సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్ నగరంలో శంకరమఠం పేరుతో నిర్వహిస్తున్న ఆధ్మాత్మిక కేంద్రం. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ మఠం కింద 55 దుకాణాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఒక్కో దుకాణానికి రూ.10 వేల వరకు నెలవారీ అద్దె ఉంది. వెరసి మఠానికి ఏటా రూ.60 లక్షలకుపైగా అద్దె వసూలుకావాలి. కానీ దేవాదాయశాఖ ఖజానాకు చిల్లిగవ్వ కూడా జమకావడం లేదు. ఆ సొమ్మంతా ప్రైవేటు వ్యక్తులు, కొందరు అధికారులు కలసి స్వాహా చేసేస్తున్నారు. ఓ మంత్రి పేరు చెప్పి కొందరు స్థానిక నేతలు, అధికారులు ఈ అద్దె సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయశాఖ ఇప్పటివరకు నామమాత్రంగా 20 వరకు నోటీసులు జారీ చేసింది. కానీ నయాపైసా కూడా జమ చేయించలేకపోయింది. నగరంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న చాలా దేవాలయాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. ఈ అద్దెల సొమ్ము ఎటుపోతోందో శాఖ కమిషనర్‌కు కూడా తెలియని పరిస్థితి నెలకొనడం గమనార్హం.
లెక్కలే లేవు..
అసలు దేవాదాయశాఖకు ఎన్ని దుకాణాలున్నాయి, వాటిలో ఎన్నింటిని లీజుకిచ్చారు, ఎన్నింటిని నేరుగా అద్దెకిచ్చారు, వాటి రూపంలో దేవాదాయశాఖ ఖజానాకు రావాల్సిన మొత్తం ఎంత.. అనే లెక్కలేవీ దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో నమోదై లేవు. వెరసి ఏటా దేవుడి ఖజానాకు రావాల్సిన రూ.కోట్ల మొత్తం అధికారులు, కొందరు నేతల జేబుల్లోకి చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ తంతును గుర్తించి నోరెళ్లబెట్టారు. వెంటనే దుకాణాల అద్దె, లీజులకు సంబంధించి పూర్తి లెక్కలు సమర్పించాలని ఆదేశించారు. కానీ నెలన్నర గడిచినా ఇప్పటివరకు అధికారులు లెక్కలు సిద్ధం చేయలేదు.
కోట్ల కొద్దీ స్వాహా
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అధీనంలో పెద్ద ఎత్తున భూములు, భవనాలు ఉన్నాయి. గ్రామాల్లో ఎకరాల కొద్దీ భూములు ఉండగా... పట్టణాలు, నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆలయాల పరిధిలో ఖాళీ భూములతోపాటు దుకాణాలు ఉన్నాయి. పలుచోట్ల ఈ భూములు, దుకాణాలను లీజులకు ఇవ్వగా.. మరికొన్ని చోట్ల నెలవారీగా అద్దెకిచ్చి ప్రతినెలా అద్దె సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇలా వందల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి. వాటి అద్దె రూపంలో ఏటా రూ.కోట్లు వసూలవుతాయి. ఆ సొమ్మును కాజేసేందుకు అలవాటు పడ్డ అధికారులు.. అసలు వాటికి లెక్కలే లేకుండా చేశారు. కొన్నేళ్లుగా దేవాదాయ శాఖకు పూర్తిస్థాయి కమిషనర్ లేక ఇన్‌చార్జి అధికారి పర్యవేక్షణలో కొనసాగుతోంది. దాంతో లెక్కలు అడిగే వారు లేకపోవటం, ప్రభుత్వం దేవాదాయ శాఖను నిర్లక్ష్యం చేయటంతో.. అధికారులు అద్దెల సొమ్మును స్వాహా చేయడం ప్రారంభించారు. దేవాలయాలు, దేవాదాయశాఖ అధీనంలో ఉన్న మఠాలకు నగరంలో వందల సంఖ్యలో దుకాణాలున్నా.. వాటి అద్దెలు, లీజుల రూపంలో ఎంతమొత్తం వసూలవుతోందో తెలియని గందరగోళం ఉంది.
కొన్ని దేవాలయాల్లో అవకతవకల తీరిదీ..
- సికింద్రాబాద్‌లో బోనాల సందర్భంగా భారీ జాతర సాగే అమ్మవారి దేవాలయం దుకా ణాల్లో భారీ గోల్‌మాల్ జరుగుతోంది. వాణి జ్యపరంగా మంచి కేంద్రం కావడంతో దుకా ణాల అద్దె భారీగా ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా ఆ అద్దెల వివరాలను రికార్డుల్లో నమోదు చేయటం లేదు. వాటి కాగితాలూ మాయమయ్యాయి.
- జూబ్లీహిల్స్‌లోని మరో అమ్మవారి దేవాలయా నికి చెందిన దుకాణాల వివరాలెక్కడా పొందుపరచలేదు. అక్కడ ఎంతమొత్తం వసూలవుతుందో తెలియని పరిస్థితి.
- అమీర్‌పేటలో మంచి సెంటర్‌లో ఉన్న అమ్మవారి ఆలయానికి సంబంధించి రికార్డుల్లో ‘ప్రైవేట్ నెగోషియేషన్’అని మాత్రమే రాశారు. ఎవరి అధీనంలో దుకాణాలున్నాయో వివరాల్లేవు.
- రెజిమెంటల్ బజార్‌లోని ఓ శివాలయం దుకాణాల అద్దెలకు సంబంధించి కొన్నేళ్లుగా లెక్కలు రాయడం లేదు.
- సికింద్రాబాద్‌లో ఉన్న ఓ ధర్మశాల, షేక్‌పేట ద్వారకానగర్‌లోని మరో దేవాలయం, అమీర్‌పేట, భోలక్‌పూర్, పాన్‌బజార్, ముషీరాబాద్, ఎల్లారెడ్డిగూడల్లోని ఐదు దేవాలయాల పరిధిలోని దుకాణాలను అనధికారికంగా అద్దెకిచ్చి ఆ మొత్తాన్ని ఖజానాకు జమకట్టడం లేదు.
- లాలాగూడలోని ఓ దేవాలయం దుకాణాలను 25 ఏళ్లపాటు లీజుకిచ్చినట్టు రికార్డుల్లో రాసి ఉంది. కానీ లీజు ఎప్పటితో పూర్తవుతుందనే వివరాలను మాత్రం గల్లంతు చేశారు. లీజు మొత్తం ఎంతో కూడా లేకపోవడం గమనార్హం.
- కవాడిగూడలోని ఓ ఆలయం దుకాణాల లీజు 2012లో పూర్తయినట్టు రికార్డుల్లో చూపారు. తర్వాత ఆ దుకాణాలు ఎవరి అధీనంలో ఉన్నాయి. వాటి అద్దె ఎంత, లీజుకిచ్చారా లేదా అన్న వివరాలు పొందుపరచలేదు. ఆ మేరకు సొమ్మును పక్కదారి పట్టించేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment