‘కుంభమేళా’పై కుంభకర్ణ నిద్ర!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యమనే కుంభకర్ణ నిద్ర పోతుండటంతో వాటి ఏర్పాట్లలో ప్రణాళిక గల్లంతైంది. పుష్కరాలకు కేవలం 3 నెలల గడువే ఉన్నప్పటికీ పుష్కర ఘాట్లు, రోడ్ల నిర్మాణం, దేవాలయాల వద్ద వసతుల కల్పన వంటి పనులేవీ మొదలు కాలేదు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటన సందర్భంగా బాసర వద్ద 3 రోజుల క్రితం హడావుడిగా పుష్కరఘాట్లకు శ్రీకారం చుట్టిన అధికారులు మంథని, కాళేశ్వరం, ధర్మపురి, కోటిలింగాల తదితర ప్రాంతాల్లో మాత్రం పనులను ప్రారంభించలేదు.
గడువులోగా పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా వర్షాకాలం మొదలయ్యే నాటికి పనులు పూర్తికాకుంటే ఆ తర్వాత హడావుడిగా నిర్వహించినా వానల దెబ్బకు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహా కుంభమేళాకు ఏడాది ముందే పనులు చేపట్టింది. ఇప్పుడు మహారాష్ట్ర సర్కారు కూడా అదే బాటలో పయనిస్తోంది. కానీ మన ప్రభుత్వ విభాగాలు మాత్రం ముందస్తు ఏర్పాట్లలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.
స్థల సేకరణా జరగని తీరు..
గోదావరి పుష్కరాల్లో అతి ముఖ్యమైనవి స్నానఘట్టాలు, మహిళలు వస్త్రాలు మార్చుకునే గదులు. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు కొన్ని చోట్ల కనీసం స్థల సేకరణ కూడా పూర్తి కాలేదు. ధర్మపురి, బాసర దేవాలయాల వద్ద గోదావరి ఒడ్డు వద్ద ఆలయాలకు సంబంధించి ఎక్కువగా స్థలం లేదు. ఈ ప్రాం తాల్లో కచ్చితంగా ప్రైవేటు స్థలాలను ఎంపిక చేయాల్సిందే. కానీ ఇప్పటి వరకు ఆ కసరత్తు పూర్తికాలేదు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం లాంటి దేవాలయాల వద్ద అధికారులు చేతులెత్తేసేలా కనిపిస్తోంది. గతంలో సరస్వతీ పుష్కరాలు, ప్రాణహిత పుష్కరాలప్పుడు అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేసి చేతులెత్తేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది.
ముందుకు సాగని రోడ్ల పనులు...
పుష్కరాల నేపథ్యంలో గోదావరి తీరంలోని దేవాలయాలకు మంచి రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 35 పనులను గుర్తించి రూ.250 కోట్లను రోడ్లు భవనాల శాఖకు కేటాయించింది. కానీ టెండర్ కసరత్తు ఇటీవలే పూర్తై ఆ పనుల్లో 3, 4కు మించి ప్రారంభం కాలేదు. కాళేశ్వరం దేవాలయానికి గంగారం నుంచి దామరకుంట, అన్నారం మీదుగా 30 కిలోమీటర్ల మేర రూ. 33 కోట్లతో రెండు వరసల రోడ్డు నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నిర్మాణ సామగ్రి కూడా అక్కడికి చేరలేదు. ఈ దేవాలయం వద్ద కేవలం 36 గదులే ఉన్నాయి. గదుల కొరత తీవ్రంగా ఉంది. ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరగనున్నందున గతంలో సరస్వతీ పుష్కరాల సమయంలో నిర్మించినట్లుగా షెడ్లను రెట్టింపు చేయాలని ఆలయ కమిటీ ప్రతిపాదిస్తే దాన్ని ప్రభుత్వం తిరస్కరించింది.
ఇప్పుడూ ఇన్‌చార్జిల పాలనే
పుష్కరాల సమయంలో ఆయా ఆలయాలకు అధికారులను కేటాయించాల్సి ఉన్నా కరీంనగర్ జిల్లా దేవాలయాల వద్ద పరిస్థితులను పర్యవేక్షించాల్సిన అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వరరావును వేములవాడ ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. ఆయన కార్యాలయంలో సూపరింటెండెం ట్ కేడర్ అధికారిని ధర్మపురి ఆలయ ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఈవో రాజ్‌కుమార్‌కు మంథని గోదావరి పుష్కర ప్రాంత అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిం చారు. ఆయన ఇప్పటికే 15 ఆలయాల బాధ్యత చూస్తున్నారు. ఆలయాల అభివృద్ధి పనులకు కొన్నింటికి టెండర్లు పూర్తి కాలేదు.