నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి మూడు స్థానాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. టికెట్ దక్కిన నాయకులు, పోటీ చేసే అవకాశం కోల్పోయిన వారి మధ్య దూరం ఏర్పడుతోంది. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్రాబల్యం క్రమంగా తగ్గిపోతోంది. ఇంకా వచ్చే జనవరి వరకు శాసనసభ్యుల పదవీ కాలం ఉన్నప్పటికీ అంతకుముందే పరిస్థితి మారిపోతోంది. ఇక ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక, కేడర్ బాగోగులు, పార్టీ కార్యక్రమాలన్నీ అభ్యర్థుల కనుసన్నల్లోనే సాగుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అధికార బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్తవారికి అవకాశం టికెట్ ఇచ్చారు. దీంతో పరిస్థితి మారిపోయింది. పార్టీ కేడర్, జనంతోపాటు కొందరు అధికారులు సైతం అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
కాంగ్రెస్‌లో చేరుతారని..
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్‌ఎస్‌లోనూ ఉండి, కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేశారు. ఆమె భర్త రిటైర్డ్ రవాణాశాఖ అధికారి కాంగ్రెస్‌లో చేరి ఆసిఫాబాద్‌లో పట్టు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె కూడా కాంగ్రెస్‌లో చేరుతారని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు క్రమంగా దూరమవుతూ బీఆర్‌ఎస్ అభ్యర్థి జాన్సన్‌నాయక్‌కు దగ్గరవుతున్నారు. కొందరు ఇంకా కొన్నాళ్లు పదవీ కాలం ఉండడంతో అప్పటి వర కు వేచీ చూద్దామనే ఆలోచనతోనూ ఉన్నారు. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పార్టీ మారితే ఎంతమంది ఆమె వెంట నడుస్తున్నారనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు అన్నీ కొత్త అభ్యర్థి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి.
సఖ్యత బయటకేనా?
బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కుకు ఈసారి టికెట్లు రాక, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్‌కు అవకాశం లభించింది. ఈ రెండు చోట్ల అభ్యర్థులు, ఎమ్మెల్యేలు కలిసి పని చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. వీరి మధ్య సఖ్యత కుదిరేలా చర్యలు చేపట్టింది. ఈ రెండు చోట్ల ఎమ్మెల్యేల ప్రాబల్యం తగ్గుతోంది.
కుమురంభీం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి అధికార, పార్టీ కార్యక్రమాల్లో అన్నీ తానై ముందుకు సాగుతున్నారు. అటు అధికారులు, ఇటు కార్యకర్తలు ఏ పనికై నా ఆమెనే ముందు కలుస్తున్నారు. ఇక బోథ్‌లోనూ బాపురావు, అనిల్ జాదవ్ మధ్య సఖ్యత ఉందని బయటకు చెబుతున్నప్పటికీ లోపల పరిస్థితి వేరేలా ఉంది. తనకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందనే భావనలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనిల్ విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
లబ్ధిదారుల ఎంపికలో ఇరకాటం..
ఎన్నికల ముందు ప్రభుత్వం అందిస్తున్న బీసీ, మైనార్టీ బంధు, గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి, దళితబంధు రెండో విడతలో ఒక్కో నియోజకవర్గంలో 1100యూనిట్లు ఎంపిక చేయాల్సి ఉంది. గతంలో పార్టీ కేడర్‌కు మాటిచ్చిన ఎమ్మెల్యేలకు తాజా పరిణామాలతో ఆయా పథకాల్లో తాము కోరుకున్న వారిని ఎంపిక చేయాలంటే ఇబ్బందికరంగా మారింది. తన అనుకునేవారికి ఇస్తే కొత్త అభ్యర్థులతో సమస్య ఉంది.
అలా కాక కొత్త అభ్యర్థి సూచించిన వారికి ఇస్తే తన కేడర్‌కు సమస్య ఉంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఇద్దరు కలిసి లబ్ధిదారుల ఎంపికల్లో సగం సగం చొప్పున యూనిట్లను పంచుకున్నట్లు సమాచారం. మరోవైపు కొన్ని చోట్ల సంక్షేమ పథకాలు అందేలా చేస్తామని కొందరు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాళ్లు బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే పదవిలో ఉన్నవారు రాజకీయంగా ఇబ్బంది పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవీ కాలం వరకు వేచి చూసి ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక, నిధులు ఖర్చయ్యే వరకు గప్‌చుప్‌గా ఉండాలని అనుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment