SP rema Rajeshwari
-
పాతకక్షలతోనే ఆశప్పపై దాడి
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: గతంలో జరిగిన ఘటనలు.. భూ పంచాయితీలు.. పాత కక్ష్యలను దృష్టిలో పెట్టుకొని ఆశప్పపై హత్యాయత్నం జరిగిందని మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. కొన్ని రోజుల నుంచి ఆశప్ప కదలికలపై నిఘాపెట్టి పక్కా ప్లాన్‌తో దాడి చేశారని తెలిపారు. ఈనెల 9న మరికల్ వద్ద అభంగపూర్ గ్రామానికి చెందిన ఆశప్ప అలియాస్ అశోక్‌పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కేసు వివరాలను సోమవారం ఎస్పీ రెమా రాజేశ్వరి తన కార్యాలయంలో వెల్లడించారు. అభంగపూర్‌కు చెందిన ఆశప్ప ఈనెల 9న రాత్రి ఊరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో మరికల్ దగ్గర చాయ్ తాగడానికి కారు నిలిపిన సమయంలో దాడికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై ఆ శప్ప అన్న కూతురు వర్ష ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరికల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలిపారు. దాడికి పా ల్పడినవారు అభంగపూర్లోనే ఉన్నట్లు సమాచా రం రావడంతో ఆదివారం అదుపులోకి తీసుకున్న ట్లు చెప్పారు. ఏఎస్పీ, నారాయణపేట డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను రంగంలోకి దిగి అనతికాలంలోనే కేసును ఛేదించినట్లు తెలిపారు. పాత పగలతోనే దాడి అభంగపూర్‌కు చెందిన ఆశప్పకు అదే గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ కుటుంబం మధ్యన భూ పంచాయతీ గొడవలు జరుగుతున్నాయి. 1999 లోనే వీరిమధ్య పగలు మొదలయ్యాయి. ఈ సమయంలో ఆశప్ప అదే ఏడాది విజయ్‌కుమార్ ఇంటిపై బాంబులు వేయించాడు. ఈ కేసులో అప్పట్లో ఆశప్పను అరెస్టు చేసి జైలుకు పంపారు. 2001, 2004లో మళ్లీ రెండు కుటుంబాల మధ్యన గొడవలు జరిగాయి. ఈ సమయంలో విజయ్‌కుమార్ అభంగపూర్ నుంచి ఆశప్పను లేకుండా చేయాలని చూశాడు. దీంతో అతనిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ సమయంలో జైలులో విజయ్‌కుమార్‌కు సిద్ధార్థ్, ప్రశాంత్, శ్రావణ్‌గౌడ్, మణికాంత్, జగన్గౌడులతో పరిచయం ఏర్పడింది. దీంతో అప్పటి నుంచి పలుసార్లు పథకం వేసుకుంటూ వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో దొరుకుతాడని.. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆశప్ప తరుపు బంధువులు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో మళ్లీ ఆశప్ప గ్రామంలో ఆధిపత్యం వస్తుందని భావించిన ప్రత్యర్థులు పథకం వేసి హత్య చేయాలని భావించారు. పం చాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుం చి ఆశప్ప కదలికలు చెప్పడానికి విజయ్‌కుమార్ ఇద్దరు వ్యక్తులు నగేష్, ఆంజనేయులను నియమించాడు. హత్యాయత్నం జరిగిన రోజు కూడా ఆశప్ప కదలికలను నగేష్, ఆంజనేయులు ఎప్ప టికప్పుడు విజయ్‌కుమార్‌కు చేరవేశారు. ఆ సమయంలో విజయ్‌కుమార్ బంధువులు లింగప్ప, సుభాష్, ప్రవీణ్, సంజీవ్, రవికుమార్, విజయ్‌కుమార్, హరికుమార్ కలిసి మూడు కత్తులు తీసుకొని వెంబడించారు. అంతకుముందు నగేష్, ఆంజనేయులు కలిసి ఆశప్ప నారాయణపేట నుంచి బయలుదేరిన వెంటనే చెప్పడంతో విజయ్‌కుమార్ తన స్నేహితులు అయిన సిద్దార్థ్, ప్రశాంత్, శ్రావణ్‌గౌడు, మణికాంత్‌లు కలిసి ఏపీ 15బీసీ 4204 నెంబర్ కల్గిన కారులో మరికల్ దగ్గరకు చేరుకున్నారు. ఆశప్ప టీ హోటల్ దగ్గర ఉండటంతో మొదట విజయ్‌కుమార్ తన దగ్గర ఉన్న పిస్టల్‌తో షూట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పిస్టల్ స్ట్రక్ అయి పేలకపోవడంతో వెంట ఉన్న సిదార్థ్, ప్రశాంత్, శ్రావణ్‌గౌడు, మణికాంత్‌లు కత్తులో దాడి చేశారు. ఈ సమయంలో హోటల్ దగ్గర ఎక్కువగా రద్దీగా ఉండటంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. రక్తగాయాలతో ఉన్న ఆశప్పను స్థానికులు, పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితులు వీరే.. ఆశప్ప హత్యాయత్నాం కేసులో ఏ–1గా విజయ్‌కుమార్, ఏ2గా సిదార్థ్, ఏ–3 ప్రశాంత్, ఏ–4 మణికాంత్, ఏ–5శ్రావణ్‌గౌడు, ఏ–6నగేష్, ఏ–7 ఆంజనేయులు, ఏ–8 జగన్‌గౌడు, ఏ–9 సుభాష్, ఏ–10 లింగప్ప, ఏ–11 సంజీవ్, ఏ–12 రవికుమార్, ఏ– 13 ప్రవీణ్, ఏ–14 హరికుమార్, ఏ–15గా విజయ్‌కుమార్‌గా గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. దీంట్లో ఏ–2 సిద్దార్థ్, ఏ–8 జగన్‌గౌడ్, ఏ–14 హరికుమార్, ఏ–15 విజయ్‌కుమార్‌లు పరారీలో ఉన్నారు. నేరచరిత్రపై విచారణ ఆశప్పపై హత్యాయత్నాకి యత్నించిన విజయ్‌కుమార్‌కు సంబంధించిన నేర చరిత్రపై కూడా విచారణ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. అతను గతంలో ఎక్కడ పని చేశాడు, ఏ వ్యక్తులతో కలిసి ఉన్నాడో ప్రతి అంశంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇదిలాఉండగా కేసును త్వరగా ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, నారాయణపేట డీఎస్పీ శ్రీధర్, మరికల్ సీఐ ఇఫ్తాకర్ అహ్మద్, ఎస్ఐ జానకిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందరి కృషి వల్లే ‘పుష్కర’ విజయం
– ఎస్పీ రెమా రాజేశ్వరి మహబూబ్‌నగర్ క్రైం: తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరిగిన కృష్ణా పుష్కరాలను అందరి సహకారంతో విజయవంతం చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. కృష్ణా పుష్కర విధులలో పాల్గొన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందికి సోమవారం ఎస్పీ కార్యాలయంలో రెమా రాజేశ్వరి ప్రశంసపత్రాలతో పాటు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 52పుష్కరఘాట్లలో దాదాపు 1.80కోట్ల మంది పుణ్యస్నానం చేశారని, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ను దారి మళ్లించడంతో పాటు ఎక్కడా రద్దీగా ఉండకుండా క్లియర్ చేయడంలో పూర్తిగా విజయం సాధించినట్లు తెలిపారు. జిల్లాకు పుష్కరస్నానంలో భాగంగా దాదాపు 5.50లక్షల వాహనాలు వచ్చాయని, వాటన్నింటినీ ఆయా ఘాట్లకు పంపించడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారం అయినా, అందులో పూర్తిస్థాయిలో విజయం సాధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సిబ్బందితో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని జిల్లాలో చిన్న సంఘటన జరగకుండా చూడటం పోలీస్‌శాఖ ఉన్నతికి నిదర్శనమన్నారు. అనంతరం పోలీస్ సిబ్బందితో ఎస్పీ గ్రూప్ ఫొటో దిగారు. కార్యక్రమంలో ఓఎస్డీ కల్మేశ్వర్ సింగనవార్, అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
భక్తజన ప్రభంజనం
11వ రోజు 20,90,778మంది పుష్కరస్నానం పెరిగిన వీఐపీల తాకిడి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడానికి వరుసగా 11వ రోజు సైతం భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలతో పోలిస్తే కొంత భక్తుల రద్దీ తగ్గినప్పటికీ సోమవారం సైతం అన్ని పుష్కరఘాట్లు కిటకిటలాడాయి. మొత్తం 20,90,778మంది భక్తులు పుష్కరస్నానం ఆచరించారు. తెల్లవారుజాము ఐదు గంటల నుంచే పుష్కరఘాట్లు జనసంద్రంగా మారాయి. పుష్కర స్నానానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో వీఐపీలతో సహా సాధారణ ప్రజలు పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి బారులు తీరారు. జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లలో కొందరు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా హైదరాబాద్, కర్నూలు జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించగా ఎస్పీ రెమా రాజేశ్వరి పర్యవేక్షించారు. జిల్లాలోని గొందిమళ్ల, బీచ్పల్లి, రంగాపూర్, సోమశిల, నదీఅగ్రహారం, కృష్ణ, పస్పుల, పంచదేవ్‌పహాడ్, క్యాతూరు, గుమ్మడం, మునగాన్దిన్నె, పాతాళగంగ తదితర పుష్కరఘాట్లు భక్తులతో పోటెత్తాయి. సోమవారం పది లక్షలకుపైగా భక్తులు పుష్కరస్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. సోమశిల పుష్కరఘాట్‌లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ టి.కె.శ్రీదేవి సాయంత్రం, బీచుపల్లిలో మరో మంత్రి లక్ష్మారెడ్డి గంగాహారతి ఇచ్చారు. రంగాపూర్ ఘాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మణ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి అలంపూర్‌లోని గొందిమళ్లలో పుణ్యస్నానం ఆచరించి అలంపూర్ ఆలయాన్ని సందర్శించారు. మూలమల్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. సినీనటుడు, రవితేజ తమ్ముడు రాజగోపాల్ పుణ్యస్నానం ఆచరించారు. అలంపూర్‌లో రాష్ట్ర జైళ్ల డీజీపీ గోపినాథ్‌రెడ్డి, ఐపీఎస్ అధికారి విక్రంసింగ్ తదితరులు పుణ్యస్నానాలు ఆచరించి జోగుళాంబను దర్శించుకున్నారు. మరింత తగ్గిన నీటిమట్టం కాగా, సోమవారం అన్ని పుష్కరఘాట్లలో నీటిమట్టం మరింత తగ్గింది. ఎగువ ప్రాంతం నుంచి జూరాలకు వరదనీరు పూర్తిగా తగ్గడంతో జూరాల నుంచి ఎగువ ప్రాంతానికి నీటి విడుదల నిలిపివేశారు. దీంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే పుష్కర స్నానాలకు ఒకేరోజు మిగిలి ఉండటంతో నీటి మట్టం తగ్గినా స్నానాలకు ఇబ్బందిలేదని అధికారులు చెబుతున్నారు. పుష్కరాల ముగింపు పర్వాన్ని బీచుపల్లి పుష్కరఘాట్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు జిల్లా మంత్రులు, ఇతర అధికారులు మంగళవారం సాయంత్రం జరిగే ముగింపు సభలో పాల్గొననున్నారు. -
భక్తులకు అసౌకర్యం కలగొద్దు
పూర్తిస్థాయి రక్షణ ఏర్పాట్లు చేయాలి అధికారులను ఆదేశించిన ఎస్పీ రెమా రాజేశ్వరి పలు పుష్కరఘాట్ల పరిశీలన ధరూరు: కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె పెద్దచింతరేవుల, రేవులపల్లి, ఉప్పేరు, నెట్టెంపాడు ఘాట్లను పరిశీలించారు. పుష్కరస్నానానికి వచ్చే భక్తులకు రక్షణగా బారీకేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. గోదావరికి ధీటుగా కృష్ణా పుష్కరాలను నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వరద నీటి కారణంగా ఆలస్యమవుతున్న పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం వరదనీటి ఉధృతి తక్కువగా ఉన్నదని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. సమయం సమీపిస్తోందని, అధికారులు దగ్గరుండి పనులు చేయించాలన్నారు. ఘాట్ల వద్ద తాగునీరు, స్నానపు గదులు, విద్యుత్, పార్కింగ్ వంటి సదుపాయాలపై ఆరీఓ అబ్దుల్ హమీద్, డీఎస్పీ బాలకోటీలతో చర్చించారు. కార్యక్రమంలో సీఐ సురేష్, ఎస్ఐ అమ్జదలి, తహసీల్దార్ సమద్ పాల్గొన్నారు. బీచుపల్లి వద్ద పార్కింగ్ స్థలాల పరిశీలన ఇటిక్యాల: బీచుపల్లి ఘాట్‌వద్ద వాహనాల పార్కింగ్ స్థలాలను ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రక్షణచర్యలు చేపట్టేందుకు పోలీసుశాఖ సిద్ధమమవుతోందన్నారు. బీచుపల్లి సమీపంలోని కొండపేట, యాక్తాపురం, ఎర్రవల్లిచౌరస్తా గ్రామాల శివార్లలోని వాహనాల పార్కింగ్ స్థలాలను గద్వాల డీఎస్పీ బాలకోటి, అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి ఎస్పీ పరిశీలించారు. వాహనాలు నిలిపే పార్కింగ్ స్థలాలను చదును చేయడం, విద్యుత్ వెలుగులను ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసుశాఖ తరఫున భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, చోరీలు జరగకుండా సీసీ కెమెరాల ఏర్పాటు తదితర వాటిపై సమాయత్తం చేయాలన్నారు. బీచుపల్లి వద్ద పుష్కర విధులకు వచ్చే పోలీసు సిబ్బందికి వసతి ఏర్పాటుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. -
నేటినుంచి 30 వరకు పోలీస్ యాక్టు
♦ ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు అనుమతి తప్పనిసరి ♦ ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడి వికారాబాద్: గురువారం నుంచి 30 వరకు జిల్లాలో పోలీస్ యాక్టు 30 అమలులో ఉంటుందని ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పోలీస్ యాక్టు 30 అమలు ప్రకారం బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, దర్నాలు,రోడ్ షోలు తదితర కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి అన్నారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ నుంచి 72 గంటల ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రజా సంబంధాలు మెరుగుపడేలా అందరూ నడుచుకోవాలని పేర్కొన్నారు. ఏ మతానికైనా సంతోషమే ప్రతీక అని, ప్రతిఒక్కరూ కుల, మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండి పండగలను జరుపుకోవాలని సూచించారు. ఏ వర్గం వారైనా ఇతరులకు ఇబ్బంది కలగకుండా పండగలు చేసుకోవాలని తెలిపారు. ఎవరూ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించరాదని చెప్పారు. ఈనెల 15, 19వ తేదీల్లో జరిగే శ్రీ రామ నవమి, హనుమాన్ జయంతి వేడుకలతో పాటు 22న జరిగే హనుమాన్ శోభయాత్ర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రెమా రాజేశ్వరి జిల్లా ప్రజలను కోరారు. వేడుకల్లో అపశ్రుతులు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ.. పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. పండగలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చే యాలని సూచించారు. ఆయా ఉత్సవ సమితి నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. ఊరేగింపులో భారీస్థాయి సౌండ్ బాక్సులను వినియోగించరాదని తెలిపారు. అదేవిధంగా నిర్వాహకులు వివిధ కమిటీలు ఏర్పాటు చేసి బాధ్యతలు తీసుకోవాలని ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సంఘ విద్రోహ శక్తులు ర్యాలీలో పాల్గొనకుండా చూడాలని పోలీసులను అదేశించారు. భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైతే బైండోవర్లు కూడా చేయాలని ఎస్పీ రెమా రాజేశ్వరి సిబ్బందికి సూచించారు. ప్రజలంతా శాంతియుత వాతావరణంలో పండగలు నిర్వహించుకోవాలని తెలిపారు. వివిధ పండగల నేపథ్యంలో ఎస్పీ జిల్లావాసులకు శుభాకాంక్షలు తెలిపారు.