
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సామర్థ్యంతో కూడిన గృహోపకరణాలను పేదలకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటోందని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. తద్వారా ఏటా రూ.350 కోట్ల విలువైన విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఇంధన శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ సీడ్కో), హౌసింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అజయ్ జైన్ మాట్లాడారు.
ఆ వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆదివారం వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు పథకం కింద మొదటిదశలో నిర్మించే 15.60 లక్షల ఇళ్లకు విద్యుత్ పొదుపు చేయగల గృహోపకరణాలను మార్కెట్ ధరల కన్నా తక్కువకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనివల్ల ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉందని అజయ్ జైన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి లబ్ధిదారుడికి నాలుగు ఎల్‌ఈడీ బల్బులు, రెండు ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఇంధన సామర్థ్య ఫ్యాన్లు అందజేస్తామన్నారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) నుంచి ఏపీ సీడ్కో ద్వారా వీటిని సేకరిస్తామని చెప్పారు.
నాణ్యతలో రాజీపడొద్దన్న సీఎం
నాణ్యతలో రాజీపడకుండా అత్యుత్తమ ఇంధన సామర్థ్య గృహోపకరణాలను లబ్ధిదారులకు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. మార్కెట్ ధరతో పోలిస్తే 30 నుంచి 35 శాతం తక్కువ ధరకు ఉపకరణాలను ఏపీకి అందచేసేందుకు ఈఈఎస్‌ఎల్ సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు. ఎల్‌ఈడీ బల్బుల వినియోగం వల్ల 90 శాతం విద్యుత్, ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్ వల్ల 60 శాతం, ఇంధన సామర్థ్య ఫ్యాన్ వల్ల 50 శాతం విద్యుత్ ఆదా అవుతుందని ఈఈఎస్‌ఎల్ అంచనా వేసిందని చెప్పారు.
స్వచ్ఛందంగా ముందుకొచ్చే లబ్ధిదారులకే ఈ ఉపకరణాలు అందచేస్తామన్నారు. జగనన్న కాలనీల్లో విద్యుదీకరణ, ఇంటర్నెట్ కోసం రూ.7,989 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. గృహనిర్మాణ పథకంలో ఇండోస్విస్ ఇంధన భవన నిర్మాణ సాంకేతికతను వినియోగిస్తున్నందున ఇంటిలోపల రెండుడిగ్రీల ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంటుందని అజయ్ జైన్ చెప్పారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ్‌భరత్ గుప్తా, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, హౌసింగ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.శివప్రసాద్, చీఫ్ ఇంజనీర్ జి.వి.ప్రసాద్, ఏపీసీడ్కో అధికారులు పాల్గొన్నారు.