మరో 20 మీటర్లు
మరో 20 మీటర్లు
Published Wed, Aug 3 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
జోగుళాంబ ఘాట్ పొడవు పెంపు
నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో అధికారుల నిర్ణయం
అలంపూర్: కృష్ణా పుష్కరాల్లో పనుల హడావుడి పెరిగింది. మరోవైపు నదిలో నీటి నిల్వల ఆందోళన కలిగిస్తోంది. పుష్కలంగా వర్షాలు కురిసి ఎగువు ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కానీ దిగువకు నీటిని పరిమితస్థాయిలోనే వదులుతుండటంతో కృష్ణా పుష్కరస్నానాలు చేయడానికి నిర్మించిన ఘాట్ల వద్దకు నీళ్లు చేరడం లేదు. మరో పదిరోజుల్లో ప్రారంభం కానున్న పుష్కరాలకు ఎలాంటి పరిస్థితి ఉందో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. అలంపూర్ నియోజకవర్గంలో బీచుపల్లి ఘాట్ మినహా మారమునగాల, క్యాతూర్, గొందిమల్ల గ్రామాల్లో నిర్మిస్తున్న పుష్కరఘాట్ల వద్ద మాత్రం నీళ్లు చేరలేదు. ఘాట్లకు అతి సమీపం వరకు వచ్చి ఆగిపోవడంతో పుష్కరాల వరకు నీళ్లు చేరుతాయా..లేదా అనే సందేహం ఉంది.
గొందిమల్లలో నిర్మిస్తున్న వీఐపీలకు, సాధారణ భక్తులకు పుష్కరఘాట్‌ను మరో 20మీటర్లు పెంచడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గొందిమల్లలో సుమారు రూ.3.17కోట్లతో రెండుఘాట్లు నిర్మిస్తున్నారు. గతం లో ఇక్కడ ఉండే నీటి లెవల్స్ ఆధారంగా ఒకలో నదిలో లో–లెవల్ ఘాట్, నదికి భారీగా వరద వచ్చి నీటిలో ఘాట్ మునిగిపోతే ప్రత్యామ్నయంగా మరో హైలెవల్ ఘాట్ నిర్మిస్తున్నారు. లోలెవల్ ఘాట్ 30మీ. వెడల్పు, 90మీ.పొడవుతో, హైలెవల్ ఘాట్ 20మీ. వెడల్పు, 70మీ. పొడవుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మించిన లోలెవల్ ఘాట్‌కు 10మీటర్ల దూరం వరకు నది ప్రవాహం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘాట్‌లోనే పుష్కర స్నానం చేయనున్నారు. నదిలో నీటి మట్టం లేని దృష్ట్యా ఈ ఘాట్ నదిలో మరో 20మీటర్ల మేర నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి లెవల్స్‌లోనే పుష్కర స్నానాలు చేయడానికి వీలుగా ఘాట్‌ను పెంచనున్నట్లు కలెక్టర్ టీకే శ్రీదేవి పేర్కొన్నారు. దీంతో లోలెవల్ ఘాట్ ప్రస్తుతం 30మీటర్ల వెడల్పు, 110 మీటర్ల పొడవుకు చేరుకోనుంది.
Advertisement