నిర్మల్: ఎన్నికల షెడ్యూల్ వచ్చి మూడు రోజులైనా జిల్లాలో ప్రచారం ఊపందుకోవడం లేదు. అసలు కొంతమంది అభ్యర్థులు ప్రజల్లోకే రావడం లేదు. ఎన్నికల సందడే కనిపించడం లేదు. ఎందుకంటే..!? ఇప్పుడంతా పితృపక్షాలు నడుస్తున్నాయి.
శాస్త్రం ప్రకారం ఈ మాసంలో కొత్త పనులు చేపట్టొద్దు. ఈనెల 14న అమావాస్య ఉంది. అమావాస్య పోగానే శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. వాటితోపాటే ప్రచారపోరు షురూ చేస్తామని అభ్యర్థులంటున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థుల ప్రకటన కూడా దసరా నవరాత్రుల్లోనే ఉండే అవకాశం ఉంది.
ప్రచార రథాలు సిద్ధం..
ప్రతీ అభ్యర్థి తన ప్రచార కోసం ప్రత్యేకంగా రథాన్ని(వాహనాన్ని) తయారు చేయించుకుంటారు. ఈ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు, టికెట్ గ్యారంటీగా వస్తుందన్న ఆశావహులు ప్రచార రథాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. బీఆర్‌ఎస్ ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రత్యర్థులకంటే ముందే సిద్ధమయ్యారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఊరూరా చుట్టివచ్చేందుకు వాహనాన్ని సిద్ధం చేయించారు.
గులాబీవర్ణంలో, సీఎం కేసీఆర్, కేటీఆర్‌తోపాటు అల్లోల ఫొటో ప్రముఖంగా కనిపించేలా తీర్చిదిద్దారు. ఖానాపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి జాన్సన్‌నాయక్ సైతం ప్రచార రథం సిద్ధం చేయించారు. ముధోల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాత్రం ఈనెల 8న బాసరలో తన ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఇక నిర్మల్ టికెట్ దాదాపు ఖరారైన బీజేపీ, కాంగ్రెస్ ఆశావహులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, శ్రీహరిరావులు సైతం తమ ప్రచార రథాలను సిద్ధంచేసుకున్నారు.
అభ్యర్థుల ప్రకటన అప్పుడే..
స్థానిక అభ్యర్థులు, ఆశావహులే కాదు.. పార్టీలూ సెంటిమెంట్ ప్రకారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు ఇప్పటికీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. రేపుమాపు అంటూ మొత్తం మీద ఈ అమావాస్య తర్వాతే సీట్ల కేటాయింపు ప్రకటించేలా ఉన్నాయి. జిల్లాలో బీజేపీ నుంచి నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఒక్కరే టికెట్ ఆశిస్తుండగా, ముధోల్‌లో పడకంటి రమాదేవి, రామారావుపటేల్, మోహన్‌రావుపటేల్, బాజీరావుపటేల్ ఆశిస్తున్నారు.
ఇక ఖానాపూర్‌లో రాథోడ్ రమేశ్, జానకీబాయి, హరినాయక్ తదితరులు టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నిర్మల్‌లో శ్రీహరిరావు ముందువరుసలో ఉండగా, ముధోల్‌లో డాక్టర్ కిరణ్‌కుమార్, ఆనంద్‌రావుపటేల్, విజయ్‌కుమార్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఖానాపూర్‌లో భరత్‌చౌహాన్, చారులతరాథోడ్, వినోద్‌నాయక్ తదితరులు పోటీ పడుతుండగా వెడ్మ బొజ్జు పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
ఎన్నికల పండుగ..
మొత్తం మీద దసరా నవరాత్రుల్లోనే అసలైన ఎన్నికల పండుగ వాతావరణం కనిపించనుంది. పితృపక్షాలు పూర్తయిన తర్వాతే ప్రచార జోరు మొదలుకానుంది. దసరా పండుగ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అభ్యర్థులు, ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగతంగా పండుగ నజరానాలు, దావత్‌లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి దసరా మాములుగా ఉండదంటూ సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే పోస్టులు పెడుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment