‘డబుల్’ ఇళ్లకు అప్పులే దిక్కు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ‘అప్పుల’తో నెట్టుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగానే బడ్జెట్‌లో నామమాత్రంగా రూ.860 కోట్లే కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లు, రాజధాని హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వాటిని హ డ్కోతోపాటు ఇతర సంస్థల నుంచి రుణం తెచ్చి పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
అంత రుణం సాధ్యమా?
ప్రభుత్వం చెబుతున్న రెండు లక్షల ఇళ్లతోపాటు గత సంవత్సరం మంజూరు చేసి పనులు ప్రారంభించని మరో 60 వేల ఇళ్లను పూర్తి చేయాలంటే దాదాపు రూ.16 వేల కోట్లు కావాలి. కానీ బడ్జెట్‌లో కేటాయిం చింది రూ.860 కోట్లే. మిగతా సుమారు రూ.15వేల కోట్లను ఒకే సంవత్సరం వ్యయం చేయడం సాధ్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతేడాది మంజూరు చేసిన 60 వేల ఇళ్ల కోసం హడ్కో నుంచి రూ.3,500 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు గృహనిర్మాణ శాఖకు సర్కారు అనుమతి ఇచ్చింది. అది పోను మి గతా అప్పు ఈ సంవత్సరమే అంటే ఎలా సాధ్యమో ప్రభుత్వం స్పష్టం చేయలేదు. మొత్తంగా కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ కొన్ని ‘డబుల్’ ఇళ్లను నిర్మించి చూ పే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల బకాయిల చెల్లింపుపైనా అస్పష్టతే కొనసాగుతోంది. ఆ పథకం పేరుతో బడ్జెట్‌లో నిధులు ప్రతిపాదించక పోవడమే దీనికి కారణం.