‘డబుల్’కు 14,664 కోట్లు కావాలి!
సీఎంను కోరనున్న గృహనిర్మాణ శాఖ
అధికారులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.14,664 కోట్ల నిధులు అవసరమవుతాయని గృహ నిర్మాణ శాఖ అంచనా వేసింది. వచ్చే బడ్జెట్‌లో ఈమేరకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరాలని నిర్ణయించింది. దీనిపై గృహనిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం అధికారులతో చర్చించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువగా బడ్జెట్ కేటాయించడం, పెద్దగా పనులు మొదలుకాకపోవడం వెరసి పథకంపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో మెరుగ్గా నిధులు కేటాయించి పనులను ముమ్మరంగా నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష రెండు పడక గదుల ఇళ్లను నిర్మించనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,750 కోట్లను కోరాలని నిర్ణయిం చారు. నగరం మినహా రాష్ట్రం లోని ఇతర పట్టణ, గ్రామాల్లో ఇళ్ల కోసం రూ.6,194 కోట్లను కోరాలని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో 60 వేల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 40 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఉంది. సబ్సిడీ ద్వారా గ్రామాల్లో ఇందిరా ఆవాస్ యోజన కింద 55 వేల ఇళ్ల నిర్మాణానికి రూ.527 కోట్లు, పట్టణాల్లో పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణానికి రూ. 193 కోట్లు అవసరమని తేల్చారు. అలాగే, సమావేశంలో దేవాదాయ శాఖ వ్యవహారాలపైనా చర్చించారు. ఉద్యోగుల జీతభత్యాలకు రూ.22 కోట్లు కావాల్సి ఉంటుందని లెక్కలేశారు. వీటిపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపాలని మంత్రి ఆదేశించారు.