కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం
♦ శాసనమండలిలో ఈటల హామీ
♦ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వానికి సంబంధం లేదు
♦ నవంబర్ నాటికి కొత్త ఆహార భద్రతా కార్డుల జారీ
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులందరినీ త్వరలో క్రమబద్ధీకరిస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్, జనార్దన్, సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ, సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఈటల ఈ మేరకు బదులిచ్చారు. 1993 నుంచి ఇప్పటివరకు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నియమితులైన 25,529 మంది కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించినట్లు మంత్రి తెలిపారు.
కాంట్రాక్టు సిబ్బంది సర్వీసుల క్రమబద్ధీకరణను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధికారుల కమిటీని నియమించినట్లు తెలిపారు. కోర్టు తీర్పులను దృష్టిలో ఉంచుకొని అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కమిటీ కొన్ని సిఫార్సులు చేసిందన్నారు. ఏజెన్సీల ద్వారా, సిబ్బంది తక్కువగా ఉన్న శాఖలు అవసరాలకు అనుగుణంగా నియమించుకున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో ప్రభుత్వానికి సంబంధం లేదని ఈటల స్పష్టం చేశారు.
రేషన్‌కార్డుల హేతుబద్ధీకరణ...
రేషన్ దుకాణాల్లో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని...రేషన్ కార్డుల హేతబద్ధీకరణ చేపడతామని ఈటల చెప్పారు. రేషన్ అక్రమాలను అరికట్టేందుకు డీలర్ల కమీషన్‌ను పెంచనున్నట్లు తెలిపారు. 20 శాతం వరకు బియ్యం పక్కదారి పడుతోందని...దీన్ని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇ-పాస్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 54 వేల కార్డులను ప్రజలు స్వచ్ఛందంగా వెనక్కు ఇచ్చారన్నారు. ఆధార్ కార్డు లేదని ఏ ఒక్కరినీ తొలగించలేదని, సబ్సిడీ బియ్యానికి 2.82 కోట్ల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. కొత్తగా ముద్రించిన ఆహార భద్రతా కార్డులను నవంబర్ నాటికి జారీ చేయాలని నిర్ణయించినట్లు ఈటల తెలిపారు.
స్టీల్‌ప్లాంటు స్థాపనకు చర్యలు: హరీశ్
రాష్ట్రంలో స్టీల్ ప్లాంటు స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీశ్‌రావు మండలిలో తెలిపారు. రాష్ట్రంలో స్టీల్ ప్లాం టును స్థాపించేందుకు గల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వ ఉక్కుశాఖ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. భారత భౌగోళిక సర్వే ప్రాథమిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 302 మిలియన్ టన్నుల వివిధ గ్రేడ్ల ఇనుప ఖనిజం ఉందన్నారు. ప్లాంటు స్థాపనకు జీ-3 కేటగిరీలో 200 మిలియన్ టన్నుల నిక్షేపాలు సెయిల్‌కు తప్పనిసరిగా కావాల్సి ఉం టుందని, బయ్యారంలో పూర్తిస్థాయిలో అన్వేషణ జరుగుతోందన్నారు. జీ-3 కేటగిరీ తేవడానికి అంతర్జాతీయ బిడ్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు హరీష్‌రావు తెలిపారు.
కంతనపల్లి బ్యారేజీ ఎత్తును మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని హరీశ్‌రావు మరో ప్రశ్నకు బదులిచ్చారు. బ్యారేజీ వల్ల 4 గ్రామాలు పూర్తిగా, 13 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయని, దాన్ని తగ్గిం చేందుకే ఈ ఆలోచన చేస్తున్నామన్నారు. కాగా, వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం పరిసర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి తగిన సంస్థ ఏర్పాటును పరిశీలిస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది సమ్మక్క సారలమ్మ జాతరను, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోందన్నారు.