కృష్ణా పుష్కరాలకు రూ.825 కోట్లు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కృష్ణా పుష్కరాలకు రూ.825 కోట్లు కేటాయిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
స్నానఘట్టాలకు, రోడ్ల విస్తరణకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండలో 86 స్నానఘట్టాల నిర్మాణానికి రూ.212 కోట్లు, రోడ్ల విస్తరణకు రూ.398 కోట్లు కేటాయించామని వివరించారు. మార్చి మొదటివారంలో పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారలతో సమీక్ష నిర్వహిస్తామని, మార్చి 15 నుంచి పుష్కరాల పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 12న కృష్ణా పుష్కరాలు ప్రారంభంకానున్నాయి.