బాసరలోని అమ్మవారు
భైంసా టౌన్/బాసర(ముథోల్): చదువుల తల్లి కొలువైన బాసర పుణ్యక్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వసంత పంచమి సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం రాత్రి 2 గంటల నుంచే ఆలయంలో భక్తులు క్యూలైన్‌లో నిరీక్షిస్తూ కనిపించారు. వేదపండితులు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జెడ్పీ చైర్‌పర్సన్ శోభా సత్యనారాయణ గౌడ్‌తోపాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. లక్షకు పైగానే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
5,850 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం
వసంతి పంచమి సందర్భంగా ఆలయంలో 5,850 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. రూ.100, రూ.1000 అక్షరాభ్యాసం టికెట్లతోపాటు ప్రత్యేక దర్శనం టికెట్లు, లడ్డూ, పులిహోర అమ్మకాల ద్వారా ఆదివారం ఒక్కరోజే ఆలయానికి రూ.42,49,350 ఆదాయం సమకూరినట్లు ఆలయ ప్రత్యేకాధికారి ఎ.సుధాకర్‌రెడ్డి తెలిపారు.
భక్తులకు ఇబ్బందులు..
ఈ ఏడాది బాసరకు భక్తుల తాకిడి పెరిగింది. వీఐపీ క్యూలైన్‌లో కూడా బారులు తీరి కనిపించారు. రూ.వెయ్యి అక్షరాభ్యాసం క్యూలైన్ పరిస్థితి కూడా అలాగే కనిపించింది. ఆలయ అధికారుల సమన్వయ లోపం కారణంగా సుమారు ఐదు గంటలపాటు భక్తులు క్యూలో ఇబ్బందులు పడ్డారు. అక్షరాభ్యాస పూజల అనంతరం భక్తులను మండపం నుంచి పంపించే ఏర్పాట్లలోనూ అధికారులు విఫలమయ్యారు. దీంతో అక్షరాభ్యాస మండపం నుంచి గర్భగుడికి వెళ్లే మార్గంలో గంటలపాటు భక్తులకు నిరీక్షణ తప్పలేదు. శనివారం రాత్రి బాసర చేరుకున్న సామాన్య భక్తులకు అతిథిగృహాలు దొరకలేదు. అనేకమంది చలిలో ఆలయ ఆవరణలోనే రాత్రంతా జాగరణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment