్ బెడ్‌రూం’కు కార్యాచరణ
గృహ నిర్మాణ శాఖతో జరిపిన సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యాలయంలో గృహ నిర్మాణశాఖకు చెందిన పలు అంశాలపై మంత్రి సమీక్ష జరిపారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పై జిల్లాలవారీగా టెండర్ల పురోగతి, పనుల ప్రారంభంపై ఆరా తీశారు. ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో 5,238 ఇళ్లకుగాను టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలపై రెవెన్యూ బృందాల విచారణను త్వరితంగా పూర్తి చేసి అర్హులకు పెండింగు బిల్లులు త్వర గా చెల్లించాలన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో రాజీవ్ స్వగృహ ఖాళీ ఫ్లాట్లపై సమీక్ష చేపట్టారు. బండ్లగూడ, పోచారంలోని స్వగృహ ఇళ్లకు ధరను నిర్ణయించి పేర్లు నమోదు చేసుకున్నవారికి నోటీసులు ఇవ్వాలన్నారు. హౌసింగ్ బోర్డు, గృహ నిర్మాణ సంస్థ విభజన ప్రక్రియ మందకొడిగా సాగడంపై వివరాలు కోరారు. సమీక్ష సందర్భం గా హౌసింగ్ బోర్డు కార్యాలయానికి వచ్చిన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి గృహ నిర్మాణ శాఖకు చెందిన అంశాలను ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వాంబే ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు.