పేదలందరికీ ఇళ్లు: కేటీఆర్
గంభీరావుపేట: దేశంలోనే మొదటి ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి దసరా రోజైన గురువారం కరీంనగర్ జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్‌లలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రూ.5.04 లక్షలతో ప్రతీ ఇంటిలో రెండు పడక గదులు, ఒక హాల్, కిచెన్, రెండు టాయిలెట్లు నిర్మిస్తామన్నారు. లబ్ధిదారులపై భారం పడకుండా ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని అన్నారు.
మొదటి విడతగా రాష్ట్రంలో 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. గృహనిర్మాణ శాఖకు రూ.4 వేల కోట్లు కేటాయించామన్నారు. పైరవీలకు చోటులేకుండా అర్హులైన లబ్ధిదారులనే గుర్తించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు కూడా త్వరలోనే చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో రూ.16 వేల కోట్లతో రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.