సోమవారం భద్రాద్రిలో జరిగిన కల్యాణోత్సవంలో సీతారాములపై తలంబ్రాలు పోస్తున్న అర్చకులు
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కల్యాణం సోమవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. రామాలయ సమీపంలోని మిథిలా ప్రాంగణంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకను కనులారా చూసిన భక్తులు పులకించిపోయారు. వేడుకలో భాగంగా మొదట గర్భగుడిలో అభిషేకం జరిపించారు. అక్కడ ధ్రువమూర్తులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తర్వాత వేద పండితుల మంత్రోచ్ఛరణలు, ఆలయ ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు.
భక్త రామదాసు చేయించిన బంగారు నగలను ధరించిన శ్రీసీతారాముల వారు చూడముచ్చటగా కనిపించారు. ఉదయం 10 గంటల నుంచి ఆలయ వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణ తంతు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తంలో జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ విగ్రహాల శిరస్సులపై ఉంచారు. భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో మాంగల్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తలంబ్రాలు పోసే వేడుకను జరిపించారు. భద్రాద్రి క్షేత్ర మహత్మ్యం, శ్రీసీతారాముల కల్యాణ విశిష్టతను వేద పండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు.
మార్మోగిన రామనామస్మరణం
శ్రీసీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు. సుమారు 1.50 లక్షల మంది కల్యాణాన్ని తిలకించారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి కల్యాణ వేడుక తంతు జరుగుతున్నంత సేపూ మిథిలా ప్రాంగణం రామనామస్మరణంతో మార్మోగింది. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీసీతారాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువస్త్రాలు తీసుకొస్తారని ప్రకటించినప్పటికీ.. చివరి క్షణాల్లో ఆయన పర్యటన రద్దయింది. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున జేఈవో శ్రీనివాసరాజు శ్రీసీతారాముల వారికి పట్టువస్త్రాలను అందజేశారు.
రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కల్యాణోత్సవాన్ని వీక్షించారు. స్వామివారికి కల్యాణం జరిగిన వేదికపైనే మంగళవారం పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment