జిల్లా స్టేడియంలో క్రీడాకారులకు బాస్కెట్ బాల్ శిక్షణ(ఫైల్)
-
జిల్లా క్రీడాశాఖకు కోచ్‌ల కొరత
-
ఏడు స్టేడియాల్లో ఆరుగురు కోచ్‌లే
-
ఐదేళ్లుగా భర్తీకాని శిక్షకుల నియామకాలు
ఒలింపిక్ సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధుతో పాటు గోపీచంద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సింధు విజయంలో కోచ్‌గా గోపీచంద్ కషి ఎంతో ఉంది. కోచ్ సహాయంతో ఎందరో క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల్లో గొప్పగొప్ప విజయాలు సాధించారు. క్రీడాకారుల బలం, బలహీనతలను అంచనా వేసి, వారిని మెరికల్లా తయారు చేయడంలో కోచ్‌ల పాత్ర చాలా కీలకం. అంత ప్రాధాన్యమైన కోచ్‌ల కొరత జిల్లాలో తీవ్రంగా ఉంది. ఏడు స్టేడియాల్లో కేవలం ఆరుగురు కోచ్‌లు మాత్రమే ఉన్నారు.
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాలో నైపుణ్యం గల క్రీడాకారులు ఉన్నా వారికి సరైన శిక్షణ లేకపోవడంతో రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నీల్లో అంతగా రాణించలేకపోతున్నారు. జిల్లా క్రీడాశాఖకు ఐదేళ్ల నుంచి కోచ్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కొంతమంది కోచ్‌లు ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రంలో వీరి నియామకాలు లేకపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులు మెరుగైన శిక్షణకు దూరమవుతున్నారు. జిల్లా క్రీడాశాఖ పరిధిలో జిల్లా స్టేడియంతో పాటు ఆత్మకూర్, జడ్చర్ల, నారాయణపేట, అచ్చంపేట, వనపర్తి, గద్వాల పట్టణాల్లో మైదానాలు నడస్తున్నారు. వీటిలో మహబూబ్‌నగర్‌లో అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, అచ్చంపేట, జడ్చర్లలో అథ్లెటిక్స్, వనపర్తిలో హాకీ, గద్వాలలో ఫుట్‌బాల్ క్రీడలకు మాత్రమే కోచ్‌లు ఉండగా, మిగతా వాటిలో కోచ్‌లు లేకపోవడంతో శిక్షణ ఇచ్చేవారే కరువయ్యారు. అలాగే షాద్‌నగర్, గద్వాల, కొల్లాపూర్, కల్వకుర్తి, మక్తల్, కొడంగల్, వనపర్తి, అలంపూర్(ఇటిక్యాల)లో రూ.2.10కోట్లతోగ్రీన్‌ఫీల్డ్ స్టేడియాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే గద్వాల, కొల్లాపూర్‌లో స్టేడియాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ స్టేడియాలు నిర్మిస్తున్నా కోచ్‌లుంటేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పలువురు క్రీడాకారులు చెబుతున్నారు.
58మంది కోచ్‌లకు ఆరుగురే..
జిల్లాస్టేడియంతో పాటు ఆరు మినీ స్టేడియాల్లో కలిపి మొత్తం 58 మంది కోచ్‌ల అవసరం ఉంది. కానీ ప్రస్తుతం జిల్లా మొత్తంలో ఆరుగురు కోచ్‌లు మాత్రమే ఉన్నారు. జిల్లా స్టేడియంలో పది మంచి కోచ్‌లకు ముగ్గురే అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన మినీ స్టేడియాల్లో 6 నుంచి 8 మంది కోచ్‌ల అవసరం ఉంది.
వాలీబాల్ అకాడమీ వచ్చేనా..
జిల్లాకేంద్రంలో 2004లో వాలీబాల్ అకాడమీని మంజూరు చేశారు. అకాడమీలో ప్రత్యేక కోచ్‌లతో క్రీడాకారులకు శిక్షణ ఇప్పించడంతో ఇద్దరు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. కానీ నిధుల లేమితో 2008లో అకాడమీని తీసివేశారు. దీంతో వాలీబాల్ క్రీడాకారులకు శిక్షణ అందకుండా పోయింది. కొంతమంది క్రీడాకారులు హైదరాబాద్‌లోని అకాడమీల్లో శిక్షణ పొంది రాణిస్తుండగా, కొంతమంది పేద క్రీడాకారులు జిల్లాస్థాయికి వరకే పరిమితమవుతున్నారు. వాలీబాల్ అకాడమీ ఏర్పాట్ల కోసం ఎంతో మంది క్రీడాకారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇదివరకే ప్రతిపాదనలు పంపాం
– టీవీఎల్ సత్యవాణి, డీఎస్‌డీఓ
జిల్లా క్రీడాశాఖలో కోచ్‌ల కొరత వాస్తవమే. జిల్లాలోని ప్రతి మినీ స్టేడియంలో నలుగురు కోచ్‌ల కోసం రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థకు ఇది వరకే ప్రతిపాదనలు పంపాం. కోచ్‌లు నియమించాలని కోరుతూ క్రీడాశాఖ మంత్రి పద్మారావుతో పాటు ఇతర మంత్రులకు వినతిపత్రాలు అందజేశాం.