ప్రత్యేక హైకోర్టుతోనే సంపూర్ణ తెలంగాణ
విభజన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాం న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టుతోనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమవుతుందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని, టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపజేశారని తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వార్షిక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ..
హైకోర్టు విభజన జరిగితే న్యాయశాఖలో అనేక ఖాళీలు ఏర్పడతాయని.. జడ్జి పోస్టులను కూడా భర్తీ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లకు వచ్చే వడ్డీని జూ నియర్ న్యాయవాదులకు అందేలా చూస్తామని తెలిపారు. అలాగే న్యాయవాదులకు హెల్త్‌కార్డులు, గృహ నిర్మాణ సదుపాయాన్ని కల్పించే విషయమై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్పోర్ట్స్ లాంజ్‌ను, బార్ అసోసియేషన్ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సమావేశంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి టి.రజని, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యు లు, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, ఫెడరేషన్ అధ్యక్షులు బి.కొండారెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు చింతల క్రిష్ణ, భూపాల్‌రాజ్, సంపూర్ణ, తిరుపతి వర్మ, వినోద్‌కుమార్ పాల్గొన్నారు.