రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాల యాల్లో అర్చకులకు ఒకటో తేదీనే కచ్చితంగా వేతనాలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతన చెల్లింపు విధానాన్ని అమలు చేస్తామని, ఇందుకోసం దేవాదాయ చట్ట సవరణ చేస్తామని తెలిపారు. అవసరమైతే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతామని తెలిపారు. సమాజంలో గౌరవంగా బతికే రీతిలో వేతనాల చెల్లింపు ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించాలని అర్చకులు, దేవాలయాల ఉద్యోగులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్ల సాధన కోసం దేవాలయ అర్చకులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి ఆందోళన చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సలహాదారు రమణాచారి, కమిషనర్ శివశంకర్‌లతో సుదీర్ఘంగా సమీక్షించారు. అర్చక సంఘాల ప్రతినిధులు గంగు భానుమూర్తి, గంగు ఉపేంద్రశర్మ, దేవాలయ ఉద్యోగుల ప్రతినిధులు రంగారెడ్డి, మోహన్ తదితరులు కూడా భేటీలో పాల్గొన్నారు.