విజయవాడ ఊర్మిళా నగర్ వద్ద చివరి దశకు చేరుకున్న ఇళ్ల నిర్మాణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది నిరుపేద అక్క చెల్లెమ్మల సొంతింటి కలలు నెరవేరుతున్నాయి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలిదశ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ‘నవరత్నాలు–పేదలం దరికీ ఇళ్లు’ పథకం కింద 31 లక్షల మందికిపైగా పేదలకు ప్రభుత్వం పక్కా గృహాలను నిర్మిస్తోంది. తొలిదశలో 15.60 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ ఏడాది పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.13,100 కోట్లు వెచ్చిం చనుండటంతో నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా 1.54 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా కోసం రూ.1,121.12 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాయితీ కింద ఇచ్చే 3.46 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ కోసం రూ.2,425.50 కోట్లు, 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరాకు రూ.1,575.27 కోట్లు వ్యయం కానుంది. మిగిలిన నిధులను బిల్లుల చెల్లింపులు, ఇతర అవసరాలకు వెచ్చించనున్నారు.
రాయితీపై నిర్మాణ సామగ్రి
ఒక్కో ఇంటి నిర్మాణానికి ఉచితంగా 20 టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నారు. రాయితీపై మార్కెట్ ధర కన్నా తక్కువకు 140 బస్తాల సిమెంట్, 480 కిలోల ఐరన్ సహా ఇతర సామగ్రిని ప్రభుత్వమే సమకూరుస్తోంది. గతంలో 90 బస్తాల సిమెంట్ ఇవ్వగా ఇప్పుడు అదనంగా మరో 50 బస్తాలు ఇస్తున్నారు.
అదనపు చేయూత
సొంతిళ్లు నిర్మించుకునే అక్క చెల్లెమ్మలకు అదనంగా చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల ద్వారా స్వయం సహాయక బృందాల మహిళలకు పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నారు. రూ.35 వేల నుంచి ఆ పైన రుణ సాయం అందుతోంది. ఇప్పటివరకూ 3,59,856 మంది లబ్ధిదారులకు రూ.1,332.09 కోట్ల రుణం మంజూరైంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అత్యధికంగా చిత్తూరులో 69,170, అనంతపురంలో 49,918, తూర్పు గోదావరిలో 36,462 మంది రుణాలు పొందారు.
లబ్ధిదారులపై భారం తగ్గించేలా
ఊరికి దూరంగా ఉండే లేఅవుట్‌లలోకి సిమెంట్, ఐరన్, ఇతర సామాగ్రి తరలింపు భారం లబ్ధిదారులపై పడకుండా స్థానికంగా గోడౌన్‌ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. 66 పెద్ద లేఅవుట్‌లలో గోడౌన్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటికే 47 అందుబాటులోకి వచ్చాయి. ఇటుకల తయారీ యూనిట్లు కూడా లే అవుట్‌లలోనే ఏర్పాటు చేసి తక్కువ ధరలకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు.
ఆప్షన్–3 ఇళ్లపై పర్యవేక్షణ..
ప్రభుత్వమే నిర్మించే ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఆప్షన్–3ను ఎంచుకోగా గ్రూపులుగా విభజించి కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణాలు చేపడుతున్నారు. మొత్తం 25,430 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో కనీసం పదిమంది లబ్ధిదారులు ఉంటారు. వెయ్యి ఇళ్లకు ఒక వార్డు అమెనిటీ సెక్రటరీని కేటాయించి ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. లేఅవుట్ల నుంచే హాజరు నమోదుకు వీరికి అవకాశం కల్పిస్తున్నారు. రుణాల మంజూరుకు బ్యాంకులు, ఇతర అధికారులతో సమన్వయంతో వ్యవహరించే బాధ్యత అప్పగించారు.
నున్నలో నిర్మిస్తున్న పాపాయమ్మ ఇల్లు
వేగంగా నిర్మాణాలు
పేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల
కోసం లే అవుట్లలోనే ఇటుకల తయారీ యూనిట్లతో పాటు సామగ్రి రవాణా భారం లేకుండా గోడౌన్‌లు నిర్మించాం. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వెయ్యి ఇళ్లకు అమెనిటీ సెక్రటరీ, లే అవుట్‌కు డిప్యూటీ ఈఈలను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నాం.
– అజయ్‌జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
కష్టాలు తీరాయి..
కూలి పనులు చేసుకుంటూ మా అమ్మతో కలసి ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్తు దరఖాస్తు చేసుకున్నా నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఇంటి స్థలం రావడంతోపాటు నిర్మాణం కూడా పూర్తైంది. సుదీర్ఘ కల నెరవేరుతోంది. నా కష్టాలు తీరాయి.
– ఇందూరి మంగతాయమ్మ, చెరువుకొమ్ముపాలెం, ఎన్టీఆర్ జిల్లా
మరో 40 రోజుల్లో..
శ్రీకాళహస్తిలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. సంపాదనలో చాలావరకు అద్దెలకే ఖర్చవుతోంది. గతంలో ఇంటిపట్టా కోసం ఎంతో ప్రయత్నించినా రాలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక వలంటీర్ మా ఇంటికే వచ్చి వివరాలు నమోదు చేసుకున్నాడు. మాకు స్థలం, ఇల్లు మంజూరైంది. మరో 40 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది.
– రెడ్డిపల్లి సుబ్రహ్మణ్యం, ఊరందూరు, తిరుపతి జిల్లా
సొంతింట్లోకి దర్జీ కుటుంబం..
దర్జీగా పనిచేసే నా భర్త సంపాదనతో ఇద్దరు పిల్లలను చదివించి అద్దెలు కట్టేందుకు ఎంతో అవస్థ పడేవాళ్లం. మాకు స్థలంతో పాటు ఇల్లు మంజూరైంది. తక్కువ ధరకే సిమెంటు, ఐరన్, ఇతర సామాగ్రి ఇవ్వడంతో ఇంటిని నిర్మించుకున్నాం.
– రహీమా, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా
గృహ ప్రవేశం చేశాం
ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. రాయితీపై సిమెంట్ అందించారు. గృహ ప్రవేశం కూడా చేశాం. చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్ మాకు సొంత గూడు సమకూర్చారు.
– ఇస్సాకుల శేషారత్నం, నేమాం, కాకినాడ జిల్లా
రేకుల షెడ్డు నుంచి..
చక్కెర కర్మాగారంలో కూలీగా పనిచేసే నా భర్త సంపాదనలో నెలకు రూ.4 వేలు ఇంటి అద్దెకు ఖర్చయ్యేవి. ఒకదశలో అద్దె భారాన్ని భరించలేక ఫ్యాక్టరీ సమీపంలోని రేకుల షెడ్డులో తలదాచుకున్నాం. ఇప్పుడు మాకు ప్రభుత్వం సొంత గూడు కల్పించింది. ఈ ఏడాది జనవరిలో ఇంటి నిర్మాణం పూర్తైంది. తొమ్మిది నెలల్లో సొంతిల్లు కట్టుకున్నాం. బిల్లులు సక్రమంగా అందాయి. ఇటీవలే కొత్త ఇంట్లోకి వచ్చాం.
– మామిని పాడి, పాలకొండ అర్బన్, పార్వతీపురం మన్యం జిల్లా
అదనంగా 50 బస్తాల సిమెంట్ ..
బేస్‌మెంట్ లెవెల్ పూర్తి చేసి లెంటల్ లెవెల్ వరకు ఇంటిని నిర్మించుకున్నాం. ఉచితంగా ఇసుక, రాయితీపై సిమెంటు, స్టీలు ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 90 బస్తాల సిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు అదనంగా మరో 50 బస్తాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఇది మాకెంతో ఉపయోగపడుతుంది.
– ఖైరున్నిసాబీ, పార్నపల్లె, నంద్యాల జిల్లా
సొంతిల్లు కడుతున్న మేస్త్రి
విజయవాడలోని నున్నలో నివసించే భూలక్ష్మి మిషన్ కుడుతూ.. భర్త శ్రీనివాసరావుకు తోడుగా నిలుస్తోంది. వీరు 20 ఏళ్లకుపైగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. చాలాసార్లు ఇంటి నిర్మాణానికి ప్రయత్నించినా అక్కడ సెంటు స్థలం రూ.10 లక్షల వరకు పలుకుతుండటంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఇంటి స్థలం మంజూరైంది. శ్రీనివాసరావు తాపీ మేస్త్రీ కావడంతో తనే స్వయంగా దగ్గరుండి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఇటీవల స్లాబ్ వేశారు. స్థలంతో పాటు రూ.1.80 లక్షలు ఆర్థిక సాయం అందిందని, పొదుపు సంఘం ద్వారా రూ.50 వేలు లోన్ తీసుకున్నానని.. ఇంటి నిర్మాణం పూర్తి కావచ్చిందని భూ లక్ష్మి ఆనందంగా చెబుతోంది.
తరతరాల కోరిక తీరింది..
విజయవాడ నున్న ప్రాంతంలో ఇళ్లలో పనులకు వెళ్లే పాపాయమ్మ కొద్ది నెలల క్రితం పక్షవాతం బారిన పడటంతో మంచానికే పరిమితమైంది. భర్త అప్పారావు రిక్షా కార్మికుడు. వీరికి తరతరాలుగా సొంతిల్లే లేదు. ఇంటి స్థలం, ఇల్లు కోసం ఎన్నోసార్లు విఫలయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక చివరి ప్రయత్నంగా వలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాపాయమ్మకు రూపాయి ఖర్చు లేకుండా సొంతిల్లు మంజూరైంది. ఇల్లు నిర్మించుకుంటున్నారు. త్వరలో గృహ ప్రవేశం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment