priests strike
-
గోపురాలు ఎక్కడమే పరిష్కారమా?
అర్చకుల సమ్మెపై ఇంద్రకరణ్ మేడ్చల్: గుళ్లు, గోపురాలు ఎక్కితే సమస్యలు పరిష్కారమవుతాయా.. అని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పరిధిలోని అత్వెల్లిలో జరుగుతున్న రాఘవేంద్రస్వామి ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలంటూ రాష్ట్రంలో ఆలయాల సిబ్బంది, అర్చకులు చేస్తున్న సమ్మె అనవసరమైనదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అర్చకుల కోసం పీఆర్సీ అమలు చేయడంతోపాటు, రూ.100 కోట్లతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అర్చకుల డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ వేసిందని, నివేదిక రాకముందే సమ్మె చేయ డం అర్థరహితమ న్నారు. గోపురం ఎక్కిన అర్చకులు వర్గల్: మెదక్ జిల్లా నాచగిరిలో అర్చకులు సోమవారం ఆలయ గోపురం ఎక్కి నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి గంటపాటు ఆందోళన కొనసాగించారు. నినాదాలతో హోరెత్తించారు. గజ్వేల్-తూప్రాన్ మార్గం లో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడా అధికారి హన్మంతరావు ఫోన్ చేసి అర్చకులతో మాట్లాడి నచ్చచెప్పారు. దీంతో ఆందోళన విరమించారు. -
అర్చకుల సమస్యలు అసెంబ్లీలో చర్చిస్తా- ఎర్రబెల్లి
పాలకుర్తి టౌన్ (వరంగల్ జిల్లా) : రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న అర్చక ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీటీడీపీ శాసనసభాపక్ష నాయకులు ఎమ్మెల్యే ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహదేవాలయం ఆవరణలో అర్చకుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. 010 పద్దు కింద అర్చక ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలనే న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. డిమాండ్లు సాధించుకునే వరకు ఆందోళన విరమించొద్దని ఆయన అర్చకులను కోరారు. ఈ కార్యక్రమంలో అర్చక ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ డివీఆర్ శర్మ తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు గంగు కృష్ణమూర్తి,మండల పార్టీ అద్యక్షులు నల్ల నాగిరెడ్డి, సర్పంచ్ అంగడి అంజమ్మ, ఎంపీటిసి ఫోరం జిల్లా కార్యదర్శి కత్తి సైదులు, సర్పంచులు మాచర్ల పుల్లయ్య, వేల్పుల లక్ష్మి దేవరాజ్, నాయకులు కడుదల కర్నాకర్ రెడ్డి, కారుపోతుల కుమార్, పాలెపు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి అర్చకుల సమ్మె
హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ శాఖ దేవాలయాల అర్చక, ఉద్యోగుల సంఘం (తెలంగాణ మతైక అర్చక, ఆలయ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి) గురువారం (ఈ నెల 4) నుంచి తలపెట్టిన సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఐకాస కన్వీనర్ గంగు భానుమూర్తి స్పష్టం చేశారు. తమకు ప్రభుత్వం నుంచి చర్చలకు ఎలాంటి పిలుపు రాలేదన్నారు. డిమాండ్లపై పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందించని అధికారులు.. ప్రస్తుతం ఒక వర్గాన్ని చేరదీసి సమ్మెను నీరుగార్చేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి కొందరితో జరిపిన చర్చలు కుట్రపూరితమని, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.