
సాక్షి, అమరావతి: కూల్ రూఫ్ పెయింట్ ద్వారా జగనన్న కాలనీల్లోని ఇళ్లలో ఉష్ణోగ్రతలు తగ్గించడంపై ప్రయోగం చేపడుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఇండో–స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ (బీఈఈపీ) ద్వారా జగనన్న కాలనీల్లోని ఇళ్లల్లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) చేపడుతున్న కూల్ రూఫ్ ప్రాజెక్టుపై మంగళవారం విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి అజయ్‌జైన్ వర్చువల్‌గా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం వార్షిక విద్యుత్ డిమాండ్ 60,943 మిలియన్ యూనిట్లు ఉంటే, అందులో భవనాలకు వాడుతున్నది 17,514 మిలియన్ యూనిట్లు (28 శాతం) ఉందన్నారు.
దీన్ని తగ్గించేందుకు జగనన్న ఇళ్లల్లో విద్యుత్ ఆదా చర్యలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కూల్ రూఫ్‌ను విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ జిల్లాల్లోని పన్నెండు ఇళ్లపై వేసి వచ్చే ఫలితాలను అధ్యయనం చేస్తామన్నారు.