పురాణాలు చెబుతున్నది అదే... దేశంలోనే అరుదైన యమధర్మరాజు విగ్రహం
ధర్మపురి: ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం ప్రాంగణంలోనే యమధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడి యమధర్మరాజు విగ్రహం దేశంలోనే అరుదైనదిగా చెబుతుంటారు. భక్తులు ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న తర్వాతే శ్రీలక్ష్మీనృసింహ, వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ.
యమధర్మరాజు భరణి జన్మనక్షత్రం సందర్భంగా ప్రతి నెలా ఆలయ ప్రాంగణంలో ఆయుష్షు హోమం, హారతి, మంత్రపుష్పం తదితర పూజలు చేస్తారు. ఏటా దీపావళి పర్వదినం సందర్భంగా యమ ద్వితీయ వేడుకలు నిర్వహిస్తారు. యమ ద్వితీయ రోజు యమధర్మరాజు నరక ద్వారాలను మూసివేసి తన సోదరి అయిన యమి ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. నరక ద్వారాలు మూసిన సందర్భంగా ఆరోజు మృతిచెందిన వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని నమ్మకం. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తుంటారు.
యమధర్మరాజు ఆలయంలో ఆయుష్షు హోమం
ఇదీ ఆలయ ప్రాశస్త్యం
పూర్వం యముడు తాను చేసిన పాపాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. మనస్సుకు శాంతి కావాలని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు. చివరగా నృసింహస్వామిని దర్శించుకునేందుకు ధర్మపురికి చేరుకున్నాడు. పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి.. నృసింహుడిని శరణు వేడుకుంటాడు. స్వామి అనుగ్రహం లభించి పాప విముక్తుడయ్యాడు. నృసింహుని కృపతో ఆలయంలో దక్షిణ దిశలో వెలిశాడు. ముందు భక్తులు తనను దర్శించుకున్న తర్వాతే నృసింహుడిని దర్శించుకునేలా వరం పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి. కాగా యముడు గోదావరి నదిలో స్నానం ఆచరించిన చోట యమగుండాలు అనే పేరు వచ్చింది.
క్రీ.శ 850– 928 నాటి ఆలయం
ధర్మవర్మ అనే రాజు పాలించినందుకు ధర్మపురికి ఆ పేరు వచ్చింది. ఈ క్షేత్రం క్రీ.శ. 850– 928 నాటి కంటే ముందునుంచే ఉన్నా.. క్రీ.శ. 1422–1436 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. అనంతరం 17వ శతాబ్దంలో నృసింహ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు చరిత్ర చెబుతోంది.
మా ఇలవేల్పు లక్ష్మీనృసింహుడు
ధర్మపురి లక్ష్మీనృసింహుడు మా ఇంటి ఇలవేల్పు. స్వామివారి దర్శనం కోసం వస్తూనే ఉంటాం. ఇక్కడున్న యమ ధర్మరాజును దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని మా నమ్మకం.
– భారతి, భక్తురాలు, కరీంనగర్
యముని దర్శనం కోసం వస్తాం
ధర్మపురిలోని యమ ధర్మరాజు దర్శనం కోసం వస్తుంటాం. దేశంలో ఇలాంటి ఆలయం ఎక్కడా లేదని అంటుంటారు. అందుకే ఏటా యమున్ని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో వస్తాం.
– సాహితి, భక్తురాలు, మంచిర్యాల
ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు
ధర్మపురిలోని యమధర్మరాజు ఆలయాన్ని దేశంలోనే అరుదైనదిగా భావిస్తారు. అందుకే యముడు, లక్ష్మీనృసింహుని దర్శనం కోసం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
– శ్రీనివాస్, ధర్మపురి ఆలయ ఈవో
Comments
Please login to add a commentAdd a comment