రెండో రోజూ.. పుష్కర హోరు!
* తెలంగాణలో లక్షలాది మంది పుణ్య స్నానాలు
* కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలానికి పెద్దసంఖ్యలో భక్తుల రాక
* రాత్రి పొద్దుపోయాక కూడా తరలి వస్తున్న జనం
సాక్షి నెట్‌వర్క్: దారులన్నీ గోదారి వైపే.. తీరమంతా జనసంద్రమే.. ఎక్కడ చూసినా పుష్కరుడి సందడే.. గోదావరి మహా పుష్కరాల్లో రెండోరోజూ భక్తజనం పోటెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాన పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం కిక్కిరిసిపోయాయి.
బుధవారం రాత్రి 9 గంటల వరకు సుమారు 15 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. రాత్రి పొద్దుపోయాక కూడా వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఒక్క కరీంనగర్ జిల్లాలోనే సుమారు 10 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అందులోనూ ధర్మపురికి అత్యధికంగా భక్త జనసందోహం తరలివచ్చింది. ఇక్కడ 2.75 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ధర్మపురి తర్వాత అధిక సంఖ్యలో కాళేశ్వరానికి 2.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు.
భద్రాద్రికి పోటెత్తిన భక్తజనం..
ఖమ్మం జిల్లా భద్రాచలానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇక్కడ 1.70 లక్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. భక్తుల తాకిడి పెరగడంతో రామయ్య దర్శనానికి గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ క్యూలైన్లలో నిలబడ్డ భక్తులు సీతారామచంద్రస్వామి దర్శనం కోసం 6 గంటల సమయం వేచి ఉండగా.. రూ.200 టిక్కెట్ తీసుకున్న వారు సైతం 3 గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది.
తొలిరోజుతో పోలిస్తే పర్ణశాలకు భక్తుల రాక పెరిగింది. రెండోరోజు దాదాపు 15 వేలకుపైగా భక్తులు పుష్కరస్నానం ఆచరించారు. ఆదిలాబాద్‌లోని బాసరకు తొలిరోజుతో పోలిస్తే భక్తుల సంఖ్య తగ్గింది. రెండోరోజు ఇక్కడ దాదాపు 40 వేల మంది స్నానాలు చేశారు. చెన్నూరులో 25 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. సోన్ ఘాట్ వద్ద దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి షవర్ కింద పుష్కర స్నానం ఆచరించారు.
గూడెం ఘాట్‌కు వచ్చిన భక్తులు ఘాట్ల వద్ద నీళ్లు లేకపోవడంతో సమీపంలోని ధర్మపురి వెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో వివిధ ఘాట్లలో 92 వేలకుపైగా భక్తులు పుష్కర స్నానం చేశారు. వరంగల్ జిల్లాలో సుమారు 20 వేల మంది భక్తులు పుష్కర స్నానం చేశారు. బుధవారం అమావాస్య కావడంతో భక్తుల సంఖ్య కాస్త తగ్గింది. గురువారం నుంచి జనం పెద్దఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది.