
సాక్షి, తాడేపల్లి: జగనన్న కాలనీల మొదటి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 15లక్షల ఇళ్ల నిర్మాణం సాగుతోందని తెలిపారు. వర్షాకాలం పూర్తికావడంతో పనులు ఊపందుకున్నాయని చెప్పారు.
మౌలిక వసతుల కల్పన కోసం 34వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అజయ్ జైన్ తెలిపారు. పేదలనే చిన్న చూపు లేకుండా కాలనీల్లో అన్నీ మౌలిక వసతులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. దీనికోసం కేంద్ర పథకాలతో పాటు ఇతర ఆర్థిక సాయం తీసుకుంటున్నామని చెప్పారు. జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ 1000 నుంచి 1500 కోట్ల ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.
అండర్ గ్రౌండ్ విద్యుత్, విద్యుత్ పొదుపు చర్యలు తీసుకుంటున్నందుకు ఆ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. కాలనీల్లో మౌలిక వసతులపై కీలక దృష్టి పెట్టామని, సీఎం జగన్ ఆదేశాల మేరకు అక్కడ కావాల్సిన ప్రతి ఒక్క వసతి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జగనన్న కాలనీలు ఒక మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతామని అజయ్ జైన్ తెలిపారు.
చదవండి: మంత్రి పెద్దిరెడ్డి, అధికారులకు సీఎం జగన్ అభినందనలు