Housing construction Department
-
విశాఖలో ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా జరగాలి: సీఎం జగన్
-
క్రిస్మస్ తర్వాత టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయ వర్గాల వారి కోసం ఉద్దేశించిన ఈ గృహాలను ఈ నెలాఖరు నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. క్రిస్మస్ సెలవులు పూర్తయిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని, సాధ్యమైనంత వేగంగా వాటిని లబ్ధిదారులకు అందించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. నెల్లూరు నుంచి శ్రీకారం రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న తక్కువ ఆదాయ వర్గాల వారికి ఈసారి 1.18 లక్షల ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కోవిడ్, లాక్డౌన్ కారణంగా నిర్మాణ పనులు కాస్త ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత పనులు చేపట్టి 75,784 యూనిట్లను పూర్తి చేశారు. వీటిని వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందిస్తారు. క్రిస్మస్ సెలవుల తర్వాత నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆ ఇళ్లకు డిసెంబర్ నెలాఖరు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని టిడ్కో ఎండీ తెలిపారు. కాగా, నిర్మాణం పూర్తయిన ఇళ్లను వెనువెంటనే లబ్ధిదారులకు అందించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పూర్తయిన నిర్మాణాలకు బ్యాంకు లింకేజీ పూర్తిచేసి వెనువెంటనే రిజిస్ట్రేషన్లు కూడా చేయాలని ఆదేశించారు. -
Andhra Pradesh: ఇన్ని లక్షల ఇళ్ల నిర్మాణం ప్రపంచంలోనే అరుదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల కోసం ఏకంగా 17,005 కాలనీల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం ప్రపంచంలోనే అరుదైన అంశమని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రశంసించారు. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్‌ను ప్రత్యేకంగా నియమించడం అంటే ప్రభుత్వం పేదలకు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో స్పష్టం అవుతోందని అన్నారు. ఇటీవల ఆయన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపట్టారని తెలుసుకుని, స్వయంగా రాష్ట్రానికి వచ్చి పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల కాలనీలను చూస్తానని తెలిపారు. సంతృప్త స్థాయిలో ఇళ్ల నిర్మాణం దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో పేదలందరికీ సంతృప్త స్థాయిలో అంటే 30.76 లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులను యజ్ఞంలా కొనసాగిస్తోంది. తొలి దశలో వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నిర్మించే పేదల ఇళ్లకు ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు అంటే ఈ నెల 10వ తేదీ వరకు పండుగ వాతావరణంలో ఏకంగా 1.72 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. సెప్టెంబర్ నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా గృహ నిర్మాణ శాఖ చర్యలను చేపట్టింది. పేదల ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ గట్టి పట్టుదలతో ఉండటమే కాకుండా అందుకోసం ప్రత్యేకంగా జిల్లాకో జాయింట్ కలెక్టర్‌ను నియమించిన విషయం తెలిసిందే. 13 జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. దీంతో అన్ని ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. తొలి దశలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను రూ.28,084 కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది. మెటీరియల్ సరఫరాలో జాప్యం ఉండదు ఇళ్ల నిర్మాణాలకు మెటీరియల్ సరఫరాలో జాప్యం ఉండదు. ఇసుక, స్టీలు, సిమెంట్‌ను ఇప్పటికే గ్రామ, మండల స్థాయిల్లోని గోదాముల్లో నిల్వ చేశాం. ప్రత్యేకంగా జిల్లాకో జాయింట్ కలెక్టర్ బాధ్యత తీసుకున్నందున పేదల ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగంగా కొనసాగుతాయి. ఒక్క వారంలోనే 1.72 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. వీలైనంత త్వరగా అన్ని ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించి ముఖ్యమంత్రి నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేస్తాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
‘డబుల్’ ఇళ్లకు అప్పులే దిక్కు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ‘అప్పుల’తో నెట్టుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగానే బడ్జెట్లో నామమాత్రంగా రూ.860 కోట్లే కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లు, రాజధాని హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వాటిని హ డ్కోతోపాటు ఇతర సంస్థల నుంచి రుణం తెచ్చి పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అంత రుణం సాధ్యమా? ప్రభుత్వం చెబుతున్న రెండు లక్షల ఇళ్లతోపాటు గత సంవత్సరం మంజూరు చేసి పనులు ప్రారంభించని మరో 60 వేల ఇళ్లను పూర్తి చేయాలంటే దాదాపు రూ.16 వేల కోట్లు కావాలి. కానీ బడ్జెట్లో కేటాయిం చింది రూ.860 కోట్లే. మిగతా సుమారు రూ.15వేల కోట్లను ఒకే సంవత్సరం వ్యయం చేయడం సాధ్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది మంజూరు చేసిన 60 వేల ఇళ్ల కోసం హడ్కో నుంచి రూ.3,500 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు గృహనిర్మాణ శాఖకు సర్కారు అనుమతి ఇచ్చింది. అది పోను మి గతా అప్పు ఈ సంవత్సరమే అంటే ఎలా సాధ్యమో ప్రభుత్వం స్పష్టం చేయలేదు. మొత్తంగా కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ కొన్ని ‘డబుల్’ ఇళ్లను నిర్మించి చూ పే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల బకాయిల చెల్లింపుపైనా అస్పష్టతే కొనసాగుతోంది. ఆ పథకం పేరుతో బడ్జెట్లో నిధులు ప్రతిపాదించక పోవడమే దీనికి కారణం. -
‘డబుల్’కు 14,664 కోట్లు కావాలి!
సీఎంను కోరనున్న గృహనిర్మాణ శాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.14,664 కోట్ల నిధులు అవసరమవుతాయని గృహ నిర్మాణ శాఖ అంచనా వేసింది. వచ్చే బడ్జెట్లో ఈమేరకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరాలని నిర్ణయించింది. దీనిపై గృహనిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం అధికారులతో చర్చించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువగా బడ్జెట్ కేటాయించడం, పెద్దగా పనులు మొదలుకాకపోవడం వెరసి పథకంపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో మెరుగ్గా నిధులు కేటాయించి పనులను ముమ్మరంగా నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష రెండు పడక గదుల ఇళ్లను నిర్మించనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,750 కోట్లను కోరాలని నిర్ణయిం చారు. నగరం మినహా రాష్ట్రం లోని ఇతర పట్టణ, గ్రామాల్లో ఇళ్ల కోసం రూ.6,194 కోట్లను కోరాలని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో 60 వేల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 40 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఉంది. సబ్సిడీ ద్వారా గ్రామాల్లో ఇందిరా ఆవాస్ యోజన కింద 55 వేల ఇళ్ల నిర్మాణానికి రూ.527 కోట్లు, పట్టణాల్లో పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణానికి రూ. 193 కోట్లు అవసరమని తేల్చారు. అలాగే, సమావేశంలో దేవాదాయ శాఖ వ్యవహారాలపైనా చర్చించారు. ఉద్యోగుల జీతభత్యాలకు రూ.22 కోట్లు కావాల్సి ఉంటుందని లెక్కలేశారు. వీటిపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపాలని మంత్రి ఆదేశించారు. -
పేదలందరికీ ఇళ్లు: కేటీఆర్
గంభీరావుపేట: దేశంలోనే మొదటి ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి దసరా రోజైన గురువారం కరీంనగర్ జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్‌లలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రూ.5.04 లక్షలతో ప్రతీ ఇంటిలో రెండు పడక గదులు, ఒక హాల్, కిచెన్, రెండు టాయిలెట్లు నిర్మిస్తామన్నారు. లబ్ధిదారులపై భారం పడకుండా ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని అన్నారు. మొదటి విడతగా రాష్ట్రంలో 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. గృహనిర్మాణ శాఖకు రూ.4 వేల కోట్లు కేటాయించామన్నారు. పైరవీలకు చోటులేకుండా అర్హులైన లబ్ధిదారులనే గుర్తించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు కూడా త్వరలోనే చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో రూ.16 వేల కోట్లతో రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.