Jogulamba Temple
-
జోగుళాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు
జోగుళాంబ శక్తిపీఠం(మహబూబ్‌నగర్ జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి అరుదైన గౌరవం లభించింది. హిందుస్తాన్ గగన్‌గౌరవ్ జ్యోతిర్లింగ ఫౌండేషన్లు వరల్డ్ హెల్త్ డయాబెటిక్, క్యాన్సర్, ఎయిడ్స్ ఫౌండేషన్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని గాంధీభవన్‌లో సంయుక్తంగా నిర్వహించిన ఓ సదస్సులో జోగుళాంబ ఆలయానికి ‘హిందుస్తాన్ గగన్‌గౌరవ్ అంతర్జాతీయ పురస్కారం–2022’ప్రకటించారు. కోవిడ్ సమయంలో వచ్చిన తుంగభద్ర నదీ పుష్కరాలకు లక్షలాది మంది వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తకుండా నిర్వహించినందుకు గాను ఈ అవార్డును ఇస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆలయ ఈఓ పురేందర్, ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, వేదపండితులు శ్యాంకుమార్ శర్మలను ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించి వారికి అవార్డును ప్రదానం చేశారు. -
ఆది దేవత... లజ్జాగౌరి
హిందువులు ‘లజ్జాగౌరి’ని ఆదిదేవతగా పూజిస్తారు. క్రీస్తుకు పూర్వం నుంచే ఈమెను కొలుస్తున్నట్టు చరిత్ర చెపుతోంది. హరప్పా, మొహంజొ దారో నాగరికతల్లోనూ లభ్యమయిన ఆధారాల బట్టి అప్పటికే లజ్జాగౌరి ఆరాధన ఉన్నట్లు చెప్పవచ్చు. సంతాన దేవతగా ఈమెను ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆరాధిస్తూనే ఉన్నారు. తెలంగాణలో జోగు లాంబ గద్వాల్ జిల్లా, అలంపూర్‌లో ఈ అమ్మవారు దర్శనమిస్తోంది. శక్తి పీఠంగా అలంపూర్ గురించి తెలిసిన వాళ్లు, అక్కడే ఉన్న లజ్జాగౌరీదేవి గురించి మాత్రం తెలియదే అని తెల్ల మొహం వేస్తుంటారు. సంతానం కోసమే కాక తమను బాధిస్తున్న వివిధ గుప్త వ్యాధుల నుండి బయట పడేయమనీ స్త్రీలు లజ్జాగౌరిని పూజిస్తారని అంటారు. నిజానికి ప్రస్తుతం భారతదేశంలో పూజించే గ్రామ దేవతలు అందరూ లజ్జా గౌరి ప్రతిరూపాలే అనాలి. చాలా చోట్ల చర్మవ్యాధులు, ఇతర గుప్తరోగాలు ఉన్న మహిళలు గ్రామదేవతల జాతర్ల సందర్భంలో వివస్త్రలై లేదా వేప మండలతో శరీరాన్ని కప్పుకుని పూజించడం ఇప్పటికీ ఆచారంగా కొనసాగుతోంది. రేణుక ఎల్లమ్మ వంటి గ్రామదేవతను లజ్జా గౌరిగా పేర్కొనే కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ కథ ప్రకారం... నిమ్న కులానికి చెందిన రేణుక తలను అగ్రకులస్థుడొకడు నరికివేశాడు. అయితే రేణుక చనిపోలేదు. తల స్థానంలో కమలాన్ని మొలిపించుకొని జీవించింది. పద్మం, యోని అనేవి సంతానానికి సంకేతాలు. ఈ దేవత విగ్రహాలను గమనించినప్పుడు... పద్మ ముఖం, గుడ్రంగా కుండ మాదిరిగా ఉన్న ఉదరం, చెవులకు అందమైన కమ్మలు, మెడలో హారాలు కనిపిస్తాయి. ఆలంపూర్‌లోనే కాక చేర్యాల, హుజురాబాద్, కొలనుపాక, కోహెడ, బెజ్జంకి, తంగళ్లపల్లి వంటి చోట్ల లజ్జాగౌరి విగ్రహాలు ఉన్నాయి. హన్మకొండలోని రాజరాజ నరేంద్ర భాషా నిలయం మలుపులో కూడా ఒక లజ్జాగౌరి విగ్రహం 2010 వరకూ ఉండేది. – కన్నెకంటి వెంకట రమణ జాయింట్ డైరెక్టర్, సమాచార శాఖ, హైదరాబాద్ -
రాష్ట్రంలోకి రామరథయాత్ర
జోగుళాంబ శక్తిపీఠం(అలంపూర్): అయోధ్య రామమందిరంలో ఓంకార ధ్వనులను ప్రతి ధ్వనింపజేసే ఘంటానాదానికి ఐదో శక్తిపీఠం అమ్మవారు జోగుళాంబదేవి ఆశీస్సులు అందాయి. భక్తురాలు రాజ్యలక్ష్మి ఈ గంటను రామ రథయాత్ర ద్వారా అయోధ్యకు చేరుస్తున్నారు. రామేశ్వరం టు రామ జన్మభూమి పేరిట 613 కిలోల ఈ గంటను అయోధ్యకు చేర్చేందుకు సెప్టెంబర్ 17న రామరథ యాత్రను ప్రారంభించారు. శుక్రవారం ఈ యాత్ర తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయానికి చేరుకుంది. ఆలయ ఈఓ ప్రేమ్‌కుమార్ అర్చకులతో కలసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 21రోజుల పాటు 4,552 కిలోమీటర్లు, పది రాష్ట్రాల మీదుగా భక్తుల పూజలందుకుంటూ అయోధ్యకు ఈ గంటలను చేరుస్తామని రథసారథి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. -
అమ్మా.. దయ చూపమ్మా!
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): తాజాగా రాజకీయ నిరుద్యోగుల చూపంతా జోగుళాంబ అమ్మవారి దేవస్థానం పైపు పడింది. ఇటీవల స్థానిక ఎన్నికలలో ఆశపడి బంగపోయిన వారికంతా నామినేటెడ్ పదవులు ఇస్తామని బుజ్జగించడంతో ఇప్పుడు ఆ రాజకీయ నిరుద్యోగులంతా జోగుళాంబ అమ్మవారి దేవస్థానం కమిటీ వైపు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం సహకార ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల పర్వం ముగిసిన అనంతరం దేవస్థానం కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో పడ్డారు నియోజకవర్గ పెద్దలు. ఇదిలా ఉండగా, ఇక నియోజకవర్గ పెద్దలు దేవస్థానం ట్రస్టు బోర్డు విషయంలో ఎలాంటి పావులు కదిపినా చైర్మన్‌గా పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలనేది సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఈ ఏడాది తుంగభద్ర నదికి పుష్కరాలు రానున్న నేపథ్యంలో ఆధ్యాత్మిక చింతన కలిగిన మంచి పేరున్న వ్యక్తినే ఈ పదవిలో కూర్చోబెట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు దేవదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు అక్రమాలకు చెక్ పెట్టేందుకు.. 2018 నవంబర్ 10వ తేదీన తిరుపతిరెడ్డి చైర్మన్‌గా పదవీ విరమణ కాలం ముగిసింది. దీంతో 16 నెలలుగా దేవస్థానానికి మళ్లీ ట్రస్టుబోర్డు నోటిఫికేషన్ వెలువడలేదు. నేటి దాక మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకం చేపట్టలేదు. దీంతో పరిపాల భారమంతా కూడా కేవలం ఆలయ కార్యనిర్వహణ అధికారులపైనే పడింది. ప్రతినిత్యం ప్రముఖుల సందర్శనలతో కిక్కిరిసే ఈ ఆలయాలకు స్థానికంగా అందుబాటులో లేని కార్యనిర్వహణ అ«ధికారులతో పరిపాలన కూడా అస్తవ్యస్తంగా మారింది. పరిపాలన అధికారి స్థానికంగా లేకపోవడంతో ఆలయంలో సిబ్బంది పనితీరులో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆలయాల్లో సమయపాలన పాటించని సిబ్బంది క్రమక్రమంగా అక్రమాలకు కూడా తెరతీశారు. భక్తుల ద్వారా మొక్కుబడుల రూపంలో దేవస్థానానికి వచ్చే బంగారు ఆభరణాలు ఈవో చేతిలో ఉండాల్సి ఉండగా, వాటి బాధ్యత కూడా అక్కడి సిబ్బందే నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల ఆలయంలో భక్తులకు వేలం పాట ద్వారా విక్రయించే చీరలు, భక్తులు అమ్మవారికి సమర్పించే వడిబియ్యంతో వచ్చే చిన్నపాటి బంగారు ముక్కుపుడకలు, మాంగళ్యాలు తదితర వాటిలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు రాకపోలేదు. అంతేకాక ఆలయంలో గుర్తింపు పొందిన సిబ్బంది స్థానంగా ‘సేవ’ పేరిట నకిలీ ఉద్యోగులు కూడా అక్కడి కార్యక్రమాలు చక్కబెడుతూ రావడంతో దేవదాయ శాఖలోనే చర్చనీయాంశంగా మారింది. పదవిని దిక్కించుకునేందుకు యత్నాలు.. ఈ ఏడాది నవంబర్‌లో తుంగభద్ర నది పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ రానుండడంతో జోగుళాంబ అమ్మవారి దేవస్థానానికి ట్రస్టుబోర్డు సభ్యులుగా, చైర్మన్‌గా ఎవరిని నియామకం చేయాలనేది తేలనుంది. అయితే దేవస్థానం చైర్మన్ పోటీలో పాత చైర్మన్లు ఇద్దరు గట్టి పోటీలో ఉండగా, నూతనంగా కొత్త వారు కూడా తెరవెనక నుంచి పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. -
చివరిరోజు సిద్ధిధాత్రిగా దర్శనమిచ్చిన జోగుళాంబ
సాక్షి, జోగుళాంబ: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం చివరిరోజు సిద్ధిదాత్రిదేవీ అలంకరణతో అమ్మవారి తొమ్మిది అవతారాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జోగుళాంబదేవిని చివరిరోజు సిద్ధిదాత్రి దేవిగా అలంకరించి ఆరాదించారు. అమ్మవారికి ప్రాథఃకాలం నవవిధ ఔషధీమూలికా జలాలతో అభిషేకాలు చేశారు. పట్టువస్త్రాలు, వివిధ రకాలతో పూలతో అమ్మవారిని అలంకరించి దశవిధ హారతులు ఇచ్చారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రికాల సమయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేకంగా కంకుమార్చనలు, సహస్రనామార్చనలు, నవావరన అర్చనలు నిర్వహించారు. అదేవిధంగా యాగశాలలో సర్వతోభద్ర మండలానికి ఆవాహిత దేవతాపూజలు జరిపించారు. సంకల్పాన్ని నెరవేర్చే అమ్మవారు భక్తులు త్రికరణ శుద్ధిగా కోరే సంకల్పాలను నెరవేర్చే తల్లి సిద్ధిద్రాతి అని ఆలయ అర్చకులు తెలిపారు. అందుకే నవరాత్రి దీక్ష చేయలేని వారు చివరిరోజు అయినా సిద్ధిధాత్రిని ఆరాదించాలని పేర్కొన్నారు. సిద్ధిదాత్రి అనుగ్రహం ఉంటే అష్టసిద్ధులలోని అనిమాసిద్ధి, మమా సిద్ధి, గిరిమా సిద్ధులతోపాటు ఆదిపరాశక్తి అనుగ్రహం కలుగుతుందన్నారు. నేడే తెప్పోత్సవం.. విజయ దశమిని పురస్కరించుకొని.. ఉత్సవాల ముగింపులో భాగంగా నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్శనగా నిలిచే తెప్పోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం 7 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకోసం సర్వం సిద్ధం చేసినట్టు దేవస్థానం ఈఓ ప్రేమ్‌కుమార్ తెలిపారు. కాగా ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం ఆయన మరోమారు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారోత్సవ రథోత్సవం ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వరుడికి సోమవారం వారోత్సవం కావడంతో సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను రథోత్సవంలో కూర్చోబెట్టి ఆలయ ప్రాకార మండపం చుట్టూ ముమ్మూర్లు ప్రదక్షిణలు గావించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోగుళాంబ సన్నిధిలో సీడీఎంఏ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మధ్యాహ్నం కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) టీకే శ్రీదేవి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు. వారికి దేవస్థానం ఈఓ ప్రేమ్‌కుమార్ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవీ నవరాత్రి సందర్భంగా సీడీఎంఏ టీకే శ్రీదేవిని అలంపూర్ జోగుళాంబ ఆలయానికి ఆహ్వానించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఉభయ ఆలయాల్లో అర్చకులు వారితో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం చేయగా.. దేవస్థానం ఈఓ టీకే శ్రీదేవికి, ఎమ్మెల్యేకు శేషవస్త్రాలను అందజేశారు. వీరితోపాటు ఎంపీడీఓ, ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, తహసీల్దార్ తిరుపతయ్య, ఏఎస్ఐ తిమ్మరాజు తదితరులున్నారు. -
స్కందమాతగా జోగుళాంబ
జోగుళాంబ శక్తిపీఠం : అలంపూర్ జోగుళాంబ ఆలయంలో గురువారం 5వ రోజు అమ్మవారు స్కందమాత దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి ముందు నవావరణ అర్చనలతో పాటుగా కుమారి, సువాసిని పూజలు చేశారు. దేవస్థానం తరఫున ఈఓ ప్రేమ్‌కుమార్ ముత్తయిదువులకు చీరలు అందజేశారు. ఏపీ నుంచి పట్టువస్త్రాలు కాగా, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జోగుళాంబ అమ్మవారికి ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు పంపించనున్నారు. ఈ నెల 4వ తేదీన కర్నూలు కలెక్టర్ వీరపాండ్యన్, కర్నూలు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాయుడు ఆలయానికి చేరుకుని పట్టువస్త్రాలు అందజేస్తారు. -
హరీశ్‌రావు సీఎం కావాలంటూ పూజలు
సాక్షి, జోగుళాంబ శక్తిపీఠం( అలంపూర్): తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా హరీశ్‌రావు కావాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపురం జోగుళాంబ ఆలయం ముందు హరీశ్‌రావు అభిమానులు 1116 టెంకాయలు కొట్టారు. వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట విష్ణు ఆధ్వర్యంలో కొంతమంది ఆ గ్రామస్తులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్యమంత్రి కావాలని, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం కావాలని అమ్మవారికి టెంకాయలు కొట్టి మొక్కు సమర్పించారు. అమ్మవారి రాజగోపురం ముందు టెంకాయలు కొట్టి హరిశ్ సీఎం కావాలని నినదించారు. -
జోగుళాంబ ఆలయంలో అమిత్‌షా భార్య పూజలు
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): జోగుళాంబ గద్వాల జిల్లా లోని అలంపూర్ శ్రీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆల యాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సతీమణి సోనాలి షా మంగళవారం సందర్శించారు . ఈ సందర్భంగా ఆమెకు దేవస్థానం ఈఓ గురురాజ, అర్చకులు ఘన స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వరుడికి ఆమె ముందుగా మహారుద్రాభిషేకం చేశాక జోగుళాంబ అమ్మవారికి ఖడ్గమాల అర్చన చేయించారు. పూజల అనంతరం అర్చకులు అమ్మవారి జ్ఞాపికలతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ పూజల్లో పాల్గొన్న బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
జోగుళాంబ సన్నిధిలో రఘువీరారెడ్డి
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్ శ్రీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఏపీ పీసీసీ ప్రసిడెంట్ రఘువీరారెడ్డి మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరిపించారు. అనంతరం తీర్థ, ప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు. ఇన్చార్జ్ సీనియర్ అసిస్టెంట్ చంద్రయ్య ఆచారి రఘువీరా రెడ్డి దంపతులకు శేష వస్త్రాలు, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో సదానందమూర్తి, వెంకటేశ్వర్లు, పరుషురాముడు, ఖాసీం, నరసింహులు, ప్రేమదాసులు, రాము, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
జోగుళాంబ ఆలయానికి కేంద్ర ప్రసాదం
సాక్షి, జోగుళాంబ శక్తిపీఠం : తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఈ మేరకు పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడంపై అలంపుర్ ప్రాంత వాసి, మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న ఏపీ జితేందర్‌రెడ్డి దృష్టి సారించారు. పార్ల మెంట్ సమావేశాల్లో భాగంగా ఇటీవల ప్రశ్నోత్తరాల సమయంలో అలంపూర్ జోగుళాంబ ఆలయ ప్రస్తావనను ఎంపీ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్, హృదయ్ల్లో అలంపూర్ జోగుళాంబ ఆలయానికి స్థానం కల్పించాలని కేంద్రాన్ని కోరగా కేంద్ర పర్యాటక సహాయ శాఖ మంత్రి అల్ఫోన్ కన్న న్ంథనమ్ లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేస్తే పరిశీలిస్తామని వెల్లడించారు. దీంతో ఎంపీ జితేందర్‌రెడ్డి.. క్షేత్ర ప్రాశస్త్యం వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదించేందుకు సంసిద్ధులయ్యారు. కాగా, 2020లో తెలంగాణ వ్యా ప్తంగా అలంపూర్‌లో మాత్రం తుంగభద్ర పుష్కరాలు జరగనుండగా.. ఆలోగా ప్రసాద్, హృదయ్ పథకాల్లో ఆలయం చేరితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఏమిటీ పథకాలు ? పురాతన వారసత్వ సంపద కలిగి పర్యాటకం గా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం 2014–2015 ఆర్థిక సంవత్సరంలో ప్రసాద్, హృదయ్ పథకాలు ప్రవేశపెట్టింది. ఈ రెండు పథకాల కో సం ఏటా రూ.500కోట్లను బడ్జెట్లో కేటాయిస్తుంది. ఏదేని ఒక యాత్ర స్థలం లేదా యాత్రా స్థ లం కలిగిన పట్టణాన్ని కానీ ఆధునికీకరించి అభివృద్ధి చేసేందుకు ఈ పథకాలు ఉపయోగ పడతాయి. ఇందులో ప్రధానంగా ‘ప్రసాద్’ పథకం ద్వారా మతపరమైన వారసత్వ కేం ద్రాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. నేషన ల్ మిషన్ ఆఫ్ ఫిలిగ్రిమేజ్ రిజివనేషన్ అండ్ స్ప్రిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) కింద ఇప్పటికే 10 రాష్ట్రాల్లో 13 పర్యాటక క్షేత్రాలు ఎంపిక చేశారు. ఇందులో అమరావతి(ఏపీ), గయ, పాట్నా(బీహార్), ద్వారక(గుజరాత్), అమృత్సర్(పంజాబ్) అజ్మీర్(రాజస్థాన్) కాంచీపురం, వేలంగి(తమిళనాడు), పూరీ(ఒడిసా), వారణాసి, మరియు మధుర(యూపీ), కేదారినాథ్(ఉత్తరఖాండ్) కామాఖ్య(అస్సాం) ఉన్నాయి. ఇక హెరిటేజ్ సిటి డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన(హృదయ్) ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తారు. ఈ పథకం వర్తించడానికి వారసత్వ సంపద, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలను ఆదారంగా తీసుకుంటారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.15.60 కోట్లను ఈ పథకం అమలుకు మంజూరు చేశారు. వివిధ రాష్ట్రాల నునండి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర పర్యాటక శాఖ – కేంద్ర పట్టణాభివృద్ది శాఖల మంత్రి అధ్యక్షతన జాతీయ కమిటీ ఎంపిక చేస్తుంది. అలంపూర్.. రెండింటికీ అర్హత కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, హృదయ్ రెండింటి కింద అభివృద్ధి చేసేందుకు అలంపూర్ క్షేత్రానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కాడా లేని విధంగా నవబ్రహ్మ ఆలయాలు కలిగి ఉండటం, అష్టాదశ శక్తి పీఠాల్లో అయిదో శక్తిపీఠం కావడం, 1400 ఏళ్ల చరిత్ర కలిగిన పట్టణం కావడం, శ్రీౖశైల ముంపు నుంచి పీఠాధిపతులు, చారిత్రక పరిశోధకుల సూచన మేరకు కాపాడబడిన క్షేత్రంగా ప్రఖ్యాతి గాంచినా ఎవరు కూడా కేంద్రపథకాలపై దృష్టి సారించలేదు. అలంపూర్ నియోజకవర్గ వాసి అయిన పాలమూరు ఎంపీ జితేందర్‌రెడ్డి లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో అలంపూర్ ఆలయాల ప్రస్తావన తీసుకురావడం విశేషం. తొలి అడుగు జోగుళాంబ శక్తిపీఠం అభివృద్ధి చెందేలా ‘ప్రసాద్’ పథకంలో చేర్చాలని ఓ పక్క ఎంపీ జితేందర్‌రెడ్డి యత్నిస్తుండగా.. కేంద్రప్రభుత్వం సైతం అడుగులు వేస్తోందని సమాచారం. ఈ మేరకు ఆలయాల పూర్తి వివరాలు సేకరించేందుకు పర్యాటక శాఖకు చెందిన ఉద్యోగులు ముగ్గురితో కూడిన బృందం శనివారం పర్యటించింది. ఈ సందర్భంగా ఆలయాలు, విశిష్టత, పరిస ప్రాంతాలను వారు పరిశీలించి ఉద్యోగులను వివరాలు ఆరా తీశారు. గతంలోనే ఎంపీ దృష్టికి... అలంపూర్ క్షేత్రం అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరుతూ ఆలయ ఈఓ గురురాజతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు పలువురు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఎంపికైన సమయంలోనే జితేందర్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి విన్నవించారు. అనంతరం పలు సందర్భాల్లో జితేందర్రెడ్డిదీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ ఆలయాలు కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉండడంతో ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టేందుకైనా ఆ శాఖ నుంచి అభ్యంతరాలు రావొద్దంటే కేంద్రప్రభుత్వ పథకాల్లో చేర్పించడమే మార్గమని భావించిన ఎంపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి నివేదిక తీసుకుంటాం.. అలంపూర్ ఆలయాలకు ‘ప్రసాద్’ పథకం వర్తించేలా కృషి చేస్తాను. ఆలయ చరిత్రతో పాటు సమగ్ర సమాచారం కోసం స్టేట్ డైరెక్టర్ విశాలాచ్చితో మాట్లాడి పూర్తి నివేదిక కోరతాను. అలంపూర్ ఆలయాలపై కేసీఆర్‌కు ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఇంకా పలువురిని నాయకుల విజ్ఞప్తులతో పాటు అమ్మవారిపై నాకు ఉన్న భక్తి మేరకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చాను. తప్పక సాధిస్తాననే నమ్మకం ఉంది. – ఏ.పీ.జితేందర్‌రెడ్డి,ఎంపీ, మహబూబ్‌నగర్ ఎంపీ ఆకాంక్ష సిద్ధించాలి ఎంపీ జితేందర్‌రెడ్డి అలంపూర్ ఆలయాల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ప్రతిపాదన అభినందనీయం. వారి ఆకాంక్ష సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో ఎలాంటి సమాచార సేకరణ, లేక ఇతర విషయాల్లోనైనా మా తరఫున పూర్తిగా సహకరిస్తాం. – బండి శ్రీనివాస్, జోగుళాంబ సేవసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చాలా సంతోషంగా ఉంది అలంపూర్ ఆలయాల అబివృద్ధికి కేంద్రప్రభుత్వ సాయం కోరడం చాల సంతోషంగా ఉంది. ఈ ప్రాంత వాసిగా ఎంపీ జితేందర్‌రెడ్డి గతంలో జోగుళాంబ ఆలయ పునఃనిర్మాణానికి కూడా ఎంతో సహకరించారు. ప్రస్తుతం ఈ ఆలయాలు ఈ రెండు పథకాల కింద ఎంపికైతే అభివృద్ధి పరుగులు తీస్తుంది. – గురురాజ, ఈఓ ఆర్థికంగా ముందంజలో ఉంటుంది ప్రసాద్–హృదయ్ పథకం కింద ఈ ప్రాంతం ఎంపికైతే రాబోయే కాలంలో యువకులు, నిరుద్యో గులకు ఉపాధి మార్గాలు మెరుగవుతాయి. పైగా ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందంజలో నిలుస్తుంది. పైగా రాష్ట్రానికి వన్నె తీసుకొస్తుంది. భారత్ దర్శన్‌లో భాగంగా అలంపూర్ క్షేత్రం ఎన్నికైతే దక్షిణ తెలంగాణకు గొప్ప ప్రవేశద్వారం అవుతుంది. – నందు, విద్యావేత్త, అలంపూర్ -
జోగుళాంబ క్షేత్రంలో హైకోర్టు జడ్జి
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠం అలంపూర్ శ్రీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం హైకోర్టు జడ్జి వెంకటశేష సాయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు వారికి ఆలయ ఈఓ నరహరి గురురాజ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం జోగుళాంబ అమ్మవారికి శ్రీచక్రార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారకి క్షేత్ర ప్రాశస్త్యం తెలియజేశారు. తీర్థ, ప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో వారిని సత్కరించారు. వీరి వెంట కర్నూలు జిల్లా జడ్జి అననుపమచ్రక్రవర్తి, కర్నూలు అడిషనల్ జిల్లా జడ్జి శ్యాంప్రసాద్, కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ రావు, అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి ఏ.రాధిక, ఎస్.ఐ గడ్డంకాశి , ఏ.ఎస్.ఐ సుబ్బారెడ్డి కోర్టు జూనియర్ అసిస్టెంట్ చిన్నరాజు, పుష్పప్రియ, గిరి ఉన్నారు. -
ముచ్చటగా నాలుగో సారి..
అలంపూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి ముచ్చటగా నాలుగో సారి రానున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సారధిగా మొట్టమొదటి సారి కేసీఆర్ అలంపూర్ విచ్చేశారు. 2002లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేపట్టిన పాదయాత్రను అలంపూర్ క్షేత్రం నుంచే మొదలు పెట్టారు. రెండో సారి 2014 ఏప్రిల్ 25వ తేదీన పార్టీ సారధిగా ప్రచారంలో భాగంగా అలంపూర్ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అలాగే 2016 ఆగస్టు 11వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అలంపూర్ నియోజకవర్గ కేంద్రానికి వచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ముఖ్యమంత్రి రాత్రి అలంపూర్‌లోనే బస చేసి 12వ తేదీన గుందిమల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌లో కృష్ణా పుష్కరాలను ప్రారంభించారు. ప్రస్తుతం రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద జరుగుతున్న ఎత్తిపోతల పథకం నిర్మాణం పరిశీలన నిమిత్తం ఆయన నాలుగో సారి రానున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
ఆలయాల్లో పునఃదర్శనం
అలంపూర్ రూరల్ : జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయంలో గురువారం ఉదయం భక్తులను దర్శనానికి అనుమతించారు. బుధవారం సాయంత్రం చంద్రగ్రహణం ఉండడంతో అర్చకులు ఆలయాలను మూసి ఉంచారు. గురువారం ఉదయం 5:30 గంటల నుంచి ఆలయ శుద్ధి చేపట్టారు. ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. మహాసంప్రోక్షణ అనంతరం 10గంటల తర్వాత భక్తులను అనుమతించారు. నాగకన్యల బావి నుంచి జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర సేవాసమితి అధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యంలో శివస్వాములు 108 బిందెలతో ఇటీవల ప్రతిష్టించిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి నమూన విగ్రహాలను అభిషేకించారు. ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్‌శర్మ, వనం శ్రీకాంత్ శర్మ, జానకిరామ శర్మ, శ్రీనివాస శర్మ , ధనుంజయ శర్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీను, శేఖర్ పాల్గొన్నారు. -
శైలపుత్రీ నమోస్తుతే..
అలంపూర్ రూరల్ : దేవీశరనవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఐదోశక్తి పీఠమైన జోగుళాంబ అమ్మవారిని ఆలయంలో శనివారం తొలిరోజు శైలపుత్రిగా అలంకరించారు. ప్రదోశకాలంలో ధ్వజారోహణ నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఆలయ ఈఓ నరహరిగురురాజ ధ్వజ స్తంభానికి సింహవాహనంతో కూడిన జెండాను ఎగురవేశారు. ఉత్సవాల విజయానికి సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని అర్చకులు విక్రాంత్‌శర్మ తెలిపారు. నవదుర్గలలో తొలి రూపమైన శైలపుత్రి అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆది దంపతులైన పార్వతి, పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందన్నారు. శైలపుత్రికి ప్రీతిప్రదంగా సువాసిని, కుమారి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయరాముడు, ఎంపీపీ శంషాద్ ఇస్మాయిల్, సింగిల్‌విండో సభ్యుడు బ్రహ్మేశ్వరరెడ్డి, స్థానిక నాయకులు ఇంతియాజ్, నాగభూషణం, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందరికన్నూ జోగుళాంబ ఆలయం పైనే!
l దేవస్థాన కమిటీ చైర్మన్ పదవి కోసం పోటాపోటీ lపైరవీలలో చోటామోటా నాయకులు అలంపూర్‌రూరల్ : జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంపై రాజకీయ నాయకుల కళ్లు పడ్డాయి. దేవదాయ శాఖ నుంచి ట్రస్టుబోర్డు కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో చోటామోట రాజకీయ నాయకులు అప్పుడే పైరవీలు ప్రారంభించారు. వీరితోపాటు వివిధ కుల, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల వారు కూడా ఈపనిలోనే ఉన్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు దరఖాస్తులు తీసుకెళ్తూ పలుకుబడి గల అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పైరవీలో భక్తిపరులు కొందరు ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా గతంలో నేరచరిత్ర కలిగిన వారు, ఆలయంలో పనిచేసే సిబ్బంది బంధువులు కూడా పైరవీలు చేస్తున్నారు. ఇదీ ప్రకటన జీ.ఓ.ఆర్.టీ నం34రి/రెవెన్యు(ఎండోమెంట్స్) శాఖ 6–08–2016 ప్రకారం 30/2007 దేవాదాయ శాఖ చట్టం ప్రకారం తెలంగాణ ఆర్డినెన్స్ నం.3/2016ను అనసరిస్తూ సెక్షన్15, ఉపసెక్షన్ 1కి లోబడి వంశ పారంపర్యం కానీ ధర్మకర్తల మండలికి నోటిఫికేషన్‌ను వెలువరించింది. నోటీస్ బోర్డు తేదీ నుంచి 20రోజులలోపుగా దరఖాస్తు చేసుకోవాలని గడువు ప్రకటించింది. రాజకీయ నిరుద్యోగులకు వరం రాజకీయాలలో ఉంటూ నేటì వరకు ఎలాంటి పదవి లభించకపోవడంతో ఎంతోమంది రాజకీయ నాయకులు ధర్మకర్తల మండలికి పోటీ పడుతున్నారు. రిటైర్డ్ అయిన మరికొంత మంది కూడా ఇటీవల అలంపూర్‌లో నివాసం ఉంటూ అటుప్రజలు, ఇటు అధికారులు, మరోవైపు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా కొందరు మందా జగన్నథంను, మరికొందరు ఎంపీ జితేందర్‌రెడ్డిని, అలాగే నిరంజన్‌రెడ్డిని, పలువురు జూపల్లి, శాసనసభా స్పీకర్, దేవాదాయ శాఖ మంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మొత్తంగా ఈ పదవి ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి మరి. -
హుండీ ఆదాయం రూ.45 లక్షలు
అలంపూర్ : దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల హుండీ ఆదాయం రూ45 లక్షల 2 వేల 607 వచ్చినట్లు ఆలయ ఈఓ నరహరి గురురాజ తెలిపారు. కష్ణా పుష్కరాల అనంతరం ఆలయాల హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బీ. కష్ణ, ఆలయ ఈఓ నరహరి గురురాజలు అర్చకులతో కలిసి ఆలయాల్లో హుండీ లెక్కింపు సందర్భంగా పూజలు నిర్వహించి హుండీ లెక్కింపును ప్రారంభించారు. సాయంత్రం వరకు కొనసాగిన లెక్కింపులో హుండీ ద్వార రూ.45 లక్షల 2 వేల 607 ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలోని మిగిలిన హుండీలను బుధవారం లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ మంజుల హుండీ లెక్కింపును సమీక్షించారు. సర్పంచ్ జయరాముడు, ఆలయ అధికారులు చంద్రయ్య ఆచారి, శ్రీను, రంగనాథ్, తదితరులు పాల్గొన్నారు. బీచుపల్లి హుండీ లెక్కింపు ఇటిక్యాల : బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం పూర్తయింది. కష్ణా పుష్కరాల సందర్భంగా ఆలయ హుండీ ఆదాయం 21 లక్ష 62 వేల 593 రుపాయలు వచ్చినట్లు ఆలయ ఇఓ రామన్‌గౌడ్ తెలిపారు. రెండు రోజల నుంచి ఆలయ హుండీ లెక్కింపును గద్వాల్‌లోని ఆంధ్రబ్యాంక్ సిబ్బంది , శిష్యువుమందిర్ విద్యార్థులు ,భక్తులు దేవదయాశాఖ ,డివిజన్ ఇన్స్పెక్టర్ శకుంతల , పూజారులు ప్రహ్లాదశర్మ, మారుతిశర్మ,తదితరులు ఉన్నారు. -
జోగుళాంబ ఆలయాన్ని దర్శించిన సీబీఐ మాజీ జేడీ
అలంపూర్‌రూరల్ : అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం సాయంత్రం సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారి, స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుష్కర ఘాట్ దగ్గరకు చేరుకుని నదీ అందాలను వీక్షించారు. వీరితో పాటుగా స్థానిక ఎస్ఐ పర్వతాలు, కానిస్టేబుల్ చంద్రశేఖర్‌గౌడు, శ్రీనివాసులు, రాజు తదితరులు ఉన్నారు. -
ద్రోణాచార్యులెరీ?
జిల్లా క్రీడాశాఖకు కోచ్‌ల కొరత ఏడు స్టేడియాల్లో ఆరుగురు కోచ్‌లే ఐదేళ్లుగా భర్తీకాని శిక్షకుల నియామకాలు ఒలింపిక్ సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధుతో పాటు గోపీచంద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సింధు విజయంలో కోచ్‌గా గోపీచంద్ కషి ఎంతో ఉంది. కోచ్ సహాయంతో ఎందరో క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల్లో గొప్పగొప్ప విజయాలు సాధించారు. క్రీడాకారుల బలం, బలహీనతలను అంచనా వేసి, వారిని మెరికల్లా తయారు చేయడంలో కోచ్‌ల పాత్ర చాలా కీలకం. అంత ప్రాధాన్యమైన కోచ్‌ల కొరత జిల్లాలో తీవ్రంగా ఉంది. ఏడు స్టేడియాల్లో కేవలం ఆరుగురు కోచ్‌లు మాత్రమే ఉన్నారు. మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాలో నైపుణ్యం గల క్రీడాకారులు ఉన్నా వారికి సరైన శిక్షణ లేకపోవడంతో రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నీల్లో అంతగా రాణించలేకపోతున్నారు. జిల్లా క్రీడాశాఖకు ఐదేళ్ల నుంచి కోచ్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కొంతమంది కోచ్‌లు ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రంలో వీరి నియామకాలు లేకపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులు మెరుగైన శిక్షణకు దూరమవుతున్నారు. జిల్లా క్రీడాశాఖ పరిధిలో జిల్లా స్టేడియంతో పాటు ఆత్మకూర్, జడ్చర్ల, నారాయణపేట, అచ్చంపేట, వనపర్తి, గద్వాల పట్టణాల్లో మైదానాలు నడస్తున్నారు. వీటిలో మహబూబ్‌నగర్‌లో అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, అచ్చంపేట, జడ్చర్లలో అథ్లెటిక్స్, వనపర్తిలో హాకీ, గద్వాలలో ఫుట్‌బాల్ క్రీడలకు మాత్రమే కోచ్‌లు ఉండగా, మిగతా వాటిలో కోచ్‌లు లేకపోవడంతో శిక్షణ ఇచ్చేవారే కరువయ్యారు. అలాగే షాద్‌నగర్, గద్వాల, కొల్లాపూర్, కల్వకుర్తి, మక్తల్, కొడంగల్, వనపర్తి, అలంపూర్(ఇటిక్యాల)లో రూ.2.10కోట్లతోగ్రీన్ఫీల్డ్ స్టేడియాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే గద్వాల, కొల్లాపూర్‌లో స్టేడియాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ స్టేడియాలు నిర్మిస్తున్నా కోచ్లుంటేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పలువురు క్రీడాకారులు చెబుతున్నారు. 58మంది కోచ్‌లకు ఆరుగురే.. జిల్లాస్టేడియంతో పాటు ఆరు మినీ స్టేడియాల్లో కలిపి మొత్తం 58 మంది కోచ్‌ల అవసరం ఉంది. కానీ ప్రస్తుతం జిల్లా మొత్తంలో ఆరుగురు కోచ్‌లు మాత్రమే ఉన్నారు. జిల్లా స్టేడియంలో పది మంచి కోచ్‌లకు ముగ్గురే అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన మినీ స్టేడియాల్లో 6 నుంచి 8 మంది కోచ్‌ల అవసరం ఉంది. వాలీబాల్ అకాడమీ వచ్చేనా.. జిల్లాకేంద్రంలో 2004లో వాలీబాల్ అకాడమీని మంజూరు చేశారు. అకాడమీలో ప్రత్యేక కోచ్‌లతో క్రీడాకారులకు శిక్షణ ఇప్పించడంతో ఇద్దరు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. కానీ నిధుల లేమితో 2008లో అకాడమీని తీసివేశారు. దీంతో వాలీబాల్ క్రీడాకారులకు శిక్షణ అందకుండా పోయింది. కొంతమంది క్రీడాకారులు హైదరాబాద్‌లోని అకాడమీల్లో శిక్షణ పొంది రాణిస్తుండగా, కొంతమంది పేద క్రీడాకారులు జిల్లాస్థాయికి వరకే పరిమితమవుతున్నారు. వాలీబాల్ అకాడమీ ఏర్పాట్ల కోసం ఎంతో మంది క్రీడాకారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదివరకే ప్రతిపాదనలు పంపాం – టీవీఎల్ సత్యవాణి, డీఎస్డీఓ జిల్లా క్రీడాశాఖలో కోచ్‌ల కొరత వాస్తవమే. జిల్లాలోని ప్రతి మినీ స్టేడియంలో నలుగురు కోచ్‌ల కోసం రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థకు ఇది వరకే ప్రతిపాదనలు పంపాం. కోచ్‌లు నియమించాలని కోరుతూ క్రీడాశాఖ మంత్రి పద్మారావుతో పాటు ఇతర మంత్రులకు వినతిపత్రాలు అందజేశాం. -
యాగం.. పరిసమాప్తం
అలంపూర్/అలంపూర్ రూరల్: వారం రోజులుగా అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న చంyీ యాగం బుధవారం పూర్ణాహుతి ఘట్టంతో ముగించారు. కలెక్టర్ టీకే శ్రీదేవి చేతులమీదుగా ఈ కార్యక్రమం సాగింది. ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే సంపత్‌కుమార్ హాజరయ్యారు. యాగానికి పెద్దఎత్తున వచ్చిన రుత్వికులు ‘పూర్ణాహుతిఉత్తమాం జుహోతి’ అంటూ మంత్రోచ్ఛరణ చేస్తూ పూర్ణాహుతిని యజ్ఞేశ్వరుడికి సమర్పించారు. ఆహుతులను కూడా ఉత్తమత్వాన్ని చేకూర్చే ఆహుతి పూర్ణాహుతి అంటారని వేదపండితుడు వెంకటకృష్ణ తెలిపారు. నాగార్జున తంత్రంలో చెప్పిన విశేషమైన వనమూలికలతో ఆహుతి అందజేశారు. అదేవిధంగా చండీదేవికి ప్రీతికరమైన ఎర్రటివస్త్రాన్ని ఆహుతిలో వేశారు. పాడిపంటలు అభివృద్ధి చెందాలని, వర్షాలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, జలం సమృద్ధిగా ఉండాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ నమక చమకాలు పఠించారు. పూర్ణాహుతి ఫలం ఇది.. రాజభయ, అగ్నిభయ, చోరభయ.. అనే మూడు రకాల భయాలతో పాటు ప్రకతి ప్రకోపాల నుంచి రక్షించేందుకు సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా ఈ చండీహోమాలు ఫలాన్నిస్తాయి. ఇందులో సత్వగుణం సరస్వతీ దేవి, రజోగుణం లక్ష్మీదేవి, తమోగుణం కాళీకాదేవి అనుగ్రహిస్తుంది. సత్వగుణం తెలుపునకు ప్రతీకగా, రజోగుణం, పసుపుకు ప్రతీకగా, తమో గుణం నలుపునకు ప్రతీకగా నిలుస్తాయని శతాధికయాగ ప్రతిష్టాచార్య వెంకటకష్ణ విశేషప్రాధాన్యాలను వివరించారు. సప్తమాత్రిక (బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, చాముండి, మహాలక్ష్మి) దేవతలను ఆరాధిస్తూ రాష్ట్రంలోని ప్రజలందరికీ నవగ్రహ ఈతిబాధలు తొలగాలని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిని ప్రాణ ప్రతిష్ట చేసి శతచండీ యాగం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, ప్రత్యేకాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీఓ లింగ్యానాయక్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామకష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బి.కృష్ణ, ఈఓ గురురాజ, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మంజుల పాల్గొన్నారు. -
జిల్లాలో 1,84,94,164మంది పుష్కరస్నానం
కృష్ణవేణి ఒడిలో తరించిన భక్తులు ముగిసిన పుష్కర మహోత్సవాలు నదీమతల్లికి సంధ్యాహారతితో వీడ్కోలు పలికిన భక్తులు బీచుపల్లిలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి, అలంపూర్‌లో కలెక్టర్ పూజలు సోమశిలలో హారతి ఇచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి చివరిరోజూ ఘాట్లకు పోటెత్తిన జనం లక్షలాది మంది పుణ్యస్నానం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాలు ముగిశాయి. జిల్లాలో 12రోజులపాటు అత్యంత వైభవంగా సాగాయి. పండితుల వేదమంత్రాల మధ్య మళ్లొస్తాం అంటూ మంగళవారం కృష్ణవేణికి వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణ పుష్కరాలు జిల్లాలో వివిధ పుష్కరఘాట్లలో అత్యంత వైభోవోపేతంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 12వ తేదీన అలంపూర్‌లోని గొందిమళ్లలో ఉదయం 5.58 నిమిషాలకు అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. జోగుళాంబ దేవాలయాన్ని సీఎం కుటుంబసమేతంగా దర్శించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డీజీపీ అనురాగ్‌శర్మ, జైళ్ల శాఖ అడిషనల్ డీజీ వీకే సింగ్, అడిషన్ డీజీ అంజనికుమార్, డీఐజీ అకున్ సబర్వాల్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, తదితరులు అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించారు. పుష్కరాల చివరి రోజైన మంగళవారం జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని గొందిమళ్ల, బీచుపల్లి, అలంపూర్, సోమశిల, రంగాపూర్, నది అగ్రహారం, పస్పుల, పంచదేవ్‌పహాడ్, మరుముల, గుమ్మడం, మూనగాన్దిన్నె, కృష్ణ, పాతాళగంగ వంటి పుష్కరఘాట్లలో లక్షలాదిగా భక్తులు చివరిరోజు పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా అనేక మంది పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. 12వ తేదీనుంచి 23వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ఘాట్లలో 1,84,94,164 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖుల పూజలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రంగాపూర్ ఘాట్‌లో కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. జైళ్ల శాఖ అడిషనల్ డీజీ వీకే సింగ్ బీచుపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. రంగాపూర్ ఘాట్‌లో సినీ నిర్మాత రామ యాదిరెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పుణ్యస్నానాలు చేసి పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఛైర్మన్ బండారు భాస్కర్, కలెక్టర్ టికె.శ్రీదేవి రంగాపూర్, బీచుపల్లి పుష్కరఘాట్లను సందర్శించారు. గొందిమళ్లలో సీఎం పుష్కరాలను ప్రారంభించిన ప్రాంతంలోనే జిల్లా కలెక్టర్ శ్రీదేవి, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పుష్కరాలను ముగింపు ఉత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రజలను క్షేమంగా చూడాలంటూ పండితులు వేద ఆశీర్వాదం చేశారు. బీచుపల్లిలో జరిగిన పుష్కరాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని కృష్ణమ్మకు ప్రత్యేక గంగ హారతి ఇచ్చారు. 12 రోజులపాటు పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ మంత్రులు అభినందనలు తెలిపారు. సోమశిలలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం అభినందించారు జిల్లాలో కృష్ణా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, వలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు, 48 శాఖల ఉద్యోగ, సిబ్బంది సహాయ సహాయ సహకారాలతో పుష్కరాలు జయప్రదం అయ్యాయి.’’ – కలెక్టర్ టీకే శ్రీదేవి -
ఉప్పొంగిన జన కృష్ణమ్మ
పుష్కర మహోత్సవ వేళ పాలమూరు కృష్ణాతీరం జనసంద్రాన్ని తలపించింది. సెలవు రోజుల్లో జనం రద్దీ అనూహ్యంగా పెరిగింది. విశిష్ట స్థల పురాణం ఉన్న ఘాట్లకు భక్తులు పోటెత్తారు. 12రోజుల పాటు జోగుళాంబ(గొందిమల్ల), సోమశిల, బీచుపల్లి, రంగాపూర్ ప్రధాన ఘాట్లు భక్తులతో రద్దీగా మారాయి. వీటితో పాటు నదీ అగ్రహారం, పసుపుల, కృష్ణ, పాతాళగంగ ఘాట్లు కూడా కిటకిటలాడాయి. జోగుళాంబలో 20 లక్షలు జోగుళాంబఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాలు ప్రారంభోత్సవానికి అలంపూర్ సమీపంలోని గొందిమల్ల జోగుళాంబ ఘాట్ వేదికైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకలను ప్రారంభించారు. గవర్నర్, మండలి చైర్మన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రస్థాయి అధికారులు, నాయకులు, సినీ స్టార్లు ఇక్కడే పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరాల 12రోజులపాటు దాదాపు 20 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. భక్తులకు ఇబ్బందులు కలకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, అగ్నిమాపక, విద్యుత్ శాలు విధులు సమర్థవంతంగా నిర్వహించి, సదుపాయాలు కల్పించారు. 12 రోజులపాటు ప్రశాంత వాతావరణంలో పుష్కరాలు నిర్వహించడంలో అధికారులు సఫలమయ్యారు. సోమశిలలో 27.81లక్షలు సోమశిల పుష్కరఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల ఘాట్‌లో మొత్తం 27.81లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 12వ తేదీ 53వేలు, 13న 90వేలు, 14న 1,22,200, 15న 1.52లక్షలు,16న 86,600, 17న 1.60లక్షలు, 18న 1.52లక్షలు, 19న 1,39,300, 20న 4.43లక్షలు, 21న 5.91లక్షలు, 22న 4.81లక్షలు, 23న 3.11లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. తొలి 8 రోజులు భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగింది. ఆ తర్వాత నాలుగురోజులు అనూహ్యంగా పెరిగింది. ట్రాఫిక్‌ను పోలీసులు సమర్థవంతంగా నియంత్రించారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎంలు దామోదర రాజనర్సింహ్మతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పుణ్యస్నానాలు చేశారు. మంచాలకట్టలో 5.5లక్షలు, అమరగిరిలో 6 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రంగాపూర్‌లో 45లక్షలు రంగాపూర్ఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాలను పన్నెండు రోజుల పాటు రంగాపూర్‌ఘాట్‌లో విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఈ ఘాట్‌లోనే భక్తులు పుణ్యస్నానాలు చేశారు. జిల్లాలో దాదాపు 2 కోట్ల మంది పుష్కరస్నానం చేస్తే అందులో 45లక్షల మంది అతి విశాలమైన రంగాపూర్లోనే స్నానమాచరించారు. మొదటి రెండు రోజులు జనం పలుచగా ఉన్నా నెమ్మదిగా పుంజుకుని చివరి నాలుగు రోజులు లక్షల్లో పోటెత్తారు. 10వ రోజే ఏకంగా 9 లక్షల మంది ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. పోలీసులు, అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరోత్సవాలను విజయవంతం చేశారు. రంగాపూర్ఘాట్కు వీఐపీల తాడికి అంచనాలకు మించి ఉన్నట్లు ఘాట్ ప్రత్యేకాధికారులు ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్, డ్వామా పీడీ కట్టా దామోదర్రడ్డి, ఆర్డీఓ రామచందర్ తెలిపారు. బీచుపల్లిలో 39.50 లక్షలు బీచుపల్లి నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాల్లో 12రోజుల పాటు ఇటిక్యాల మండలం బీచుపల్లిలో 38.50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, పునీతులయ్యారు. పుష్కరఘాట్ ఇన్చార్జ్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో ప్రత్యేకాధికారులు జేసీ రాంకిషన్, గంగారెడ్డి అనునిత్యం ఎప్పటికప్పుడు ఘాట్లను పర్యవేక్షిస్తూ పుష్కరాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దిగ్విజయంగా నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గద్వాల డీఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో 1200మంది పోలీసులు నిఘా సారించారు. ప్రధానంగా ఘాట్లన్నీ శుభ్రంగా ఉంచడంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలల్లో అపరిశుభ్రత నెలకొనకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయని నిరూపించారు. ఈ నెల 12న తెల్లవారుజామున నదీహారతితో ప్రారంభమైన పుష్కరాలు మంగళవారం సాయంత్రం 7గంటలకు నదీహారతితో ముగించారు. -
మరో 20 మీటర్లు
జోగుళాంబ ఘాట్ పొడవు పెంపు నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో అధికారుల నిర్ణయం అలంపూర్: కృష్ణా పుష్కరాల్లో పనుల హడావుడి పెరిగింది. మరోవైపు నదిలో నీటి నిల్వల ఆందోళన కలిగిస్తోంది. పుష్కలంగా వర్షాలు కురిసి ఎగువు ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కానీ దిగువకు నీటిని పరిమితస్థాయిలోనే వదులుతుండటంతో కృష్ణా పుష్కరస్నానాలు చేయడానికి నిర్మించిన ఘాట్ల వద్దకు నీళ్లు చేరడం లేదు. మరో పదిరోజుల్లో ప్రారంభం కానున్న పుష్కరాలకు ఎలాంటి పరిస్థితి ఉందో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. అలంపూర్ నియోజకవర్గంలో బీచుపల్లి ఘాట్ మినహా మారమునగాల, క్యాతూర్, గొందిమల్ల గ్రామాల్లో నిర్మిస్తున్న పుష్కరఘాట్ల వద్ద మాత్రం నీళ్లు చేరలేదు. ఘాట్లకు అతి సమీపం వరకు వచ్చి ఆగిపోవడంతో పుష్కరాల వరకు నీళ్లు చేరుతాయా..లేదా అనే సందేహం ఉంది. గొందిమల్లలో నిర్మిస్తున్న వీఐపీలకు, సాధారణ భక్తులకు పుష్కరఘాట్‌ను మరో 20మీటర్లు పెంచడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గొందిమల్లలో సుమారు రూ.3.17కోట్లతో రెండుఘాట్లు నిర్మిస్తున్నారు. గతం లో ఇక్కడ ఉండే నీటి లెవల్స్ ఆధారంగా ఒకలో నదిలో లో–లెవల్ ఘాట్, నదికి భారీగా వరద వచ్చి నీటిలో ఘాట్ మునిగిపోతే ప్రత్యామ్నయంగా మరో హైలెవల్ ఘాట్ నిర్మిస్తున్నారు. లోలెవల్ ఘాట్ 30మీ. వెడల్పు, 90మీ.పొడవుతో, హైలెవల్ ఘాట్ 20మీ. వెడల్పు, 70మీ. పొడవుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మించిన లోలెవల్ ఘాట్‌కు 10మీటర్ల దూరం వరకు నది ప్రవాహం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘాట్‌లోనే పుష్కర స్నానం చేయనున్నారు. నదిలో నీటి మట్టం లేని దృష్ట్యా ఈ ఘాట్ నదిలో మరో 20మీటర్ల మేర నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి లెవల్స్‌లోనే పుష్కర స్నానాలు చేయడానికి వీలుగా ఘాట్‌ను పెంచనున్నట్లు కలెక్టర్ టీకే శ్రీదేవి పేర్కొన్నారు. దీంతో లోలెవల్ ఘాట్ ప్రస్తుతం 30మీటర్ల వెడల్పు, 110 మీటర్ల పొడవుకు చేరుకోనుంది. -
జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు
అలంపూర్ రూరల్ (మహబూబ్‌నగర్) : అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో మంగళవారం అమావాస్యను పురస్కరించుకుని చండీహోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. మరోవైపు స్థానిక రేణుకా దేవి ఆలయంలో మంగళవారం సంతానలక్ష్మి పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు దేవస్థానం వారు బ్రహ్మేశ్వర నిత్యాన్నదాన సత్రంలో భోజన వసతి కల్పించారు. ప్రతి మంగళ, శుక్రవారాలో సంతాన లక్ష్మి పూజలు నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈవో గురురాజ తెలిపారు.