అది కాంగ్రెస్ గుంపుల పంచాయితీ
రైతు గర్జన సభపై ఇంద్రకరణ్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్‌లో రైతు గర్జన సభ జరిపింది తమ పార్టీలోని ఆధిపత్య పోరు, గుంపుల పంచాయితీ వల్లేనని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆ పార్టీపై ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు రైతు గర్జన పేరుతో రైతులను మరో సారి వంచించారని, ఆత్మద్రోహం చేసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీలు పురాణం సతీశ్, డాక్టర్ భూపతిరెడ్డిలతో కలసి బుధవారం ఆయన టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
తలాపునే గోదావరి ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించకుండా, జనానికి కనీసం తాగునీరు అందకుండా చేశారని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. అభివృద్ధికి అడ్డుపడే ఏ పార్టీకీ తెలంగాణలో పుట్టగతులు ఉండవని మంత్రి హెచ్చరించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అక్రమంగా సంపాదించిన సొమ్ముతోనే జిల్లాలో కాంగ్రెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. దశాబ్దాల తరబడి ప్రజలను ముంచిన వారే ప్రతిపక్షంలోకి రాగానే పునీతులై నట్లు ప్రభుత్వంపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు.