భక్తజన ప్రభంజనం
- 11వ రోజు 20,90,778మంది పుష్కరస్నానం
- పెరిగిన వీఐపీల తాకిడి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడానికి వరుసగా 11వ రోజు సైతం భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలతో పోలిస్తే కొంత భక్తుల రద్దీ తగ్గినప్పటికీ సోమవారం సైతం అన్ని పుష్కరఘాట్లు కిటకిటలాడాయి. మొత్తం 20,90,778మంది భక్తులు పుష్కరస్నానం ఆచరించారు. తెల్లవారుజాము ఐదు గంటల నుంచే పుష్కరఘాట్లు జనసంద్రంగా మారాయి. పుష్కర స్నానానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో వీఐపీలతో సహా సాధారణ ప్రజలు పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి బారులు తీరారు. జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లలో కొందరు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా హైదరాబాద్, కర్నూలు జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించగా ఎస్పీ రెమా రాజేశ్వరి పర్యవేక్షించారు. జిల్లాలోని గొందిమళ్ల, బీచ్‌పల్లి, రంగాపూర్, సోమశిల, నదీఅగ్రహారం, కృష్ణ, పస్పుల, పంచదేవ్‌పహాడ్, క్యాతూరు, గుమ్మడం, మునగాన్‌దిన్నె, పాతాళగంగ తదితర పుష్కరఘాట్లు భక్తులతో పోటెత్తాయి. సోమవారం పది లక్షలకుపైగా భక్తులు పుష్కరస్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. సోమశిల పుష్కరఘాట్‌లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ టి.కె.శ్రీదేవి సాయంత్రం, బీచుపల్లిలో మరో మంత్రి లక్ష్మారెడ్డి గంగాహారతి ఇచ్చారు. రంగాపూర్ ఘాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మణ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి అలంపూర్‌లోని గొందిమళ్లలో పుణ్యస్నానం ఆచరించి అలంపూర్ ఆలయాన్ని సందర్శించారు. మూలమల్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. సినీనటుడు, రవితేజ తమ్ముడు రాజగోపాల్ పుణ్యస్నానం ఆచరించారు. అలంపూర్‌లో రాష్ట్ర జైళ్ల డీజీపీ గోపినాథ్‌రెడ్డి, ఐపీఎస్ అధికారి విక్రంసింగ్ తదితరులు పుణ్యస్నానాలు ఆచరించి జోగుళాంబను దర్శించుకున్నారు.