సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల కోసం ఏకంగా 17,005 కాలనీల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం ప్రపంచంలోనే అరుదైన అంశమని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రశంసించారు. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్‌ను ప్రత్యేకంగా నియమించడం అంటే ప్రభుత్వం పేదలకు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో స్పష్టం అవుతోందని అన్నారు. ఇటీవల ఆయన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపట్టారని తెలుసుకుని, స్వయంగా రాష్ట్రానికి వచ్చి పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల కాలనీలను చూస్తానని తెలిపారు.
సంతృప్త స్థాయిలో ఇళ్ల నిర్మాణం
దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో పేదలందరికీ సంతృప్త స్థాయిలో అంటే 30.76 లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులను యజ్ఞంలా కొనసాగిస్తోంది. తొలి దశలో వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నిర్మించే పేదల ఇళ్లకు ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు అంటే ఈ నెల 10వ తేదీ వరకు పండుగ వాతావరణంలో ఏకంగా 1.72 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది.
సెప్టెంబర్ నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా గృహ నిర్మాణ శాఖ చర్యలను చేపట్టింది. పేదల ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ గట్టి పట్టుదలతో ఉండటమే కాకుండా అందుకోసం ప్రత్యేకంగా జిల్లాకో జాయింట్ కలెక్టర్‌ను నియమించిన విషయం తెలిసిందే. 13 జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. దీంతో అన్ని ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. తొలి దశలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను రూ.28,084 కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది.
మెటీరియల్ సరఫరాలో జాప్యం ఉండదు
ఇళ్ల నిర్మాణాలకు మెటీరియల్ సరఫరాలో జాప్యం ఉండదు. ఇసుక, స్టీలు, సిమెంట్‌ను ఇప్పటికే గ్రామ, మండల స్థాయిల్లోని గోదాముల్లో నిల్వ చేశాం. ప్రత్యేకంగా జిల్లాకో జాయింట్ కలెక్టర్ బాధ్యత తీసుకున్నందున పేదల ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగంగా కొనసాగుతాయి. ఒక్క వారంలోనే 1.72 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. వీలైనంత త్వరగా అన్ని ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించి ముఖ్యమంత్రి నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేస్తాం.
– అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్
Comments
Please login to add a commentAdd a comment