నిర్మల్: కొన్నిరోజుల నుంచి ఊహిస్తున్నట్లే కారు పార్టీ టికెట్లు ఖరారయ్యాయి. సీనియారిటీతోపాటు ప్రజల్లో ఉన్న పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని బీఆర్‌ఎస్ సోమవారం తమ అభ్యర్థులను ప్రకటించింది. నిర్మల్ సీటు మళ్లీ ఇంద్రకరణుడినే వరించింది. అసమ్మతిరాగం వినిపించినా ముధోల్ టికెట్ విఠల్‌రెడ్డికే దక్కింది. కొంతకాలంగా ఊహిస్తున్నట్లుగానే ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు షాక్ తప్పలేదు.
ఆ స్థానాన్ని మారుస్తూ మంత్రి కేటీఆర్ మిత్రుడైన భూక్య జాన్సన్‌నాయక్‌కు ఇచ్చారు. మొత్తం మీద మూడు నియోజకవర్గాల్లో గులాబీశ్రేణులు ఆశించినట్లుగానే పార్టీ అధిష్టానం సీట్లు ఖరారు చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ, కేసీఆర్, కేటీఆర్‌లకు పాలాభిషేకాలు చేస్తూ, స్వీట్లు పంచుతూ సంబురాలు చేశారు.
అడ్డులేని ‘అల్లోల’..
నిర్మల్ నియోజకవర్గం నుంచి ఎలాంటి పోటీ, అసమ్మతి వర్గాలు లేకుండా ఉన్న అల్లోలకే మళ్లీ పార్టీ పట్టం కట్టింది. రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ఇంద్రకరణ్‌రెడ్డిని ఖరారు చేసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు ఇప్పటికీ ప్రజల్లో ఆయనపై అభిమానం, విశ్వసనీయత ఉండటంతో పార్టీ అల్లోలకే టికెట్ ఇస్తోంది.
వ్యక్తిగతంగా వయసు మీద పడుతున్నా.. ఇప్పటికీ ఎక్కడా తగ్గకుండా నిత్యం ప్రజల్లో ఉండటం, సమస్యల పరిష్కారంలోనూ చురుకుగా ఉంటారన్న పేరు రావడం, వీటన్నింటికీ తోడుగా అ టు సీఎం కేసీఆర్, ఇటు మంత్రి కేటీఆర్‌తోనూ సత్సంబంధాలు కలిగి ఉండటం అల్లోలకు కలిసివచ్చాయి.
గడ్డిగారికే మొగ్గు..
సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి టికెటిస్తే తామంతా పనిచేసేది లేదని కొంతకాలంగా ముధోల్‌లో అసమ్మతి రగులుతున్నా.. బీఆర్‌ఎస్ మాత్రం మళ్లీ గడ్డిగారివైపే మొగ్గు చూపింది. వరుసగా రెండుసార్లు గెలువడం, నియోజకవర్గంలో ఇప్పటికీ ఆయనపై నమ్మకం ఉండటం కలిసివచ్చింది. ఓసీ వర్గాలతో పాటు బీసీల్లో ప్రధానంగా మున్నూరుకాపులు సైతం ఆయనకు మద్దతు పలకడంతో పార్టీ విఠల్‌రెడ్డికే సీటిచ్చింది.
ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ దండె విఠల్‌తోపాటు సీనియర్లు రాజేశ్‌బాబు, సూర్యకాంత్‌రావు తదితరులు టికెట్ ఆశించారు. ప్రస్తుత బీజేపీ ప్రభావిత పరిస్థితుల్లో ముధోల్‌లో కొత్తప్రయోగం చేసే ఆలోచన పార్టీ చేయలేదన్నది స్పష్టమైంది. సౌమ్యుడిగా పేరున్న విఠల్‌రెడ్డి వైపే బీఆర్‌ఎస్ మొగ్గు చూపింది.
జాన్సన్‌కు జాక్‌పాట్..
ఖానాపూర్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన అతితక్కువ సమయంలోనే భూక్య జాన్సన్‌నాయక్ జాక్‌పాట్ కొట్టేశారు. తను అనుకున్నట్లుగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై తీవ్రంగా ఉన్న వ్యతిరేకతే ఆయనకు పార్టీ పరంగా బలంగా మారింది.
జగిత్యాల జిల్లా కు చెందిన జాన్సన్ మంత్రి కేటీఆర్‌కు దగ్గరి మిత్రుడు కావడం, ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఖానాపూర్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం కలిసి వచ్చింది. ప్రధానంగా మంత్రి కేటీఆర్ సపోర్ట్‌తోనే ఆయనకు టికెట్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment