జిల్లాలో 1,84,94,164మంది పుష్కరస్నానం | 1,84,94,164 | Sakshi
Sakshi News home page

జిల్లాలో 1,84,94,164మంది పుష్కరస్నానం

Published Wed, Aug 24 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

నదీ హారతి ఇస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

నదీ హారతి ఇస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

కృష్ణవేణి ఒడిలో తరించిన భక్తులు
  •  ముగిసిన పుష్కర మహోత్సవాలు
  • నదీమతల్లికి సంధ్యాహారతితో వీడ్కోలు పలికిన భక్తులు
  • బీచుపల్లిలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి, అలంపూర్‌లో కలెక్టర్‌ పూజలు
  • సోమశిలలో హారతి ఇచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి
  • చివరిరోజూ ఘాట్లకు పోటెత్తిన జనం
  • లక్షలాది మంది పుణ్యస్నానం
 
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : కృష్ణా పుష్కరాలు ముగిశాయి. జిల్లాలో 12రోజులపాటు అత్యంత వైభవంగా సాగాయి. పండితుల వేదమంత్రాల మధ్య మళ్లొస్తాం అంటూ మంగళవారం కృష్ణవేణికి వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణ పుష్కరాలు జిల్లాలో వివిధ పుష్కరఘాట్లలో అత్యంత వైభోవోపేతంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 12వ తేదీన అలంపూర్‌లోని గొందిమళ్లలో ఉదయం 5.58 నిమిషాలకు అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు.  జోగుళాంబ దేవాలయాన్ని సీఎం కుటుంబసమేతంగా దర్శించారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డీజీపీ అనురాగ్‌శర్మ, జైళ్ల శాఖ అడిషనల్‌ డీజీ వీకే సింగ్, అడిషన్‌ డీజీ అంజనికుమార్, డీఐజీ అకున్‌ సబర్వాల్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, తదితరులు అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించారు. పుష్కరాల చివరి రోజైన మంగళవారం జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని గొందిమళ్ల, బీచుపల్లి, అలంపూర్, సోమశిల, రంగాపూర్, నది అగ్రహారం, పస్పుల, పంచదేవ్‌పహాడ్, మరుముల, గుమ్మడం, మూనగాన్‌దిన్నె, కృష్ణ, పాతాళగంగ వంటి పుష్కరఘాట్లలో లక్షలాదిగా భక్తులు చివరిరోజు పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా అనేక మంది పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. 12వ తేదీనుంచి 23వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ఘాట్లలో 1,84,94,164 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. 
 
ప్రముఖుల పూజలు
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రంగాపూర్‌ ఘాట్‌లో కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. జైళ్ల శాఖ అడిషనల్‌ డీజీ వీకే సింగ్‌ బీచుపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. రంగాపూర్‌ ఘాట్‌లో సినీ నిర్మాత రామ యాదిరెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పుణ్యస్నానాలు చేసి పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఛైర్మన్‌ బండారు భాస్కర్, కలెక్టర్‌ టికె.శ్రీదేవి రంగాపూర్, బీచుపల్లి పుష్కరఘాట్లను సందర్శించారు. గొందిమళ్లలో సీఎం పుష్కరాలను ప్రారంభించిన ప్రాంతంలోనే జిల్లా కలెక్టర్‌ శ్రీదేవి, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పుష్కరాలను ముగింపు ఉత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రజలను క్షేమంగా చూడాలంటూ పండితులు వేద ఆశీర్వాదం చేశారు. బీచుపల్లిలో జరిగిన పుష్కరాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని కృష్ణమ్మకు ప్రత్యేక గంగ హారతి ఇచ్చారు. 12 రోజులపాటు పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ మంత్రులు అభినందనలు తెలిపారు. సోమశిలలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజయ్య పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
సీఎం అభినందించారు
 జిల్లాలో కృష్ణా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, వలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు, 48 శాఖల ఉద్యోగ, సిబ్బంది సహాయ సహాయ సహకారాలతో పుష్కరాలు జయప్రదం అయ్యాయి.’’ 
– కలెక్టర్‌ టీకే శ్రీదేవి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement