నిర్మల్: మరో మూడు రోజుల్లో బాసరలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరానున్నారు. బాసరకు వచ్చే భక్తులంతా సమీపంలోని గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తారు. అయితే గోదావరి తీరం.. ప్రమాదభరితంగా మారింది. భక్తుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోతుంది.
ఈయేడు భారీ వర్షాలతో గోదావరి ప్రస్తుతం నిండుగా ప్రవహిస్తోంది. వరదలకు కొట్టుకువచ్చిన నల్లమట్టి స్నాన ఘట్టాలపై పేరుకుపోయింది. దీంతో స్నానాలు చేసే భక్తులు జారి నదిలో డుతున్నారు. ఒకపక్క గోదావరిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోపక్క అధికారుల నిర్లక్ష్యంతో పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తులు మృత్యువాతపడుతున్నారు.
ఇదివరకే ఇలా..
► 'అక్టోబర్ 1న నిజామాబాద్‌లోని పాములబస్తీకి చెందిన సంతోష్(18) స్నేహితులతో కలిసి బాసరకు వచ్చాడు. గోదావరి నదిలో స్నానాల కోసం దిగి మృతిచెందాడు.'
► 'అక్టోబర్ 6న నిజామాబాద్‌లోని గాజులపేట్‌కు చెందిన దుబ్బాక ఒడ్డయ్య(35) కూతురు పుట్టు వెంట్రుకలు తీసేందుకు బాసరకు వచ్చాడు. ఆనవాయితీ ప్రకారం గోదావరి నదిలో తెప్పను వదిలేందుకు దిగాడు. నీటిలోనే మునిగి మృతిచెందాడు.'
► 'ఈనెల మొదటి వారంలోనే ఇద్దరు భక్తులు నదిలో ముగిని చనిపోయారు. గోదావరి నది వద్ద తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదు.'
15 నుంచి ఉత్సవాలు..
ఈనెల 15 నుంచి 23 వరకు బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు తరలిరానున్నారు. ఉత్సవాల నేపథ్యంలోనైనా స్నానఘట్టాల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. స్నానఘట్టాల నిర్మాణ సమయంలో లోపాల కారణంగా కాలుజారితే లోపలికి వెళ్లిపోయే పరిస్థితి ఉంది.
బాసర గోదావరి నదిలో ప్రస్తుతం ఐదు అడుగుల లోతు నీటి వద్ద కంచెలాంటిది ఏర్పాటు చేయాలి. ప్రమాదవశాత్తు స్నానాలు చేసే సమయంలో భక్తులు జారిపడ్డా ఐదు అడుగుల కంచె వద్దే ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయం ఆలయ అధికారులకు తెలిసినా చర్యలు చేపట్టడంలేదు.
యువకులు ఆందోళన చేసినా..
బాసర యువకులు గతంలో ఆందోళన చేసినా స్నానఘట్టాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. గోదావరి తీర ప్రాంతంలో స్నానఘట్టాల వద్దే ఈప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నీళ్లు చూస్తే ప్రతి ఒక్కరికీ అందులోదిగి స్నానం చేయాలన్న ఆతృత ఉంటుంది. ఇక స్నేహితులతో కలిసి వచ్చేవారు నది నీటిలో గంటలతరబడి స్నానాలు చేస్తుంటారు.
కొత్తగా వచ్చే ఈ యువకులు ఆనందంలో నీటి లోతును అంచనా వేయలేక లోపలికి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. బాసర ఆలయ అధికారులకు యువకులు గతంలో వినతిపత్రాలు ఇచ్చారు. జరుగుతున్న సంఘటనలపై బాసర పోలీసులు సైతం ఫిర్యాదు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలోనైనా భక్తులకు ఇబ్బంది కలుగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని యువకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment