జోగుళాంబ అమ్మవారు జోగుళాంబ ఆలయ సముదాయం
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): తాజాగా రాజకీయ నిరుద్యోగుల చూపంతా జోగుళాంబ అమ్మవారి దేవస్థానం పైపు పడింది. ఇటీవల స్థానిక ఎన్నికలలో ఆశపడి బంగపోయిన వారికంతా నామినేటెడ్ పదవులు ఇస్తామని బుజ్జగించడంతో ఇప్పుడు ఆ రాజకీయ నిరుద్యోగులంతా జోగుళాంబ అమ్మవారి దేవస్థానం కమిటీ వైపు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం సహకార ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల పర్వం ముగిసిన అనంతరం దేవస్థానం కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో పడ్డారు నియోజకవర్గ పెద్దలు. ఇదిలా ఉండగా, ఇక నియోజకవర్గ పెద్దలు దేవస్థానం ట్రస్టు బోర్డు విషయంలో ఎలాంటి పావులు కదిపినా చైర్మన్‌గా పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలనేది సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఈ ఏడాది తుంగభద్ర నదికి పుష్కరాలు రానున్న నేపథ్యంలో ఆధ్యాత్మిక చింతన కలిగిన మంచి పేరున్న వ్యక్తినే ఈ పదవిలో కూర్చోబెట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు దేవదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు
అక్రమాలకు చెక్ పెట్టేందుకు..
2018 నవంబర్ 10వ తేదీన తిరుపతిరెడ్డి చైర్మన్‌గా పదవీ విరమణ కాలం ముగిసింది. దీంతో 16 నెలలుగా దేవస్థానానికి మళ్లీ ట్రస్టుబోర్డు నోటిఫికేషన్ వెలువడలేదు. నేటి దాక మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకం చేపట్టలేదు. దీంతో పరిపాల భారమంతా కూడా కేవలం ఆలయ కార్యనిర్వహణ అధికారులపైనే పడింది. ప్రతినిత్యం ప్రముఖుల సందర్శనలతో కిక్కిరిసే ఈ ఆలయాలకు స్థానికంగా అందుబాటులో లేని కార్యనిర్వహణ అ«ధికారులతో పరిపాలన కూడా అస్తవ్యస్తంగా మారింది. పరిపాలన అధికారి స్థానికంగా లేకపోవడంతో ఆలయంలో సిబ్బంది పనితీరులో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆలయాల్లో సమయపాలన పాటించని సిబ్బంది క్రమక్రమంగా అక్రమాలకు కూడా తెరతీశారు. భక్తుల ద్వారా మొక్కుబడుల రూపంలో దేవస్థానానికి వచ్చే బంగారు ఆభరణాలు ఈవో చేతిలో ఉండాల్సి ఉండగా, వాటి బాధ్యత కూడా అక్కడి సిబ్బందే నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల ఆలయంలో భక్తులకు వేలం పాట ద్వారా విక్రయించే చీరలు, భక్తులు అమ్మవారికి సమర్పించే వడిబియ్యంతో వచ్చే చిన్నపాటి బంగారు ముక్కుపుడకలు, మాంగళ్యాలు తదితర వాటిలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు రాకపోలేదు. అంతేకాక ఆలయంలో గుర్తింపు పొందిన సిబ్బంది స్థానంగా ‘సేవ’ పేరిట నకిలీ ఉద్యోగులు కూడా అక్కడి కార్యక్రమాలు చక్కబెడుతూ రావడంతో దేవదాయ శాఖలోనే చర్చనీయాంశంగా మారింది.
పదవిని దిక్కించుకునేందుకు యత్నాలు..
ఈ ఏడాది నవంబర్‌లో తుంగభద్ర నది పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ రానుండడంతో జోగుళాంబ అమ్మవారి దేవస్థానానికి ట్రస్టుబోర్డు సభ్యులుగా, చైర్మన్‌గా ఎవరిని నియామకం చేయాలనేది తేలనుంది. అయితే దేవస్థానం చైర్మన్ పోటీలో పాత చైర్మన్లు ఇద్దరు గట్టి పోటీలో ఉండగా, నూతనంగా కొత్త వారు కూడా తెరవెనక నుంచి పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment