సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ సామగ్రిలో (మెటీరియల్) రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా గృహ నిర్మాణశాఖ భారీగా ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసింది. తొలిదశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు ఇసుకను మినహాయించి మిగతా 12 రకాల మెటీరియల్‌కు రివర్స్ టెండర్లను నిర్వహించగా ఏకంగా రూ.5,120 కోట్ల మేర ఆదా అయింది. సిమెంట్, స్టీలు, డోర్లు, శానిటరీ, పెయింటింగ్, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, టాయిలెట్ సామాన్లు, నీటి సరఫరా తదితర 12 రకాల మెటీరియల్‌కు జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదం అనంతరం టెండర్లను ఆహ్వానించడమే కాకుండా అనంతరం రివర్స్ టెండర్లను గృహ నిర్మాణ శాఖ నిర్వహించింది. ఈ రివర్స్ టెండర్లు సత్ఫలితాలనిచ్చాయి. ఐఎస్‌ఐ మార్కు కలిగిన నాణ్యమైన మెటీరియల్ తక్కువ ధరకే లభ్యమయ్యాయి. 12 రకాల మెటీరియల్‌కు ఒక్కో ఇంటికి రివర్స్ టెండర్‌కు ముందు రూ.1,31,676 చొప్పున వ్యయం కానుండగా రివర్స్ టెండర్ల ద్వారా రూ.98,854కే లభించాయి. అంటే ఒక్కో ఇంటికి 12 రకాల మెటీరియల్‌లో రూ.32,822 చొప్పున ఆదా అయింది. తొలిదశలో నిర్మించనున్న 15.60 లక్షల ఇళ్లను పరిగణలోకి తీసుకుంటే మొత్తం రూ.5,120 కోట్లు ఆదా అయింది.
లబ్ధిదారుల ఐచ్ఛికమే
మన ఇంటికి ఎలాంటి నాణ్యమైన మెటీరియల్ వినియోగిస్తామో పేదల ఇళ్లకు కూడా అలాంటి మెటీరియలే సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అందుకు అనుగుణంగా నాణ్యమైన మెటీరియల్ తక్కువ ధరకు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నాం. 12 రకాల మెటీరియల్‌కు రివర్స్ టెండర్లు నిర్వహించగా ఒక్కో ఇంటి మెటీరియల్‌లో రూ.32,822 చొప్పున ఆదా అయింది. ప్రభుత్వం సరఫరా చేసే నాణ్యమైన, తక్కువ ధరకు దొరికే మెటీరియల్‌ను తీసుకోవాలా వద్దా అనేది ఇళ్ల లబ్ధిదారుల ఇష్టమే. వలంటీర్లు లబ్ధిదారుల వద్దకు వెళ్లి ప్రభుత్వం సరఫరా చేసే మెటీరియల్ వివరాలను తెలియచేస్తారు. లబ్ధిదారులు కోరిన మెటీరియల్ సరఫరా చేస్తాం. 12 రకాల మెటీరియల్‌లో ఒకటి లేదా రెండు కావాలన్నా కూడా అంతవరకే సరఫరా చేస్తాం. ఇది పూర్తిగా లబ్ధిదారుల ఐచ్ఛికమే. ఎక్కడా బలవంతం లేదు. – అజయ్‌జైన్, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్
Comments
Please login to add a commentAdd a comment