చరిత్రలో నిలిచిపోయేలా పుష్కరాలు | krishna pushkaralu organized by in history | Sakshi
Sakshi News home page

చరిత్రలో నిలిచిపోయేలా పుష్కరాలు

Published Tue, Jul 26 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

బీచుపల్లి పుష్కర ఘాట్‌ వద్ద కృష్ణమ్మకు పూజలు చేస్తున్న మంత్రులు

బీచుపల్లి పుష్కర ఘాట్‌ వద్ద కృష్ణమ్మకు పూజలు చేస్తున్న మంత్రులు

  •  గోదావరి కంటే ఘనంగా నిర్వహించేందుకు కృషి 
  •  90శాతం పుష్కరాల పనులు పూర్తి 
  •  మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు
  • కొల్లాపూర్‌రూరల్‌: కృష్ణా పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. భక్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి కృష్ణా పుష్కరాలు చరిత్రలోనే నిలిచిపోయేలా నిర్వహిస్తామన్నారు. మండలపరిధిలోని సోమశిలలో కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జరుగుతున్న ఘాట్ల పనులను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా వీఐపీ ఘాట్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కంటే ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.825కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. పుష్కరాలకు సంబంధించి దాదాపు 90శాతం పనులు పూర్తయ్యాయని, పదిశాతమే మిగిలి ఉన్నాయన్నారు. వాటిని ఈనెలాఖరు వరకు పూర్తి చేయడానికి అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వచ్చేనెల 5, 6 తేదీల వరకు పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయన్నారు. పుష్కరఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే కృష్ణానదికి నీళ్లు వస్తున్నాయని, పుష్కరాల వరకు పూర్తిస్థాయిలో నదికి నీళ్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. సోమశిలకు భక్తులు ఎక్కువగా వస్తారని, ఈ ప్రాంతంలో ఒక్క ప్లాస్టిక్‌ వస్తువు కనిపించకుండా పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పుష్కరాల ఘాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు నిత్యం పర్యవేక్షిస్తూ పనులు త్వరగా పూర్తయ్యేందుకు కృషి చేస్తున్నారన్నారు.
     
    షవర్లు ఏర్పాటు చేయాలి: మంత్రి జూపల్లి
    సోమశిల సమీపంలో జనరల్‌ ఘాట్‌ సమీపంలో షవర్లు ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కృష్ణానదిలో మునగలేని భక్తులకు షవర్లు ఉపయోగపడతాయన్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎప్పటికప్పుడు మైకుల ద్వారా ప్రజలకు అన్ని సమస్యలు, వసతులను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. వీఐపీ ఘాట్‌ దగ్గర 25ఎకరాల్లో పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేశామని మంత్రి జూపల్లికి జేసీ రాంకిషన్‌ తెలిపారు. సోమశిల ఆధ్యాత్మిక ప్రాంతమైనందున ప్రతిరోజూ లక్ష వరకు భక్తులు వచ్చే అవకాశముందని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని జేసీని మంత్రి ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా సోమశిలలో ఏర్పాటు చేసే దుకాణాలను ఊరి బయటనే పెట్టాలని వ్యాపారులకు సూచించారు. అనంతరం సోమశిల జనరల్‌ పుష్కరఘాట్‌ వద్ద జంగమ్మగుడి సమీపంలో మంత్రులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో జేసీ రాంకిషన్, ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్‌ రఘుపతిరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ విద్యాసాగర్, పీఆర్‌ డీఈ రాములు, జూపల్లి రామారావు, ఎండీ ఎక్బాల్, వివిధ శాఖల అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 
     
    నాలుగైదు రోజుల్లో పండగ వాతావరణం
    ఇటిక్యాల: కృష్ణా పుష్కరాల ఘాట్ల వద్ద నాలుగైదు రోజుల్లో పండగ వాతావరణం నెలకొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. బీచుపల్లి వద్ద పుష్కరఘాట్ల నిర్మాణ పనులను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 52పుష్కరఘాట్లకు ఒక్కో  ప్రత్యేకాధికారిని నియమించి, పనులు యుద్ధప్రాతిపాదికన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణా పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా నిలిచేలా రాష్ట్రప్రభుత్వం కృష్ణాపుష్కరాలను నిర్వహించేందుకు కృషి చేస్తోందన్నారు. పుష్కరఘాట్ల వద్ద ఉన్న ఆలయాలను అలంకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
     
    ఆలయ ఈఓపై ఆగ్రహం 
    బీచుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం మంత్రులు సందర్శించారు. పుష్కర సమయం ముంచుకొస్తున్నా ఆలయం వద్ద అలాంటి వాతావరణం కనిపించక పోవడమేమిటని ప్రశ్నించారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద, గర్భగుడి వద్ద ఉన్న సమస్యలు తొలగించాలని చెప్పినా అర్థం కావడం లేదా అని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ గోపురం నిర్మాణ పనులు పుష్కరాల పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.  
     
    కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు
    పెబ్బేరు: రంగాపూర్‌ ఘాట్‌ వద్ద మంగళవారం మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తామని వారు ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్, డీఎస్పీ జోగుల చెన్నయ్య,  పెబ్బేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గౌనిబుచ్చారెడ్డి, తదితరులున్నారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement