గోపురాలు ఎక్కడమే పరిష్కారమా?
అర్చకుల సమ్మెపై ఇంద్రకరణ్
మేడ్చల్: గుళ్లు, గోపురాలు ఎక్కితే సమస్యలు పరిష్కారమవుతాయా.. అని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పరిధిలోని అత్వెల్లిలో జరుగుతున్న రాఘవేంద్రస్వామి ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలంటూ రాష్ట్రంలో ఆలయాల సిబ్బంది, అర్చకులు చేస్తున్న సమ్మె అనవసరమైనదని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అర్చకుల కోసం పీఆర్‌సీ అమలు చేయడంతోపాటు, రూ.100 కోట్లతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అర్చకుల డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ వేసిందని, నివేదిక రాకముందే సమ్మె చేయ డం అర్థరహితమ న్నారు.
గోపురం ఎక్కిన అర్చకులు
వర్గల్: మెదక్ జిల్లా నాచగిరిలో అర్చకులు సోమవారం ఆలయ గోపురం ఎక్కి నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి గంటపాటు ఆందోళన కొనసాగించారు. నినాదాలతో హోరెత్తించారు. గజ్వేల్-తూప్రాన్ మార్గం లో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడా అధికారి హన్మంతరావు ఫోన్ చేసి అర్చకులతో మాట్లాడి నచ్చచెప్పారు. దీంతో ఆందోళన విరమించారు.